Jr NTR vs NBK: పెద్దాయన సాక్షిగా మరోసారి బట్టబయలైన విభేదాలు… అసలిది ఎలా స్టార్ట్ అయ్యిందంటే?

నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా మరోసారి నందమూరి కుటుంబంలోని విభేదాలు బట్టబయలు అయ్యాయి. అసలు ఈ గొడవ ఎలా, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే…

మాజీ ముఖ్యమంత్రి, నవరస నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. సినిమాలో అగ్రగామిగా ఎదిగి, ఆ తర్వాత సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లో సంచలనం క్రియేట్ చేసిన నందమూరి తారక రామారావు తెలుగువారికి ఎప్పటికీ చిరస్మరణీయుడే. సినిమాలతో పాటుగా ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇక ఆయన అనంతరం ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ వారసుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు బాలయ్య రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ రేంజ్ లో నందమూరి తారక రామారావు వారసుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నాడు.

అయితే ఈరోజు ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని నందమూరి తారక రామారావు ఘాట్ వద్ద మరోసారి ఈ ఫ్యామిలీలో ఉన్న విభేదాలు పెద్దాయన సాక్షిగా బయటపడ్డాయి. నిజానికి 2009 ఎలక్షన్స్ టైంలో నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ని చేరదీసింది. ఆ సమయంలో ఎన్టీఆర్ – బాలయ్య చాలా క్లోజ్ గా ఉండడం చూసి నందమూరి అభిమానులంతా తెగ సంబరపడిపోయారు. కానీ ఆ ముచ్చట మూడునాళ్లే అన్నట్టుగా 2013లో జరిగిన పొలిటికల్ గొడవల వల్ల మళ్ళీ విడిపోయారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అప్పటి నుంచి వీళ్ళ మధ్య గొడవలు సద్దుమణిగినట్టుగా కనిపించడం లేదు.

- Advertisement -

హరికృష్ణ మరణం టైంలో ఈ ఇరు కుటుంబాలు కలిసినట్టే కనిపించినా మళ్లీ ఎక్కడో తేడా కొట్టింది. ఎన్టీఆర్ దగ్గర బాలయ్య టాపిక్ వచ్చినప్పుడు లేదా బాలయ్య టాపిక్ ఎన్టీఆర్ దగ్గర వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా మాట దాట వేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బాలయ్య అయితే మొహం మీద కొట్టినట్టుగా కామెంట్స్ చేస్తున్నాడు. మరి వీళ్ళ గొడవలు ఎప్పుడెప్పుడు ఎలా బయటపడ్డాయి? అనే వివరాల్లోకి వెళితే…

 

తారకరత్న పెద్దకర్మ టైంలో…

జూనియర్ ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టింది అంటూ వస్తున్న వార్తలకు తారకరత్న పెద్దకర్మ ఆజ్యం పోసింది. ఆ సమయంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పట్ల బాలకృష్ణ ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఆ వీడియోలలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే దగ్గర కూర్చుని కనిపించారు. ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన బాలకృష్ణను చూసి బాబాయ్ తో మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టు ఈ అన్నదమ్ములిద్దరూ లేచి నిలబడ్డారు. కానీ బాలయ్య మాత్రం అందర్నీ పలకరించి జూనియర్ ఎన్టీఆర్ ని పలకరించకుండా వెళ్ళిపోయారు. ఇది అప్పట్లో చర్చనీయాశంగా మారింది.

 

హరికృష్ణ మనవడి ఎంగేజ్మెంట్ లో…

దివంగత నటుడు హరికృష్ణ రెండవ భార్య కొడుకు తారక్ అన్న విషయం తెలిసిందే. ఆయన మొదటి భార్య సంతానం జానకిరామ్, సుహాసిని, కళ్యాణ్ రామ్. హరికృష్ణ కుమార్తె సుహాసిని కుమారుడైన శ్రీహర్ష ఎంగేజ్మెంట్ లోనూ ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీ మొత్తం ఇగ్నోర్ చేసింది. తారక్ కు స్వయానా మేనల్లుడైన శ్రీహర్ష ఎంగేజ్మెంట్ కి నందమూరి కుటుంబం మొత్తం హాజరైంది. కళ్యాణ్ రామ్ కూడా సతీ సమేతంగా ఈ వేడుకలో పాల్గొన్నాడు. కేవలం ఎన్టీఆర్ మాత్రమే శ్రీహర్ష ఎంగేజ్మెంట్ లో కనిపించకపోవడం నందమూరి కుటుంబం మధ్య విభేదాలు ఉన్నాయి అనడానికి మరొక సాక్ష్యంగా నిలిచింది.

 

జూనియర్ ఎన్టీఆర్ టిడిపిలోకి వస్తే అనే ప్రశ్నపై బాలయ్య రియాక్షన్…

సినిమాల పరంగా బాలయ్య బాగానే రాణిస్తున్నారు. కానీ రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి ఆయన తన బావ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అనే అపవాదు ఉంది. తారక్ ను తమ కుటుంబంలో కలుపుకుంటే నారావారి చేతిలో ఉన్న పొలిటికల్ పవర్ నందమూరి ఫ్యామిలీ చేతిలోకి వస్తుంది అనేది చాలామంది నందమూరి అభిమానుల అభిప్రాయం. అయితే ఒకానొక సందర్భంలో జరిగిన ఇంటర్వ్యూలో బాలయ్యకు ఇలాంటి ప్రశ్న ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ టిడిపిలోకి వస్తే ప్లస్ అవుతుందా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలయ్య ప్లస్ అయ్యి మైనస్ అయితే అంటూ తారక్ పేరును ప్రస్తావించకుండా పార్టీలోకి ఎవరైనా రావచ్చు అంటూ ఆ ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. బాలయ్య తారక్ పేరును పలకడానికి కూడా ఇష్టపడకపోవడం వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి అనడానికి మరో నిదర్శనంగా మారింది.

 

ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా…

రీసెంట్ గా నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కూడా తారక్ కు ఆహ్వానం అందలేదు. దీనిపై నందమూరి అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రాగా, కొంతమంది అది పార్టీ పరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం మాత్రమేనని కాబట్టి రజనీకాంత్ ను మినహా ఇండస్ట్రీలో ఎవరినీ పిలవలేదు అంటూ కవర్ చేశారు. అయితే స్వయంగా కుటుంబ సభ్యుడైన తారక్ కి ఈ కార్యక్రమానికి ఆహ్వానం పంపకపోవడం వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి అనడానికి గట్టి ఊతం ఇచ్చినట్టుగా అయింది.

 

చంద్రబాబు అరెస్ట్ టైంలో…

ఇక రీసెంట్ గా స్కిల్ స్కాం కేసులో టిడిపి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో కూడా నందమూరి కుటుంబం మధ్య జరుగుతున్న రచ్చ బయటపడింది. చంద్రబాబు అరెస్టుపై తారక్ నోరు మెదపకపోవడం కొంతమంది టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబు అరెస్టుపై తారక్ స్పందించకపోవడం గురించి ప్రస్తావన రాగా, బాలయ్య… తారక్ పేరును కూడా ఎత్తకుండా “ఐ డోంట్ కేర్ బ్రో” అంటూ ఆ మధ్య వచ్చిన తన మూవీ భగవంత్ కేసరిలోని ఓ డైలాగ్‌తో ఇచ్చిన సమాధానం వీళ్ళ మధ్య ఉన్న రచ్చ బట్ట బయలయ్యేలా చేసి, సోషల్ మీడియాలో బాలయ్య, తారక్ అభిమానుల మధ్య వార్ స్టార్ట్ అయ్యేలా చేసింది.

 

ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా…

నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు బాలయ్య అక్కడికి వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చిన బాలయ్య చుట్టుపక్కల ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసి కోపంతో రగిలిపోతూ వెంటనే తారక్ ఉన్న ఫ్లెక్సీలను తీసేయాలంటూ అనుచరులను ఆదేశించడం చూస్తుంటే ఆయనకు తారక్ పై ఎంత ద్వేషం ఉందో అర్థమవుతుంది. ఫ్లెక్సీలోను చూపిస్తూ “ఇప్పుడే… తీయించేయ్… ఇప్పుడే…” అంటూ పక్కన ఉన్న వారికి ఆదేశాలు ఇస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా బాలయ్య కంటే ముందే తెల్లవారుజామునే తారక్ తన అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత బాలయ్య ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వెళ్లారు.

ఇక ఇలా ఇన్ని సందర్భాల్లో బాలయ్య, తారక్ మధ్య విభేదాలు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమని రేంజ్ లో ఉన్నాయి అనే విషయం బయటపడింది. అయితే ఈ నందమూరి ఫ్యామిలీ పంచాయితీ ఎప్పుడూ స్టార్ట్ అయిందో అనే విషయం మాత్రం క్లారిటీ లేదు. కానీ, తారకరత్న చనిపోకముందు నుంచే బాలయ్య – తారక్ మధ్య దూరం పెరిగింది అనే విషయం అయితే అందరికీ అర్థమవుతుంది. కానీ, వీరి మధ్య దూరం పెరగడానికి రాజకీయ కారణాలే ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ సపొర్ట్ గా ప్రచారం చేయాలని తారక్ ను, కళ్యాణ్ రామ్ ను చంద్రబాబు, బాలయ్య అడిగారని, దానికి ఈ నందమూరి అన్నదమ్ములు కుదరదు.. ప్రస్తుతం తమ ఫస్ట్ ప్రియారిటీ సినిమా ఇండస్ట్రీకే అన్నట్టు చెప్పారని సమాచారం.

అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ మధ్యపానానికి ఎక్కువగా అలవాటు పడ్డాడని, అదే టైంలో నందమూరి ఫ్యామిలీ టీడీపీ కి సపొర్ట్ విషయం చర్చకు వచ్చిందని, ఆ టైంలో తారక్ – బాలయ్య మధ్య మాట మాట పెరిగిందనే టాక్ ఒకటి ఇండస్ట్రీలో ఆ మధ్య వినిపించింది. అప్పటి నుంచి స్టార్ట్ అయిన నందమూరి ఫ్యామిలీ పంచాయితీ తారా స్థాయికి చేరుతూ వచ్చిందని గుస గుసలు వినిపించాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.

కానీ, చక్కగా… తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబంగా ఉన్న నందమూరి ఫ్యామిలీలో ఇలా విభేదాలు రావడం అభిమానులను నిరాశపెట్టిస్తుంది. నందమూరి ఫ్యామిలీలో ఇవేమీ జరగడం లేదు… అందరూ కలిసిగట్టుగానే ఉన్నారు అంటూ బాలయ్య – తారక్ ఉమ్మడి ఓ స్టేట్ మెంట్ ఇస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు. మరి అది జరుగుతుందా..? లేదా ఈ విభేదాలు ఇలాగే జరిగుతాయా? అనేది చూడాలి మరి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు