Bhamakalapam 2 Review : “భామాకలాపం-2” రివ్యూ

2022లో రిలీజ్ అయిన “భామాకలాపం” అనే మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కిన విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రం వ్యూస్ పరంగా కూడా రికార్డును క్రియేట్ చేసింది. రెండేళ్ల తర్వాత దానికి సీక్వెల్ గా తెరకెక్కిన “భామాకలాపం 2” మూవీ ఫిబ్రవరి 16న ఆహాలోకి డైరెక్ట్ గా వచ్చేసింది. ఈ మూవీకి అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించారు. మరి ఈ సీక్వెల్ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది? అనేది చూద్దాం.

కథ
మొదటి భాగంలో అనుపమ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, అందులో తన వంటలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. 200 కోట్ల విలువైన కోడిగుడ్డు మాయమవ్వడంతో అనుపమతో పాటు ఆమె ఫ్యామిలీ కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ఆ కష్టాల నుంచి ఆమె కుటుంబం ఎలా బయటపడింది అన్నది “భామా కలాపం” స్టోరీ. ఆ తర్వాత ఇల్లు మారడం నుంచి “భామాకలాపం-2” స్టార్ట్ అవుతుంది. ఇతరుల విషయాలను పట్టించుకోనని భర్తకు మాటిచ్చి, యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో “అనుపమ ఘుమఘుమ” అనే రెస్టారెంట్ ను ప్రారంభిస్తుంది. తన వ్యాపారంలో పని మనిషి శిల్పను భాగస్వామిగా చేసుకుంటుంది. ఆ తర్వాత కుకింగ్ ఐడల్ 2023 అనే నేషనల్ లెవెల్ కుకింగ్ కాంపిటీషన్ కు అనుపమ అప్లై చేస్తుంది. ఈ కుకింగ్ ఐడల్ ట్రోఫీతోనే డ్రగ్స్ స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేస్తాడు బిజినెస్ మాన్ ఆంథోనీ లోబో. అయితే ఈ డ్రగ్స్ ను అనుపమ ఎందుకు కొట్టేయాల్సి వస్తుంది? ఆ దొంగతనం వీరి జీవితాలను ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లి పడేసింది? ఇంతకీ అనుపమ ఈ పరిస్థితులన్నిటి నుంచి ఎలా బయటపడింది? ఇందులో సీరత్ కపూర్ పాత్ర ఏంటి? అనే ఆసక్తికరమైన విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ
మొదటి భాగం గుడ్డు చుట్టూ తిరిగితే, రెండవ భాగాన్ని కోడి పుంజు చుట్టూ తిప్పాడు దర్శకుడు అభిమన్యు తడిమేటి. అలాగే “భామాకలాపం” కేవలం ఒక అపార్ట్మెంట్ లో జరిగే మర్డర్ మిస్టరీ అయితే, రెండో భాగం మాత్రం హెయిస్ట్ థ్రిల్లర్ గా రూపొందింది. అనుపమ, ట్రోఫీ, పోలీస్ ఆఫీసర్ కథలు సమాంతరంగా కొనసాగుతాయి. ఈ మూడు కథలు కలిసిన పాయింట్ నుంచే కథ వేగం పుంజుకుంటుంది. సాధారణంగా ఇలాంటి హెయిస్ట్ థ్రిల్లర్ సినిమాలకు దొంగతనాన్ని ఎలా ప్లాన్ చేశారు అన్నదే ఆయువు పట్టు లాంటిది. కానీ డైరెక్టర్ ఈ విషయంలో కాస్త వెనకబడ్డట్టుగా అనిపిస్తుంది. ఆ దొంగతనం ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అన్న విషయాన్ని ప్రేక్షకులు ముందుగానే అంచనా వేసే అవకాశం ఉండడంతో అంతగా ఎక్సైటింగ్ గా అనిపించదు. కానీ దొంగతనం చేసిన సమయంలో ప్రియమణి, శరణ్య సీన్స్ మాత్రం బాగానే నవ్విస్తాయి. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసిన ఫీలింగ్ కలిగిస్తాయి. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. వాటిని కట్ చేసి ఉంటే కాస్త క్రిస్పీగా ఉండేది. కానీ లెంగ్త్ కోసమే ఉంచారు అన్నట్టుగా ఆ సన్నివేశాలతో ఆడియన్స్ కు చిరాకు తెప్పించాడు డైరెక్టర్. ప్రీ క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డైరక్టర్ ఆ తర్వాత ఆ కోడిపుంజు బొమ్మ ఏమైంది? అన్న విషయాన్ని ప్రస్తావించలేదు. కానీ చివర్లో “భామాకలాపం -3″కి లీడ్ ఇచ్చారు. దీంతో మళ్లీ అనుపమ విదేశాల్లో ఏం చేయబోతుంది? అన్న క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అయితే ప్రియమణి దొంగతనానికి వెళ్లే ముందు వచ్చే ఒక సన్నివేశంతో క్లైమాక్స్ లో ఏం జరగబోతుందో ముందే అర్థమైపోతుంది.

- Advertisement -

నటీనటులు, సాంకేతిక బృందం పనితీరు
సినిమా వన్ ఉమెన్ షో అని చెప్పొచ్చు. ఈ పాత్ర ప్రియమణి కోసమే పుట్టిందా అన్నట్టుగా ఉండగా, ఆమె కూడా ఇంటలిజెంట్ హౌస్ వైఫ్ పాత్రలో ఒదిగిపోయింది. శరణ్య ప్రదీప్ ది మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర, బాగా నవ్విస్తుంది. ఇక సీరత్ కపూర్ పాత్రకు మాత్రం పెద్దగా ప్రాధాన్యత లేదు. అసలే ఆఫర్లు లేని ఈ అమ్మడు ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే ఆ తర్వాత కూడా ఇలాంటి పాత్రలకే పరిమితం కావలసి వస్తుంది. ఇంతకుముందు హీరోయిన్గా నటించిన ఈ అమ్మడు ఇప్పుడు కేవలం సైడ్ క్యారెక్టర్ కి అంకితం అయిపోయింది. ఇది ఆమె కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడే ఛాన్స్ లేదు. గ్లామర్ కే పరిమితం అయ్యింది. మిగతా నటీనటులు తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి అందించిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ దీపక్ పనితీరును మెచ్చుకోవాల్సిందే. నిర్మాణ విలువలు కూడా మొదటి పార్ట్ కంటే బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్
ప్రియమణి
కొన్ని ట్విస్ట్ లు
సాంకేతిక బృందం

బలహీనతలు
కొన్ని సన్నివేశాల సాగదీత
ప్రెడిక్టబుల్ క్లైమాక్స్

రేటింగ్ : 2/5

చివరి మాట : ఈ వీకెండ్ కు మంచి టైంపాస్ “భామకలాపం 2”. ఫ్యామిలీతో కలిసి సరదాగా ఓసారి చూసేయొచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు