20Years For Arya : ‘ఆర్య’ కల్ట్ ప్రేమకు 20 ఏళ్ళు..

20Years For Arya : టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ బిగినింగ్ నుండి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఈనాడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక తొలి సినిమాతో విమర్శలు ఎదుర్కొన్నాడో, మలి సినిమాతో అన్ని ప్రశంసలు అందుకున్నాడు. అల్లు అర్జున్ ని యూత్ లో ఎంతో దగ్గర చేసిన సినిమా “ఆర్య”. అంతే కాదు నటన పరంగా కూడా ఎన్నో మెట్లు ఎక్కించింది. ఫీల్ మై లవ్ అంటూ, ప్రేక్షకుల్ని తన ప్రేమపై కాస్త ఫీల్ అవమన్నాడు. అంతే తన నిజమైన ప్రేమకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అంతే కాదు టాలీవుడ్ లో దిల్ రాజుని బడా ప్రొడ్యూసర్ గా మార్చి, టాలీవుడ్ కి లెక్కల మాస్టారు సుకుమార్ ని పరిచయం చేసిన సూపర్ హిట్ మూవీ ఇది. ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం నేటితో (may7) 20 ఏళ్ళు (20Years For Arya)పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఆర్య చిత్ర విశేషాలని ఒకసారి గుర్తు చేసుకుందాం.

సింగిల్ సిట్టింగ్ లో ఒప్పించిన సుకుమార్..

మామూలుగా ఒక సినిమా కొత్త దర్శకుడి ద్వారా సెట్స్ పైకి వచ్చింది అంటే తెరవెనుక ఎన్ని కథలు జరిగుంటాయో తెలీదు. దర్శకుడు కథ రాసుకున్న తరువాత కూడా అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్య విషయంలో కూడా సుకుమార్ ఎన్నో ఇబ్బందులను దాటాడు. ఇక ఆర్య సినిమాను పలువురు హీరోలు రిజెక్ట్ చేసిన తర్వాతే బన్నీ చేతికి వచ్చింది. అల్లు అర్జున్ కెరీర్ ని టర్న్ చేసిన ఈ సినిమా, అప్పటివరకు వచ్చిన రొటీన్ కమర్షియల్ ప్రేమ కథలకు భిన్నంగా తెరకెక్కి ఒక ట్రెండ్ సెట్ చేసింది. అప్పట్లో ఆ సినిమా కథ విన్న కొంతమంది సినీ ప్రముఖులు కూడా చాలా రిస్క్ కథ అని నిర్మాత దిల్ రాజుని టెన్షన్ పెట్టేసారు. దర్శకుడు సుకుమార్ మొదట దిల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఆ తరువాత దిల్ రాజుకి ఆర్య కథను చెప్పి సింగిల్ సిట్టింగ్ లో ఇంప్రెస్ చేశాడు. దిల్ రాజు కూడా ఆ కథను ఎంతగానో మెచ్చుకున్నాడు. అయితే అప్పుడప్పుడే ఎదుగుతున్న యువ హీరోలతో ఆ సినిమా చేస్తే బావుంటుందని కొంతమందిని కలిశారు. అయితే హీరో పాత్రలో కూడా పెద్దగా బలం లేదనే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కథ మార్చితే ఒప్పుకుంటామని కొంతమంది అన్నారు. కానీ సుక్కు మాత్రం అందుకోసం ఒప్పుకోలేదు. సినిమాలో ఎమోషన్ మిస్ కాకూడదని కథ మార్చనని తెగేసి చెప్పాడు.

కల్ట్ బ్లాక్ బస్టర్ గా ఆర్య..

అయితే కథ విషయంలో రాజీపడని సుకుమార్ కు దిల్ రాజు కూడా అతనికి అండగా నిలిచారు. ముందుగా ప్రభాస్ కు చెబితే, అప్పుడే వర్షం సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న ప్రభాస్ కథలతో రిస్క్ చేయకూడదని ఆర్య సినిమా వస్తే నిర్మొహమాటంగా నో చెప్పేశాడట. సుకుమార్ చివరికి అల్లు అర్జున్ కు కథ చెప్పగానే కంటెంట్ కొత్తగా ఉందని వెంటనే ఒప్పేసుకున్నాడు. ఇక ఆర్య సినిమాను దిల్ రాజు అప్పట్లో కేవలం 4 కోట్లతో తెరకెక్కించాడు. అను మెహతా హీరోయిన్ గా నటించింది.
2004 మే 7న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో భారీ వసూళ్లు సాధించింది. ఇక దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కు అప్పట్లో బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మొదట మామూలుగా ఓపెనింగ్స్ తెచ్చుకున్నా, వీకెండ్ అనంతరం కంటిన్యూగా హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. 56 సెంటర్లలో 100రోజులు ఆడిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 36కోట్లకు పైగా వసూళ్ల గ్రాస్ ను అందుకోగా, 18 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాతో దిల్ రాజు అగ్ర నిర్మాతగా గుర్తింపు అందుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. సుకుమార్ కి కూడా దర్శకుడిగా భారీ ఆఫర్లు వచ్చాయి. ఇక ఈ సినిమా మరాఠీలో కూడా విడుదలై సిల్వర్ జూబ్లీ ఆడింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు