50Years For Alluri Seetharama Raju : వెండితెర “అల్లూరి సీతారామరాజు”కి అర్ధ శతాబ్దం పూర్తి..

50Years For Alluri Seetharama Raju : భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడి ప్రాణాలర్పించిన వీరుల్లో తెలుగువారైన “అల్లూరి సీతారామరాజు” ఒకరు. మన్యం వీరుడిగా గిరిజన కోయ ప్రజల తో కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన ఆ మహనీయుడి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన గొప్ప దేశభక్తి కథ చిత్రం “అల్లూరి సీతారామరాజు”. ఈ చిత్రంలో నట శేఖర “కృష్ణ” హీరోగా నటించడం జరిగింది. 1974 మే 1న విడుదలైన ఈ చిత్రం నేటికీ (50Years For Alluri Seetharama Raju) 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆరోజుల్లోనే తెలుగు చిత్ర పరిశ్రమ చిత్ర రికార్డులన్నిటిని తిరగరాసిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా సంచలన విజయం సాధించింది. తెలుగు ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపిన ఈ చిత్రం అర్ధ శతాబ్దం పూర్తయిన ఈ సందర్బంగా “అల్లురి సీతారామరాజు” చిత్ర విశేషాలని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

అందర్నీ దాటి కృష్ణ ని వరించిన పాత్ర..

అయితే కృష్ణ ని సూపర్ స్టార్ ని చేసిన అల్లూరి సీతారామరాజు పాత్ర ఇండస్ట్రీలో దిగ్గజాలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లను దాటుకుని కృష్ణని వరించింది. అయితే ఈ సినిమా తీయకముందే 1968 లో అసాధ్యుడు అనే సినిమాలో కృష్ణ సీతారామరాజు పాత్రలో ఓ పాటలో కాసేపు నటించారు. ఆ తర్వాత కృష్ణ తనే సినిమా తీయాలని డిసైడ్ అయ్యి సొంత బ్యానర్ అయిన పద్మాలయ స్టూడియోస్ నిర్మాణంలో వి. రామ చంద్రరావు దర్శకుడిగా అల్లూరి సీతారామరాజు చిత్రం తెరకెక్కడం జరిగింది. ఇక ఆ రోజుల్లోనే దాదాపు 38 రోజుల్లో 25 లక్షల భారీ వ్యయంతో తెరకెక్కించిన ఈ చిత్రం లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్గజాలు నటించడం జరిగింది. ఇక ఈ సినిమా తీస్తుండగానే మధ్యలో డైరెక్టర్ చనిపోతే, మిగిలిన భాగంలో కృష్ణ కొంత భాగం, కే.ఎస్. ఆర్. దాస్ మరికొంత భాగం తెరకెక్కించారు. ఆ రోజుల్లో నిర్మాణంలో ఉండగా, పలు ఇబ్బందుల్ని ఎదుర్కున్న సినిమా, ఫైనల్ గా అన్ని అడ్డంకుల్ని దాటుకుని 1974 మే1న విడుదలైన “అల్లూరి సీతారామరాజు” చిత్రం అఖండ విజయం సాధించింది. పాత రికార్డుల్ని తిరగరాస్తూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ రోజుల్లోనే 2కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది.

కథ విషయానికి వస్తే..

ఇక ఈ చిత్ర కథ ప్రకారం బ్రిటీష్ పరిపాలన పట్ల చిన్నతనం నుంచే వ్యతిరేకత పెంచుకున్న రామరాజు దేశాటన చేసి ప్రజల కష్టాలు, పోరాటాలు తెలుసుకుంటాడు. సీత అనే అమ్మాయిని ప్రేమించి, దేశసేవ కోసం పెళ్ళి చేసుకోకపోవడంతో ఆమె మరణించగా, ఆమె పేరులోని సీతను స్వీకరించి సీతారామరాజు అవుతాడు. ఆపైన మన్యం ప్రాంతంలో గిరిజనులపై బ్రిటీష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా సీతారామరాజు పోరాడతాడు. ఇక అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో, అగ్గిదొర, గంటందొర, మల్లుదొర వంటి స్థానిక వీరుల మద్దతుతో ప్రజా విప్లవం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, బ్రిటీష్ వారు ప్రజలను హింసించడం తట్టుకోలేక సీతారామరాజు లొంగిపోయి మరణించడంతో సినిమా ముగుస్తుంది.

- Advertisement -

అల్లూరిగా కృష్ణ ని మాత్రమే ఊహించగలం..

ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కృష్ణ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో చనిపోయే సీన్ కి కన్నీళ్లు పెట్టుకొని ప్రేక్షకుడు ఉండడు. లెజెండరీ నటులు జగ్గయ్య కు పోటాపోటీగా ఆ క్లైమాక్స్ లో కృష్ణ డైలాగులు చెప్తుంటే ప్రతి ప్రేక్షకుడికి సమరోత్సాహం పొంగుకొస్తుంది. ఈ సినిమాలో ‘తెలుగు వీర లేవరా’ అనే పాట స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ ఆ రోజుల్లో ప్రజల్ని ఉత్తేజపరిచింది. ఇక ఈ పాట రాసిన మహా కవి శ్రీశ్రీ కి జాతీయ అవార్డు సైతం లభించింది. ఇక కృష్ణ మాత్రమే కాకుండా రూథర్ ఫర్డ్ గా కళా వాచస్పతి నటన మరో హైలెట్, బ్రిటిష్ కలెక్టర్ గా రాజసం చూపిస్తూనే, అల్లూరి సీతారామరాజు ని శత్రువుగా పొగిడే రాజనీతి జగ్గయ్యకు మాత్రమే సాధ్యం. ఇక కృష్ణ 100వ చిత్రంగా విడుదలైన అల్లూరి సీతారామరాజు ఆరోజుల్లోనే 19 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు