Comedian Visweswara Rao Passed Away : అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వర రావు కన్నుమూత

Comedian Visweswara Rao Passed Away : ఇటీవల కాలంలో పలువురు ప్రముఖ నటులను కోల్పోయిన తమిళ చిత్ర పరిశ్రమకు మరో నటుడి మరణంతో షాక్ తగిలింది. పలు చిత్రాల్లో సహాయ నటుడిగా, కమెడియన్ పాత్రలు పోషించిన ప్రముఖ నటుడు విశ్వేశ్వరరావు ఆకస్మిక మరణం సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళ, తెలుగు భాషల్లో పలు సినిమాల్లో నటించిన ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వర రావు అనారోగ్యంతో తాజాగా కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు చెన్నైలోని సిరుచ్చేరిలో ఉన్న తన నివాసంలో తుదిస్వాస విడిచారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పించేందుకు స్వగృహంలో ఉంచారు. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం. విశ్వేశ్వర రావు నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో రాణించారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో బాల దర్శకత్వం వహించిన పితామగన్ సినిమాలో లైలా తండ్రి పాత్రను పోషించారాయన. ఇందులో విక్రమ్, సూర్య హీరోగా నటించారు. గత ఆరేళ్ల నుంచి తమిళ, తెలుగు సినిమాలలో నటిస్తున్న విశ్వేశ్వర రావు బాల నటుడిగా దాదాపు 150 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత పలు సీరియల్స్ లో కూడా ఆయన కనిపించారు. అనేక తమిళ సినిమాలలో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి సినీ ప్రియులను అలరించారు. ఆయన కెరీర్ మొత్తంలో 350 కి పైగా సినిమాల్లో నటించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ఆయన స్వస్థలం కావడం గమనార్హం.

విశ్వేశ్వర రావు తెలుగు సినిమాలు

మెకానిక్ అల్లుడు, శివాజీ, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఆమె కథ, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి వంటి తెలుగు సినిమాల్లో నటించి తెలుగు పేక్షకులకు దగ్గరయ్యారు విశ్వేశ్వర రావు. వయసు మీద పడడంతో సినిమాలు, సీరియల్స్ చేయడం ఆపేసి.. విస్సు టాకీస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేశారు. అందులో తన అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకునే వారు.

ఇటీవల కన్నుమూసిన తమిళ నటులు

తమిళ చిత్ర పరిశ్రమ ఇటీవలి కాలంలో వరుసగా ప్రతిభావంతులైన నటులను కోల్పోతోంది. నటుడు వివేక్, మైలస్వామి, మనోబాల వంటి నటులు వరుసగా చనిపోవడం వంటి సంఘటనలు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ప్రముఖ విలన్ నటుడు డేనియల్ బాలాజీ హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. 48 ఏళ్ల వయసులో డేనియల్ బాలాజీ మరణంతో తమిళ సినీ పరిశ్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలు కూడా షాక్ అయ్యాయి. ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లి ఎక్కువ కాలం కాకముందే మరో నటుడు విశ్వేశ్వర రావు చనిపోవడం మూవీ లవర్స్ ను ఆందోళనకు గురి చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు