Family Star Movie Review : ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ

Family Star Movie Review : విజయ్ దేవరకొండ ప్లాపుల్లో ఉన్నాడు. ‘టాక్సీవాలా’ తర్వాత అతను నటించిన ‘డియర్ కామ్రేడ్’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ‘లైగర్’ ‘ఖుషి’ వంటి సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి. మరోపక్క ‘సర్కారు వారు పాట’ అనే జస్ట్ యావరేజ్ మూవీ తీయడం వల్ల దర్శకుడు పరశురామ్ (బుజ్జి) కి కూడా గ్యాప్ వచ్చింది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘గీత గోవిందం’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో ‘ఫ్యామిలీ స్టార్’ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ‘సీతా రామం’, ‘హాయ్ నాన్న’ వంటి కమర్షియల్ హిట్లు అందుకున్న మృణాల్ ఠాకూర్ హీరోయిన్. మరి సక్సెస్ ఫుల్ పీపుల్ అంతా కలిసి చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ ఎలా ఉందో తెలుసుకుందాం రండి…

కథ :

గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయి. అన్నా వదినలు. వాళ్ళ పిల్లలు, నానమ్మ వీళ్ళే అతని ప్రపంచం. చిన్న వయసులోనే ఎక్కువ బాధ్యతలు తీసుకున్న అతని లైఫ్లోకి ఇందు (మృణాల్ ఠాకూర్) ఎంట్రీ ఇస్తుంది. అతని పెంట్ హౌస్లోనే ఆమె అద్దెకు దిగుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే ఇందు… గోవర్ధన్ కుటుంబంతో బాగా కలిసిపోతుంది. అతనితో ప్రేమలో పడుతుంది కూడా..  అయితే ఊహించని విధంగా గోవర్ధన్ ను హర్ట్ చేస్తుంది ఇందు. దీంతో ఆమెను గోవర్ధన్ దూరం పెడతాడు. ఆమెపై పగబట్టి ఆమె ప్రేమను నిరాకరిస్తాడు. ఏ విషయంలో గోవర్ధన్ ని ఇందు హర్ట్ చేసింది.? తర్వాత వీరి ప్రేమకథ ఏమైంది? గోవర్ధన్ ఫ్యామిలీ కథ ఏంటి? వంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

విశ్లేషణ :

రిలీజ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ లో ‘గ్యాంగ్ లీడర్’ ఛాయలు ఉన్నాయని ప్రచారం చేశారు. ముగ్గురు అన్నదమ్ములు, ఓ నానమ్మ.. వాళ్ళ ఇంట్లో రెంట్ కి దిగిన అమ్మాయి. ఈ సెటప్ చూస్తే  అందరికీ ‘గ్యాంగ్ లీడర్’ మైండ్లో మెదలడం సహజం. కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దర్శకుడు పరశురామ్ ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ చుట్టూ తిప్పాడు. కానీ సెకండాఫ్ అంతా విజయ్ – మృణాల్‌ల లవ్ ట్రాక్ చుట్టూనే తిప్పాడు. పరశురామ్ ఈ కథని విజయ్ కి చెప్పి ఎలా ఒప్పించాడో ఎంత జుట్టు పీక్కున్నా అర్ధం కాదు. ఇక దిల్ రాజు లాంటి నిర్మాత ఇన్వాల్వ్మెంట్ ఉండి కూడా ఇంత నాసిరకమైన కథనం ఎలా తయారయ్యింది అనేది కూడా అర్ధం కాని ప్రశ్న. సినిమాలో అక్కడక్కడా వన్ లైనర్స్ బాగున్నాయి. ఇంకొన్ని సిల్లీగా ఉన్నాయి. ఇక ఫస్ట్ హాఫ్ లో కానీ, సెకండ్ హాఫ్ లో కానీ ఆకట్టుకునే సన్నివేశాలు సరిగ్గా 4 ,5 కూడా ఉండవు.

- Advertisement -

పరశురామ్ గత సినిమా ‘సర్కారు వారి పాట’ చూసినప్పుడు ‘పరశురామ్ చాలా లాజిక్కులు వదిలేసాడు’ అని మాత్రమే అనుకున్నారు. కానీ మహేష్ బాబు వల్ల ఆ సినిమా కాస్తో కూస్తో ఆడింది. అయితే ఈ ‘ఫ్యామిలీ స్టార్’ చూస్తున్నంత సేపు ‘ ‘సర్కారు వారి పాట’ ఓ కల్ట్ సినిమా’ అని అంతా ఫీలవుతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. నిర్మాత దిల్ రాజు తప్పేమి లేదు. అతను మంచి నీళ్లు మాదిరి బడ్జెట్ పెట్టాడు.  తప్పంతా పరశురామ్‌దే. కొన్ని సినిమాలు స్టార్టింగ్ లో బోర్ కొట్టినా తర్వాత వేగం పుంజుకుంటాయి. కానీ ‘ఫ్యామిలీ స్టార్’ ఏ దశలోనూ ఆకట్టుకునే విధంగా ఉండదు. ఎమోషనల్ గా కూడా ఎవ్వరూ కనెక్ట్ అవ్వరు.

నటీనటుల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ బాగా చేశాడు. కానీ కథ, కథనాల్లో విషయం లేనప్పుడు అతను మాత్రం ఎంతని లాక్కొస్తాడు. మృణాల్ ఠాకూర్‌తో సెకండ్ హాఫ్‌లో ‘ప్రతీసారి వన్ మెన్ షో చేసేస్తాను’ అంటే కుదరదు అనే డైలాగ్ కూడా ఇందుకు సింబాలిక్ గా ఉంది. అయితే మృణాల్ మాత్రం తెరపై అందంగా కనిపించింది. నటన పరంగా కూడా ఆమె మంచి మార్కులే వేయించుకుంటుంది. కానీ మిగిలిన నటీనటులు సినిమాలో ఎందుకు ఉన్నారో వాళ్ళకే తెలియాలి. ఉదాహరణకి వెన్నెల కిషోర్ పాత్రనే తీసుకుందాం. అతను నవ్వించడానికి ఉన్నాడో, సపోర్టింగ్ రోల్ కోసం ఉన్నాడో అర్ధం కాదు. మిగిలిన నటీనటుల పరిస్థితి కూడా అలానే ఉంటుంది. పైగా ఇంకో హీరోయిన్ దివ్యంశ కౌశిక్ ను కూడా ఇందులో స్పెషల్ రోల్ కి తీసుకున్నారు. ఆమె కూడా ఖాళీగా ఉండి ఇలాంటి పాత్రలకి ఒప్పేసుకుంటుందా అనే డౌట్ రాకమానదు.

 

ప్లస్ పాయింట్స్ :

విజయ్ దేవరకొండ
మృణాల్ ఠాకూర్
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :

కథ
డైరెక్షన్
బోరింగ్ సన్నివేశాలు

మొత్తంగా ఏ విషయం లేని ఈ ‘ది ఫ్యామిలీ స్టార్’ ని నిర్మాత దిల్ రాజు గారు మరో ‘బ్రహ్మోత్సవం’ కాకుండా ప్రయత్నించగలిగారు. అంతేతప్ప సక్సెస్ ఫుల్ మూవీగా నిలబెట్టే స్కోప్ అయితే లేదు.

రేటింగ్ : 2/5

Click for ENGLISH Family Star Movie Review

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు