Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కలకలం

Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు ఆగట్లేదు. తాజాగా సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పుల కలకలం రేగింది. ఆదివారం తెల్లవారుజామున 4:50 గంటలకు బైక్ పై వచ్చిన అగంతకులు ముంబైలోని గాలక్సీ అపార్ట్మెంట్ ముందు గాల్లో కాల్పులు జరిపి పారిపోయారు. ఆగంతకులు రెండు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు సల్మాన్ ఇంటి వద్దకు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఆయనకి భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ కాల్పుల ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సల్మాన్ కృష్ణ జింకను వేటాడిన కేసులో కోర్టు నుండి ఆయనకు ఊరట లభించినప్పటికీ.. బిష్ణయ్ తెగ ప్రజలు మాత్రం సల్మాన్ పై అగ్గిమీద గుగ్గిలం అవుతూనే ఉన్నారు. అలాగే పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్దు మూసేవాలా దారుణ హత్యకు గురైనప్పటినుండి సల్మాన్ కి బెదిరింపు ఫోన్లు, మెయిల్స్ అందుతూనే వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆయన ఇంటి పైనే కాల్పులు కలకలం రేపుతోంది.

సల్మాన్ ఖాన్ ని మట్టుపెడతామంటూ గతంలో గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణయ్, గోల్డీ బ్రార్ లు అనేకసార్లు హెచ్చరికలు జారీ చేశారు. 2018లో బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడు సంపత్ నెహ్ర సల్మాన్ ఖాన్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడు. అయితే అతను దాడి చేయడానికంటే ముందే అతని ప్లాన్ పోలీసులకు తెలియడంతో గతంలోనే సల్మాన్ కి భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే సల్మాన్ కి గన్ లైసెన్స్ కూడా మంజూరు చేశారు. ఇక గ్యాంగ్ స్టర్ లారెన్స్ టాప్ టెన్ జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారని గత ఏడాది ఎన్ఐఏ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు