Tollywood : దాని వల్లే టెలివిజన్ ఛానల్స్ కి ముప్పు!

Tollywood : ఇండియాలో సినిమాలు థియేటర్లలో వంద రోజులు ఆడే కాలం దాటిపోయింది. మూడు వారాలు ఆడితే చాలు అన్న పరిస్థితికొచ్చింది. అందుకే మూడు వారాల్లో పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చేలా టిక్కెట్ల రేట్లు కూడా ఉన్నాయి. ఈ లాంగ్ రన్ ఆడకపోవడానికి కారణం ఓటిటి ప్రభావం అని తెలిసిందే. రిలీజ్ అయిన రెండు నెలల లోపే ఎంత పెద్ద సినిమాలు అయినా ఓటిటి లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇదీ గాక ఈ టెక్నాలజీ యుగంలో సినిమాలు రిలీజ్ అయిన సాయంత్రం లోపు పైరసీలు అందుబాటులోకి వస్తున్నాయి. అందువల్ల ఓటిటి లకు మంచి రేటుకి అమ్మేసి సేఫ్ అవుతున్నారు నిర్మాతలు. అయితే దాని వల్ల టివి ఛానెళ్లకు పెద్ద తలనొప్పి గా మారింది. ఇక అసలు విషయానికి వస్తే.. ఒకప్పుడు సినిమా థియేటర్లలో మాత్రమే సినిమాలు చూసే వీలు ఉండేది. ఆ తర్వాత 80ల వరకు థియేటర్ రన్ తర్వాత క్యాసెట్లలో సినిమా అందువాటులోకి వచ్చింది. ఆ తరువాత నుండి మూడు దశాబ్దాలుగా టీవీల్లో సినిమాలను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు.

ఓటిటి వల్ల టీవీ ఛానెళ్లకు దెబ్బ?

టీవీలు వచ్చిన కొత్తలో సినిమాలు విడుదల అయిన చాలా నెలల తర్వాత కానీ టెలికాస్ట్‌ అయ్యేవి కాదు. కానీ ఆ తర్వాత తర్వాత థియేటర్‌ లో రిలీజ్ అయిన 50 రోజుల లోపే టీవీల్లో చూసే అవకాశం ఉండేది. థియేటర్ రిలీజ్ తర్వాత వంద రోజులు పూర్తి అయితేనే టీవీ టెలికాస్ట్‌ చేయాలని కూడా కొందరు డిమాండ్‌ చేస్తూ ఉండేవారు. మొన్న మొన్నటి వరకు టీవీల్లో సినిమాలకు విపరీతమైన టీఆర్‌పీ రేటింగ్‌ వచ్చేది. అల వైకుఠపురంలో సినిమాకు 29.4 రేటింగ్‌ దక్కగా, సరిలేరు నీకెవ్వరు సినిమాకు 23.5 రేటింగ్‌ దక్కింది. ఇవి టెలికాస్ట్ అయిన మొదటి సారి వచ్చిన రేటింగ్స్. అప్పట్లో స్టార్‌ హీరోల సినిమాలకు పదికి తగ్గకుండా రేటింగ్‌ వచ్చేది. ఎన్ని సార్లు టెలికాస్ట్‌ చేసినా కూడా మినిమం రేటింగ్‌ వస్తూనే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎంతటి హిట్‌ మూవీ అయినా 10 రేటింగ్‌ దాటడం లేదు. అందుకు కారణం ఓటీటీ స్ట్రీమింగ్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గడిచిన మూడు నాలుగు సంవత్సరాలుగా ఇండియాలో ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. థియేటర్ రిలీజ్ అయిన మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. దాంతో ప్రేక్షకులు దాదాపుగా ఓటీటీ లో చూస్తున్నారు.

పండగలకు కూడా ఛాన్స్ లేకుండా పోయింది!

ఇక తెలుగు (Tollywood ) సినిమాలను ఇప్పుడు పండగల స్పెషల్ గా రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి రాగా, అప్పుడు కూడా అంతంత మాత్రమే రెస్పాన్స్ వస్తుంది. ఈ డిజిటల్ యుగంలో చాలా తక్కువ మంది మాత్రమే ఆ సినిమాలను శాటిలైట్‌ ఛానల్‌ లో వచ్చినప్పుడు చూస్తున్నారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్‌ టాక్ దక్కించుకున్న వాల్తేరు వీరయ్య కి 5.14 రేటింగ్‌ దక్కింది. ఇటీవల టెలికాస్ట్‌ అయిన గుంటూరు కారం సినిమాకు 9.23 టీఆర్‌పీ రేటింగ్‌ మాత్రమే నమోదు అయ్యింది. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ మరియు హిందీ సినిమాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా శాటిలైట్‌ లో టెలికాస్ట్‌ అయినప్పుడు 10 రేటింగ్‌ రావడం అనేది గగనంగా మారింది. అయితే దీనిని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టమనే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మహా అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాలని డిమాండ్ ఉన్నప్పుడే టీవీల్లో రిలీజ్ చేయడం మంచిదని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు