SobhanBabu death anniversary : నటభూషణ శోభన్ బాబు కెరీర్ లో అత్యుత్తమ చిత్రాలు..

తెలుగు సినీ పరిశ్రమలో తొలితరం స్టార్ హీరోలలో ఒకరైన శోభన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో సినిమా ఇండస్ట్రీలో శోభన్ బాబు అంత అందగాడు ఎవరూ లేరని అప్పటి ప్రేక్షకులు అంటూ ఉంటారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ కంటే కూడా ఎక్కువగా మహిళా ప్రేక్షకాదరణ పొందిన నటుడాయన. సినిమా ఇండస్ట్రీ లో ఎవరైనా హీరో అవ్వాలనుకుంటే అందం విషయంలో ముందుగా శోభన్ బాబు గురించే మాట్లాడతారు. మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర కథాయనకుడిగా రాణించిన ఆయన కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాలకి స్వస్తి చెప్పారు. ఇక 2008 లో చెన్నైలో ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఇక ప్రేక్షకుల మనసుల్లో నటభూషణుడిగా, ఆంధ్రుల అందగాడిగా ఎంతో పేరు తెచ్చుకున్న శోభన్ బాబు వర్ధంతి నేడు. ఈ సందర్బంగా ఆయన నటించిన బెస్ట్ మూవీస్ పై ఓ లుక్కేద్దాం..

1. వీరాభిమన్యు (1965)

శోభన్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం 1965 లో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో శోభన్ బాబు అభిమన్యుడిగా తన నటనా చాతుర్యాన్ని చాటిచెప్పాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడిగా ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. ఈ సినిమాతో శోభన్ బాబు హీరోగా వెనుదిరిగి చూడాల్సిన పనిలేకుండా పోయింది. మహా భారత యుద్ధ నేపథ్యంలో వచ్చిన పౌరాణిక చిత్రం ఆ రోజుల్లో సంచలన విజయం సాధించింది.

- Advertisement -

2. మనుషులు మారాలి (1969)

ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ధీటుగా శోభన్ బాబు ని స్టార్ గా నిలబెట్టిన సినిమా 1969లో విడుదలయిన ‘మనుషులు మారాలి’. శోభన్ బాబు కార్మిక నాయకుడిగా నటించిన ఈ సినిమా ఆ రోజుల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఈ చిత్రం ఆయన నట జీవితంలో మైలురాయిగా నిలవగా, స్టార్ హీరోగా శోభన్ బాబు స్థిరపడ్డాడని చెప్పవచ్చు.

2. చెల్లెలి కాపురం (1971)

కె. విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శోభన్ బాబు చెల్లెలిని అభిమానించే అన్నయ్యగా, ఒక కవితా రచయిత గా రెండో కోణాలున్న పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర కష్టాలకి దశలో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకునేవారు. అంతటి ఘన విజయం సాధించింది ఈ సినిమా.

4.సంపూర్ణ రామాయణం(1972)

అప్పటికి రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనే అనుకునే తెలుగు ప్రేక్షకుల మనసులు మార్చిన చిత్రమిది. బాపు దర్శకత్వంలో వచ్చిన పౌరాణిక చిత్రం సంపూర్ణ రామాయణం లో శోభన్ బాబు రాముడిగా నటించి మెప్పించారు. ఆరోజుల్లో ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ని మించిన అందగాడు శోభన్ బాబు అని కితాబిచ్చారు విలేఖర్లు. ఈ చిత్రంతో ఆయన అగ్రకథానాయకుడిగా స్థిరపడ్డారని చెప్పొచ్చు.

5. మానవుడు దానవుడు (1972)

ఈ చిత్రంతో శోభన్ బాబు కమర్షియల్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ లో కూడా నటించి మెప్పించారు. అప్పట్లో శోభన్ బాబుకి మంచి బ్రేక్ ఇచ్చి సిల్వర్ జూబ్లీ జరుపుకుంది.

6. సోగ్గాడు(1975)

శోభన్ బాబుని సోగ్గాడు శోభనాద్రి గా ప్రేక్షకులు పిలుచుకునేలా చేసిన సినిమా ఇది. శోభన్ బాబు లో ఓ రేంజ్ కామెడీ యాంగిల్ ని చూపించిన ఈ చిత్రంలో పల్లెటూరి సోగ్గాడిగా శోభన్ బాబు అద్భుతంగా నటించారు. ఆ రోజుల్లోనే గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది ఈ సినిమా.

7. కురుక్షేత్రం(1977)

శోభన్ బాబు కృష్ణుడిగా నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రంలో కృష్ణ, అర్జునుడిగా, కృష్ణం రాజు కర్ణుడిగా నటించారు. ఆరోజుల్లో తమ స్టార్ డమ్ తో ఓ రేంజ్ లో వెలుగుతున్న ఈ ముగ్గురూ తొలిసారిగా ఈ చిత్రంలో కలిసి నటించగా ఆరోజుల్లో ఈ చిత్రానికి పోటీగా కావాలని ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ నిర్మించడం జరిగింది. అయితే కురుక్షేత్రం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా ఫైనల్ గా యావరేజ్ హిట్ అయింది. కానీ ఎన్టీఆర్ దానవీర శూర కర్ణ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే కురుక్షేత్రం అదే సమయంలో హిందీలో విడుదల కాగా అక్కడ సంచలన విజయం సాధించింది.

8. గోరింటాకు (1979)

దాసరినారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో శోభన్ బాబు మహిళా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

9. స్వయంవరం (1982)

80ల కాలంలో చిరంజీవి లాంటి హీరోలు తమ జోరు చూపిస్తున్న సమయంలో ప్లాపుల్లో ఉన్న శోభన్ బాబు కి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చిన సినిమా ఇది. ఈ చిత్రంలో ప్రియురాల్ని కోల్పోయిన ఒక భగ్న ప్రేమికుడిగా శోభన్ బాబు అద్భుతంగా నటించి మెప్పించారు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటించడం విశేషం.

10. ఏవండీ ఆవిడొచ్చింది (1993)

ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం శోభన్ బాబు సినిమాలకి ముగింపు చెప్పే టైం లో వచ్చింది. అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్రం శోభన్ బాబు కి అభిమానుల్లో ఆదరణ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది.

ఇక ఇవేగాక బలి పీఠం, మల్లెపూవు, దేవాలయం, ముందడుగు, మహారాజు మొదలయిన చిత్రాల ఘన విజయాలతో అగ్ర నటుడిగా శోభన్ బాబు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకొన్నాడు. ఇక 1996 లో హలొ గురు సినిమాలో శోభన్ బాబు చివరిగా నటించడం జరిగింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు