Ilayaraja : ఇకపై అనుమతి లేకుండా పాటలు విన్నామని ప్రేక్షకులకు కూడా నోటీసులు పంపుతారేమో – నెటిజన్లు

Ilayaraja : సౌత్ ఇండియా లో లెజెండరీ సంగీత దర్శకుడిగా మాస్ట్రో గా పేరు పొందిన ఇళయరాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలా మంది సంగీత దర్శకులకు ఆయనే ఆదర్శం. కొందరైతే ఆయన్ని ఒక దేవుడిలా కొలుస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు, హిందీ లో కూడా కొన్ని వందల సినిమాలకు సంగీతం అందించారాయన. ఆయన అందించిన క్లాసిక్స్ సాంగ్స్ వేలల్లోనే ఉంటాయి. నిన్నటితరం సంగీత ప్రియులు ఆ పాటలు విని పొందే అనుభూతి గురించి మాటల్లో చెప్పలేరు. ఇళయరాజాకు ముందు, ఆ తర్వాత గొప్ప గొప్ప సంగీత దర్శకులు ఉన్నప్పటికీ.. మ్యూజిక్ లవర్స్ మనసుల్లో మాస్ట్రో స్థానమే వేరు. అందుకే ఆయన పై ఏకంగా ధనుష్ సినిమా తీస్తున్నాడు. సినిమా వాళ్లు కూడా ఇళయరాజా మీద అభిమానంతో తమ చిత్రాల్లో ఆయన పాటల ప్రస్తావన తెస్తుంటారు. ఇళయరాజాకు ఎలివేషన్ ఇస్తుంటారు. తమ చిత్రాల్లో ఇళయరాజా పాటలేవైనా బిట్లు బిట్లుగా వాడారు అంటే అది ఆయన మీద అభిమానం, గౌరవంతోనే తప్ప.. ఆ పాటల ద్వారా ఏదో ప్రయోజనం పొందుదామని కాదన్నది వాస్తవం. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా ఇళయరాజా (Ilayaraja) చేస్తున్న చేష్టలు ఇండస్ట్రీ లో ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. ఓపెన్ గా చెప్పాలంటే అస్సలు నచ్చడం లేదు సరికదా ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాయి.

Ilayaraja sent court notices to Manjummel Boys film unit

మంజుమ్మేల్ బాయ్స్ కి కూడా నోటీసులు..

గత కొంత కాలంగా ఇళయరాజా ఏదైనా సినిమాలో తన పాట వినిపిస్తే చాలు.. లీగల్ నోటీసుల వరకు వెళ్లిపోతున్నారు. ఇటీవలే రజినీకాంత్ సినిమా ‘కూలీ’కి సంబంధించిన టీజర్లో ఇళయరాజా పాట వినిపించింది. ఐతే అందులో హీరో రజినీ మంచి మిత్రుడే అయినా సరే.. ఇళయరాజా లీగల్ నోటీసులు ఇచ్చేశారు. తన అనుమతి లేకుండా తన పాట వాడేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక అంతకు ముందే స్వయానా ఎస్పీ బాలు కు తను ,మ్యూజిక్ చేసిన పాటలు పాడకూడదని అన్నారంటే ఎంత మూర్ఖంగా ప్రవర్తించారో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాలో ‘గుణ’ చిత్రంలోని ఓ పాట వాడుకున్నారంటూ ఆ చిత్ర యూనిట్ కు నోటీసులు ఇచ్చేశారు. ఇలా ఏ సినిమాలో తన పాట వినిపించినా నోటీసులు ఇచ్చుకుంటూ పోతే.. రేప్పొద్దున ఇళయరాజా పాటను గుర్తు చేసుకోవడానికి భయపడే పరిస్థితి రావచ్చు. తన పాటలకు సంబంధించి హక్కులు, రాయల్టీ విషయంలో ఇళయరాజా గొడవ పడే తీరు ఎప్పట్నుంచో వివాదాస్పదం అవుతోంది. ఒక పాట మీద సంగీత దర్శకుడితో పాటు గాయకులు, గేయ రచయితలు, నిర్మాతలకూ హక్కులు ఉంటాయి. కానీ ఇళయరాజా మాత్రం పాట మీద సర్వ హక్కులూ తనవే అన్నట్లు గొడవలకు దిగడం మీద ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి.

- Advertisement -

ప్రేక్షకుల మీద కూడా కేసు వేస్తారా ఏంటి?

ఇక ఇళయరాజా తన మిత్రుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అప్పట్లో తన అనుమతి లేకుండా మ్యూజికల్ కన్సర్ట్స్‌లో తన పాటలు వాడుకుంటున్నాడని నోటీసులు పంపడం అప్పట్లో ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే. బాలు లాంటి వారితో మాట్లాడి తేల్చుకోవాల్సిన విషయానికి నోటీసులివ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాలు కూడా అప్పట్లో ఈ విషయమై ఎంతో బాధ పడ్డాడు కూడా. ఇప్పుడేమో ఇలా ఏ సినిమాలో తన పాట వినిపించినా నోటీసులు ఇచ్చేస్తున్నారు. తద్వారా తన మీద సంగీత ప్రియుల్లో ఉన్న అభిమానాన్ని దెబ్బ తీసుకుంటున్నారని, తనపై గౌరవం తగ్గేలా చేసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూస్తుంటే ఒకానొక సమయంలో ఇకపై అనుమతి లేకుండా పాటలు వింటున్నారని ప్రేక్షకులకు కూడా నోటీసులు పంపుతారేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇళయరాజా ప్రవర్తన అలా ఉంది మరి. ఇకనైనా ఇళయరాజా మారకపోతే తన అభిమానుల నుండే విమర్శలు తీవ్రంగా ఎదురుకోవాల్సి వస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు