పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం విడుదలై ఈరోజుతో 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. అదేంటి హరీష్ శంకర్ సినిమాకి ‘శతమానం భవతి’ దర్శకుడు ట్వీట్ చేయడం ఏంటి అని అందరికీ డౌట్ రావచ్చు. అయితే ‘గబ్బర్ సింగ్’ సినిమాకి స్క్రీన్ ప్లేని అందించింది ఈయనే. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. సతీష్ వేగేశ్నతో పాటు రమేష్ రెడ్డి కూడా ‘గబ్బర్ సింగ్’ స్క్రీన్ ప్లే విభాగానికి పనిచేసారు.
ఇక సతీష్ వేగేశ్న తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. “మా గబ్బర్ సింగ్ కి పది సంవత్సరాలు.అద్భుత విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు.ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించే అవకాశం ఇచ్చిన అన్నయ్య హరీష్ శంకర్ కి, నిర్మాత బండ్ల గణేష్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ” అంటూ పేర్కొన్నారు.
బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకొని పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కంబ్యాక్ ను అందించింది. 2011 వ సంవత్సరం మే 11న ఈ మూవీ రిలీజ్ అయ్యింది.