Dear : అప్పుడు అబ్బాయి మీద.. ఇప్పుడు అమ్మాయి మీద..

Dear : టాలీవుడ్ లో గాని, కోలీవుడ్ లో గాని, మరే సినిమా ఇండస్ట్రీలో అయినా సరే కొత్త తరహా కాన్సెప్ట్ సినిమాలు వస్తే, ఆ సినిమా కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారు. పైగా అందులో హీరో ఎవరని, నటీనటులు ఎవరూ అని, ఏ భాష సినిమా అని పెద్దగా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు కొత్త కాన్సెప్ట్ సినిమాలని ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయం న్యూ జనరేషన్ ఫిలిం మేకర్స్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే కొత్త కాన్సెప్ట్ లతో విభిన్న ప్రయోగాలు చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్, ఏసియన్ సంస్థలు సంయుక్తంగా తెలుగులో తీసుకొస్తున్న డియర్ సినిమా చూస్తే ఇదే అనిపిస్తుంది. జివి ప్రకాష్ కుమార్, ఐశ్యర్య రాజేష్ జంటగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా అక్కినేని నాగ చైతన్య లాంచ్ చేయగా, ఈ ట్రైలర్ కి కూడా చై వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ సినిమా కథలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక అమ్మాయి గురక. దాని చుట్టే లవ్ స్టోరీ, మ్యారేజ్, ఎమోషన్స్ అన్నీ పెట్టేశారు. ఈ సినిమా సంగీతం కూడా స్వయంగా జివి ప్రకాశే సమకూర్చుకున్న ఈ ఎంటర్ టైనర్ కు ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు.

హీరోయిన్ గురక సమస్యే కథా నేపథ్యం..

ఇక ఈ సినిమా ట్రైలర్ ని గమనిస్తే కథేంటో ఒక్క ముక్కలో అరటిపండు వలిచినట్టు చెప్పేశారు మేకర్స్. అబ్బాయి లైట్ స్లీపర్. అంటే రాత్రిళ్ళు ఎక్కువ నిద్ర పట్టదు. ఏదో రెండు మూడు గంటలు పడుకుని మమ అనిపిస్తాడు. అమ్మాయికేమో పెద్ద శబ్దాలతో గురక పెట్టి ఎక్కువ సేపు నిద్రపోవడం అలవాటు. అలాంటి ఈ ఇద్దరికీ దేవుడు ముడిపెడతాడు. తమ బలహీనతను దాచి పెట్టుకుని పెళ్లి చేసుకుంటారు. కట్ చేస్తే మొదటి రాత్రి అసలు రహస్యం బయట పడుతుంది. సింహంలా గుర్రు సౌండ్ తో కాపురం చేసే పెళ్ళాన్ని భరించలేనంటూ కుర్రాడు వీధికెక్కుతాడు. కానీ అది చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ అర్ధం చేసుకోరు. ఫైనల్ గా ఈ సమస్యకి పరిష్కారం దొరికిందా, వీళ్ళ కథ ఏమైంది అన్నది తెలియాలంటే ఏప్రిల్ 12న డియర్ సినిమా రిలీజ్ దాకా ఆగాలి.

అప్పుడు గుడ్ నైట్.. ఇప్పుడు డియర్.. ఒక్కటే తేడా..

ఈ సినిమా కాన్సెప్ట్ వెరైటీగా అనిపిస్తోంది కానీ, ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది కదూ. అవును.. లాస్ట్ ఇయర్ తమిళ్ లో గుడ్ నైట్ అనే సినిమా వచ్చిందని తెలిసిందే. ఆ సినిమా తెలుగులో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా కూడా గురక సమస్య నేపథ్యంలోనే తెరకెక్కగా, రెండు సినిమాలకి ఒక్కటే తేడా? గుడ్ నైట్ లో గురక సమస్య అబ్బాయికి ఉంటే, డియర్ లో అమ్మాయి కి ఉంది. మరి ట్రైలర్ వరకూ చూస్తే బాగానే ఉంది కానీ, ఇలాంటి వాటిలో ఫన్ బాగా పండితేనే థియేటర్స్ లో బాగా వర్కౌట్ అవుతాయి. మరి డియర్ సినిమా గుడ్ నైట్ సినిమాలాగానే అలాంటి మంచి స్పందనే దక్కించుకుంటుందా, లేదా అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమా క్యాస్టింగ్ మొత్తం అరవ నటీనటులే ఉన్నారు. పెద్దగా బడ్జెట్ లేకుండా సింపుల్ గా లాగించిన డియర్ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ మీదనే ఆధారపడి వస్తుంది. అయితే డ్రామా ఎమోషన్స్ కి కనెక్ట్ అయితే హిట్ సంగతి జనాలు చూసుకుంటారు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు