Personality Development: ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త…లేదంటే మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే

జీవితం అంటేనే సముద్రంలో ఒక చిన్న పడవ లాంటిది. శ్రద్ధగా దారి చూపిస్తేనే అది కొంచమైనా మనం అనుకున్న విధంగా ముందుకు వెళుతుంది. లేదంటే దారి తప్పడం ఖాయం. చాలామంది జీవితాల్లో బయట ప్రపంచం వల్ల ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. కానీ కొంతమంది మాత్రం తమ సొంత జీవితాలకే బాధ్యత వహించడానికి కష్టపడుతూ ఉంటారు. అలాంటివారు మీ జీవితంలో ఉంటే మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే. ఇలాంటి వారి వల్ల వాళ్ల జీవితంతో పాటు వాళ్లను నమ్మిన వాళ్ల జీవితంలో కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా వెనకబడి పోతారు. మరి వాళ్లను దూరం పెట్టాలంటే లేదా అలాంటి వాళ్ల నుంచి తప్పించుకోవాలి అంటే ముందుగా అసలు రెస్పాన్సిబిలిటీని తీసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఎలా ఉంటారో తెలియాలి కదా. మరి వాళ్లలో కనిపించే సాధారణ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే…

1. జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడం
ఏదైనా సందర్భంలో మంచి లేదా చెడు ఏం జరిగినా అందులో మన పాత్ర, మన చర్యలు, నిర్ణయాలు, వాటి వల్ల వచ్చే రిజల్ట్ కు మనమే బాధ్యత వహిస్తామని అంగీకరించడమే జవాబుదారితనం. కానీ బాధ్యత లేకుండా ఉండేవారు ఇలాంటి సందర్భాల్లో ఇతరులపై నిందలు వేయడం, సాకులు చెప్పడం, తప్పు చేసినా ఒప్పుకోకపోవడం వంటివి చేస్తూ ఉంటారు.

2. వాయిదా వేయడం
బాధ్యత వహించడానికి కష్టపడే వ్యక్తులలో ఉండే అత్యంత సాధారణమైన మరొక అలవాటు వాయిదా వేయడం. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ బిజీగా ఉన్నానని, ప్రస్తుతానికి అలసిపోయానని ఇలా ఏదో ఒక సాకుతో పనులను పెండింగ్ లో పెట్టేస్తారు. కానీ నిజం ఏమిటంటే వాళ్లు దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకోకుండా తప్పించుకుంటున్నారు.

- Advertisement -

3. విమర్శలను అంగీకరించలేరు
ఎవరి జీవితాలకు వాళ్లే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా తీసుకోలేని వాళ్లు విమర్శలు ఎదురైతే వాటిని అంగీకరించడానికి చాలా కష్టపడతారు. అంటే తమ వ్యక్తిగత లోపాలను గుర్తించి, అవసరమైన మార్పులు చేసుకుని లైఫ్ లో ముందుకు సాగడాన్ని వాళ్ళు ఇష్టపడట్లేదు అని అర్థం. వాస్తవానికి విమర్శల వల్ల తమను తాము సరిదిద్దుకుంటూ, జీవితంలో మరింతగా ఎదగొచ్చు. అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం లేని వ్యక్తులు విమర్శలను వ్యక్తిగత దాడిగా చూస్తారు.

4. ఇతరులపై అతిగా ఆధారపడడం
సమస్యలను పరిష్కరించడానికి చొరవ తీసుకోవడానికి బదులు, ఇతరులు జోక్యం చేసుకొని వాటిని పరిష్కరించాలని ఆశిస్తూ ఉంటారు. ఇలా ఇతరులపై ఎక్కువగా ఆధారపడడం అనేది నిస్సహాయత మనస్తత్వాన్ని ఏర్పరుస్తుంది. అలాగే తమ బాధ్యతను వేరొకరిపై మోపడానికి ఇది మంచి మార్గంగా భావిస్తున్నారు అని అర్థం.

5. విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం
ఇక వీళ్లలో కనిపించే మరొక ప్రవర్తన తమను తాము బాధితులుగా చూసుకుంటారు. ఇలా విక్టిమ్ కార్డు ప్లే చేయడం వల్ల నిస్సహాయత అంటే సమస్యను పరిష్కరించడానికి అసలేం చేయకుండా, ఇతరుల దయపై బతకడం అలవాటు అవుతుంది.

6. ఓడిపోతామనే భయం
కొన్నిసార్లు ఓడిపోతామేమో అనే భయం వల్ల టార్గెట్ వైపు అడుగులు వేయకుండా అలాగే ఉండిపోతారు. కానీ తప్పు అనేది చేయకపోతే అది తప్పా ఒప్పా అనేది ఎలా తెలుస్తుంది? కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి భయపడే వాళ్ళు ఈ భయం వల్ల లైఫ్ లో సక్సెస్ ను సాధించలేరు.

వీటితోపాటు….

బాధ్యతను తీసుకోవడానికి సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడం, లైఫ్ ను నెగిటివ్ గా చూడడం, బౌండరీస్ క్రియేట్ చేయలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి అలవాట్లు ఉన్న వారి వల్ల వాళ్ల జీవితంతో పాటు, వాళ్లపై ఆధారపడే ఇతరుల జీవితం కూడా నాశనం అవుతుంది. అయితే ఇవి ప్రయత్నించినా మార్చుకోలేని అసాధ్యమైన అలవాట్లు ఏమీ కాదు. మన చర్యలకు, నిర్ణయాలకు బాధ్యత వహిస్తూ మన జీవితాలను కావలసినట్టుగా తీర్చిదిద్దుకునే శక్తి మనలో ప్రతి ఒక్కరికి ఉంది. అయితే ఇది అంత ఈజీ కాదు. కాబట్టి మన గురించి మనం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు, మనలోని అసహ్యకరమైన నిజాలను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. మన జీవితాలకు బాధ్యత వహించడం అంటే మన సొంత జీవితాన్ని మనమే రాసుకోవడం అని అర్థం. కాబట్టి మారి ఈ ప్రపంచాన్ని మరింత కొత్తగా చూస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు