నాగ చైతన్య, కృతిశెట్టి ల కలయికలో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘బంగార్రాజు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. ఆ చిత్రంలో వీళ్ళ పెయిర్ కి కూడా మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ హిట్ పెయిర్ ను మరోసారి రిపీట్ చేయనున్నాడు తమిళ క్రేజీ దర్శకుడు వెంకట్ ప్రభు. నాగ చైతన్య- వెంకట్ ప్రభు కాంబినేషన్లో ఓ ద్విభాషా చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. రామ్ తో ‘వారియర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీనివాస చిట్టూరియే ఈ సినిమాకు నిర్మాత.
నాగ చైతన్య కెరీర్లో 22వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయనున్నారని సమాచారం. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు అని తెలుస్తుంది. ఈ వార్త నిజమైతే, ఈ తండ్రీకొడుకులు ఒకే సినిమా కోసం పనిచేయడం ఇదే మొదటిసారి అవుతుంది.
జూలైలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. వెంకట్ ప్రభు తెలుగులో చేస్తున్న మొదటి స్ట్రైట్ మూవీ ఇది. మరోపక్క నాగ చైతన్య నటిస్తున్న ‘థాంక్యూ’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.