Love Me if You Dare Movie Review : లవ్ మీ – ఇఫ్ యూ డేర్ సినిమా రివ్యూ

Love Me if You Dare Movie Review : దిల్ రాజు ఫ్యామిలీ నుండీ ‘రౌడీ బాయ్స్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్. మొదటి సినిమాతో పాస్ మార్కులు వేయించుకున్న అతను ఇప్పుడు ‘లవ్ మీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్. ‘బలగం’ తర్వాత ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ నుండీ వచ్చిన సినిమా. మరి ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ‘లవ్ మీ’ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..

కథ :

అర్జున్ (ఆశిష్) తన స్నేహితుడితో కలిసి కొన్ని రిస్కీ వీడియోలు చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అలా అని ఆ డబ్బులతో పూర్తిగా తాను ఎంజాయ్ చేయాలని అనుకోడు. తన ఖర్చులకి కొంత ఉంచుకుంది మిగిలింది తన స్నేహితుడు ప్రతాప్ (రవికృష్ణ) కి ఇచ్చేస్తాడు. ఎప్పుడూ బ్లాక్ డ్రస్ వేసుకుని, చెప్పులు లేకుండా నడిచే వ్యక్తి అర్జున్.అంతేకాదు తానే శివుడిని అని చెప్పుకుంటూ ఉంటాడు. దిల్ సినిమాలో నితిన్ లాగా ఎవరైనా ఏదైనా వద్దు అంటే అదే చేస్తాడు. మరోపక్క తన స్నేహితుడు ప్రతాప్ ద్వారా ఓ పాడుబడ్డ బంగ్లా అక్కడ ఉండే దివ్యవతి అనే దెయ్యం గురించి తెలుసుకుంటాడు. ఎలాగైనా ఆ బంగ్లాలోకి వెళ్లి.. ఆ దెయ్యంని కలిసి తన కెమెరా ద్వారా జనాలకి చూపించాలనేది అతని తాపత్రయం. కానీ ఆ బంగ్లాలోకి వెళ్లిన తర్వాత అర్జున్ కి కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అవేంటి? అసలు ఈ కథలో ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ ప్రియా(వైష్ణవి చైతన్య) పాత్రేంటి? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

హార్రర్ నేపథ్యంలో సాగే సినిమాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే కెపాసిటీ కూడా వాటికి ఉంటుంది. కాకపోతే ఈ మధ్య ‘హర్రర్ సినిమాలు రొటీన్ అయిపోయాయి’ అనే కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. దానికి కారణం హర్రర్ నేపథ్యంలో తీసే సినిమాలకి సరైన స్క్రీన్ ప్లే ఉండకపోవడం వల్ల..! ‘లవ్ మీ’ ని అందుకు మరో ఎగ్జామ్పుల్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. ఏదో ఉంది అనే ఫీలింగ్ తో సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేయొచ్చు. కానీ సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుండీ ఎక్కడా కూడా హర్రర్ ఎలిమెంట్స్ లేకపోగా.. టేకింగ్ కూడా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. పోనీ క్లైమాక్స్ అయినా బాగుందా అంటే అదీ మరీ ఘోరం. దర్శకుడు అరుణ్ భీమవరపు ఏం చెప్పి దిల్ రాజు టీంని ఒప్పించి ఈ ప్రాజెక్టు ఫైనల్ చేసుకున్నాడో అతనికే తెలియాలి. ఇంకో రకంగా ఏమాత్రం ‘హై’ లేని ఈ కథతో.. ఇంత పెద్ద టీంని ఒప్పించి ఓకే చేయించుకున్నందుకు కూడా అతన్ని అభినందించాలి. సరే అది అలా ఉంచితే.. ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండీ దిల్ రాజు.. ‘ ఈ కథ విన్నప్పుడు ‘ఆర్య’ వైబ్స్ వచ్చాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. అది నమ్మి ఎవరైనా ఈ సినిమా చూడటానికి థియేటర్ కి వెళ్తే.. మొదటి అరగంటకే బయటకి వచ్చేయడం ఖాయం. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఆయన స్థాయిలో లేదు కానీ ఈ సినిమాకి ఎక్కువే అనే ఫీలింగ్ ని ఇస్తుంది. కీరవాణి సంగీతంలో రూపొందిన పాటలు కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ.. జనాలని ఎంత మాత్రం ఆకట్టుకోదు.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే..

ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ తో పోలిస్తే బెటర్ గా నటించాడు. కానీ సంపూర్ణ నటుడిగా ప్రూవ్ చేసుకోవాలి అంటే… ఇంకా టైం పట్టొచ్చు. ఇక ఈ సినిమాలో అతని పాత్రకి తల తోక ఉండదు. ఆ పాత్ర అలా ఉండటానికి కారణం ఏంటి? అనేది దర్శకుడికే తెలిసుండాలి. హీరోయిన్ వైష్ణవి చైతన్య టాలెంట్ ఈ సినిమాలో ఎక్కడా కనిపించదు. హీరో పాత్ర కంటే ఈమె పాత్ర మరీ ఘోరంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ పాత్రకి ఇచ్చిన ఎండింగ్ ‘సెన్స్ లెస్’. రవి కృష్ణ నటన బాగుంది. కానీ అతనికి ‘విరూపాక్ష’ రేంజ్ క్యారెక్టర్ ఇది అని కచ్చితంగా చెప్పలేం. రాజీవ్ కనకాల ఒక సీన్ కి పరిమితమయ్యాడు. సిమ్రాన్ చౌదరి రోల్ పర్వాలేదు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో ఒకటి, రెండు సీన్స్ లో కనిపించింది. ‘విరూపాక్ష’ ఫీల్ కలిగించాలనో ఏమో కానీ ఆమెను కూడా పట్టుకొచ్చారు. మిగిలిన నటీనటులు పెద్దగా గుర్తుండరు.

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

మిగతావన్నీ

చివరిగా.. ‘లవ్ మీ’ కి ‘ఇఫ్ యు డేర్’ అనే క్యాప్షన్ పెట్టారు. అలా అని ఇందులో హర్రర్ ఎలిమెంట్స్ ఉండవు. కానీ సినిమా చూడటానికి ‘డేర్’ కచ్చితంగా అవసరమే.

రేటింగ్ :1/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు