Sukumar : లెక్కల మాస్టారు రెండు దశాబ్దాల జర్నీ..

Sukumar : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొన్న మొన్నటివరకు టాలీవుడ్ కే పరిమితమైన ఈ స్టార్ దర్శకుడు ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఓ బ్రాండ్. వరుస బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటూ, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద లెక్కలు సరిచేసిన లెక్క‌ల మాస్టారు ఈయన. రాజమౌళి లాంటి దర్శక ధీరుడు కూడా సుకుమార్ లాంటి దర్శకుడు మాస్ సినిమా చేసాడంటే మేము షెడ్డుకెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నాడంటే సుకుమార్ ఏ రేంజ్ దర్శకుడో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ ప్రారంభం నుంచీ కూడా తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం, సరికొత్త కథా, కథనాలతో పాటు వైవిధ్యమైన స్క్రీన్ ప్లే తో కూడిన సినిమాని తెర మీద ఆవిష్కరిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక పుష్ప ది రూల్ తో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్దమవుతున్నాడు సుకుమార్. అయితే నేటితో (మే 7న) తన 20 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు సుకుమార్. ఈ సందర్బంగా సుకుమార్ సినీ జర్నీపై ఓ లుక్కేద్దాం.

ఆర్య తో మొదలైన ప్రయాణం..

అల్లు అర్జున్‌, అనురాధ మెహతా జంటగా నటించిన ‘ఆర్య‘ సినిమాతో సుకుమార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమమైన సంగతి అందరికీ తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ 2004 మే 7వ తేదీన థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించింది. నేటికీ ఈ సినిమా వచ్చి 20 ఏళ్ళయిందన్నమాట. వ‌న్ సైడ్ ల‌వ్ అనే పాయింట్ తో తీసిన ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించడమే గాక, సుకుమార్ కి తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఇక బన్నీ, దిల్ రాజు లని ఇండస్ట్రీ లో స్థిర పడేలా చేసింది. ఫీల్ మై లవ్ అంటూ ఫీల్ గుడ్ సినిమాతో వచ్చి హిట్టు కొట్టగా, ఎన్నో అవార్డులు రివార్డులు సుకుమార్ అందుకున్నారు. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డ్ సాధించారు. ఇక ఈ సినిమా అదే పేరుతో మలయాళంలోకి డబ్బింగ్ చేయబడి కేరళలోనూ మంచి హిట్టు కొట్టింది. ఇక సుకుమార్ రెండో సినిమా ‘జగడం’ కమర్షియల్ సక్సెస్ అందుకోకపోయినా, సుకుమార్ క్రియేటివిటీని చూపించింది. సెన్సిబిలిటీస్ ఉన్న యాక్షన్ కథతో, టేకింగ్ పరంగా వైవిధ్యం చూపించి, విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. అల్లు అర్జున్ తో మళ్ళీ ‘ఆర్య 2’ తీయగా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, దర్శకుడిగా సుకుమార్ కు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఈ మూవీ బన్నీని స్టైల్‌కు పర్యాయపదంగా మార్చేసిందని చెప్పాలి. 2011లో సుకుమార్ తెరకెక్కించిన సినిమా ‘100% లవ్’. చైతూని సరికొత్తగా చూపించిన ఈ సినిమా, యూత్ తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది.

రంగస్థలం తో నంబర్ వన్ రేసులో..

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘1 నేనొక్కడినే’. 2014లో వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అంతగా ఆడకపోయినా, సుక్కూ టేకింగ్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. మహేశ్ లాంటి స్టార్ హీరోని పెట్టుకొని కమర్షియల్ మూవీ చేయకుండా, ఇలాంటి ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని తీసినందుకు అందరూ దర్శకుడిని మెచ్చుకున్నారు. ఇక మహేష్ కూడా ఈ సినిమా ప్లాప్ అయినా, సుకుమార్ కి గుర్తుండి పోయే సినిమా ఇచ్చావని ప్రశంసించారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ తో చేసిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా డీసెంట్ హిట్ అయింది. సుక్కూ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే రైటింగ్ గురించి మరోసారి మాట్లాడుకునేలా చేసింది. ఇందులో తారక్ తన కెరీర్ లోనే సరికొత్తగా కనిపించరు. ఇక గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’. దర్శకుడిగా సుకుమార్ ని దేశ వ్యాప్తంగా మాట్లాడుకునేలా చేసిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా ఇతర భాషల్లో అప్పుడు డబ్ కాకపోయినా, సోషల్ మీడియాలో సబ్ టైటిల్స్ వేసుకుని చూసి, సుకుమార్ క్రియేటివిటీని మెచ్చుకున్నారు. ఇక రంగస్థలం సినిమా టాలీవుడ్ కల్ట్ క్లాసిక్స్ లో ఒకటిగా చెప్తారు సినీ ప్రియులు. 80స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన ఈ పీరియడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వినికిడి లోపం ఉన్న యువకుడిగా చరణ్ ని చూపించి ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు సాధించింది. ఇక ఈ సినిమాతో రాజమౌళి తర్వాత నంబర్ వన్ రేసులో సుకుమార్ (Sukumar) నిల్చున్నారు.

- Advertisement -

పుష్ప తో రూల్ చేయడానికి రెడీ..

ఇక మూడేళ్ళ కింద సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా ‘పుష్ప: ది రైజ్’. 2021లో రిలీజైన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆయన క్రియేట్ చేసిన పుష్పరాజ్ పాత్ర, తగ్గేదే లే మేనరిజమ్ హిందీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే నార్త్ మార్కెట్ లో ఇది 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ ఫిలిం అవార్డ్ సాధించారు. ఇక దీనికి రెండో భాగంగా వస్తున్న ‘పుష్ప: ది రూల్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది ఆగష్టు 15న ఈ సినిమా విడుదలవుతుండగా, ఈ సినిమా పక్కా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక సుకుమార్ ఈ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు