40 Years Of BobbiliBrahmanna : ధర్మపీఠంపై “బొబ్బిలి బ్రహ్మన్న”గా ‘కృష్ణంరాజు’ నట విశ్వరూపం…

40 Years Of BobbiliBrahmanna : తెలుగు చిత్ర పరిశ్రమలో “రెబల్ స్టార్” గా కృష్ణంరాజు అయిదున్నర దశాబ్దాల కాలంలో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో అలరించారు. తొలితర అగ్ర కథానాయకులలో ఒకరిగా, ఎన్నో డాషింగ్ డేరింగ్ పాత్రలు పోషించి అభిమానులని అలరించారు కృష్ణంరాజు. అయితే ఆయన నటించిన కొన్ని సినిమాలు మాత్రం తెలుగు సినీ చరిత్ర లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి గా ఉంటాయి. అందులో భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు లాంటి చిత్రాల తర్వాత అంతటి ప్రఖ్యాతి గాంచిన సినిమా “బొబ్బిలి బ్రహ్మన్న”. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు న‌ట‌జీవితంలో ఈ చిత్రం ఎన్నో రికార్డులు సృష్టించగా, ఈ చిత్రంలో రెబల్ స్టార్ క్రిష్ణంరాజు “బొబ్బిలి బ్రహ్మన్న” గా తన నట విశ్వరూపం చూపించారని చెప్పొచ్చు. కృష్ణంరాజు ద్విపాత్రాభినయంతో అన్నదమ్ములుగా మెప్పించిన ఈ సినిమా విడుదలై (మే 25)నేటికీ సరిగ్గా నాలుగు (40 Years Of BobbiliBrahmanna) దశాబ్దాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఆ చిత్ర విశేషాలను కొన్ని గుర్తు చేసుకుందాం.

40 Years Of BobbiliBrahmanna Movie

ధర్మపీఠం పై బొబ్బిలి బ్రహ్మన్న విశ్వరూపం…

ఈ సినిమాలో బొబ్బిలి బ్రహ్మన్న గా కృష్ణంరాజు నటవిశ్వరూపం చూపించాడని చెప్పాలి. ఎంతో వైవిధ్యమైన ఆ పాత్రలో కృష్ణంరాజు ఆ పాత్రకు తానూ తప్ప ఎవ్వరూ న్యాయం చేయలేరు అన్నంతగా, ఒదిగిపోయారు. అలాగే బ్రహ్మన్నకు తమ్ముడు రవిగా కృష్ణంరాజు మరోపాత్రలో ద్విపాత్రాభినయం చేసారు. గ్రామీణ నేప‌థ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌’ శార‌ద‌, జ‌య‌సుధ నాయిక‌లుగా న‌టించారు. ఇక అలాగే నట విరాట్ రావుగోపాల‌రావు, నవరసనట నాయకుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, అల్లు రామ‌లింగ‌య్య‌, నూత‌న్ ప్ర‌సాద్, అన్న‌పూర్ణ‌, ముచ్చ‌ర్ల అరుణ‌, కృష్ణ‌వేణి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇక ఈ సినిమాకి పరచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్ పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా ప్రేరణ తోనే బొబ్బిలి సింహం,పెదరాయుడు సినిమాల్లో హీరోల పాత్రలు డిజైన్ చేసారు దర్శకులు. చ‌క్ర‌వ‌ర్తి సంగీత‌మందించిన ఈ చిత్రంలో ‘చ‌లిగాలి వీచింది’, ‘ఓ రాతి మ‌నిషి’, “బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న వీర గాథ‌లు” అంటూ సాగే పాట‌ల‌న్నీ అల‌రించాయి.

- Advertisement -

బ్రహ్మన్న రికార్డులు…

ఇక బొబ్బిలి బ్రహ్మన్న చిత్రం 1984 మే 25న విడుద‌లై అఖండ విజ‌యం సాధించింది. గోపీకృష్ణా మూవీస్ ప‌తాకంపై కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆయ‌న సోద‌రుడు ఉప్ప‌ల‌పాటి సూర్య‌నారాయ‌ణ రాజు నిర్మించిన ఈ సినిమాని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ సెన్సేష‌న్ గా నిల‌వ‌డ‌మే కాకుండా, కృష్ణంరాజుకి ఉత్త‌మ న‌టుడుగా ఇటు “నంది” పుర‌స్కారాన్ని, అటు ఫిల్మ్ ఫేర్ అవార్డుని అందించింది. అలాగే ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ఈ సినిమాని జ‌న‌రంజ‌కంగా తీర్చిదిద్దినందుకు ఉత్త‌మ ద‌ర్శ‌కుడుగా తొలి నందిని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమాకు కథా, రచన చేసిన పరచూరి సోదరులు తొలిసారిగా రాఘవేంద్రరావు సినిమాకు పనిచేసారు. అంతే కాకుండా ఈ సినిమాకు రాసిన ధర్మపీఠం, ధర్మ ఖడ్గం కాన్సెప్ట్ ని ప్రేరణ గా చేసుకొని కొన్ని వందల సినిమాలు వచ్చాయి.

అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో పోలీసులు గ్రామంలోకి అడుగుపెట్టరన్నది నియమంగా చూపించడంతో ఆరోజుల్లో సెన్సారు వారి అభ్యంతరం చేసారు. అందువల్ల ఈ మేరకు ప్రారంభంలో ఇది బ్రిటీష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో జరిగిన కథ అని వేశారు. ఈ సినిమా కథలో ప్రధానమైన మలుపులపైన బ్రహ్మన్న కుమార్తె వల్ల కళ్ళుపోయినవానికి, తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేయాలని బ్రహ్మన్న తీర్పునివ్వడం “సుకన్యోపాఖ్యానానికి” వాడుకలో ఉన్న ఓ కథా సందర్భం నుంచి పరచూరి రచయితలు తీసుకొని కథలో భాగం చేసారు. ఇక బొబ్బిలి బ్రహ్మన్న ఆరోజుల్లోనే 26 కేంద్రాల్లో యాభై రోజులు, 9 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడి రికార్డు సృష్టించగా 2 కోట్లకి పైగా కలెక్షన్లు వసూలు చేసి కృషంరాజు సత్తా చాటింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు