RRR : రాజమౌళిని మళ్ళీ ఇబ్బంది పెట్టిన మీడియా.. ఆ వివాదాస్పద ప్రశ్నపై అసహనం.

RRR : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అద్భుత కళా ఖండం ‘బాహుబలి’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగా ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రంలో నటించిన ప్రతి నటుడిని, అలాగే సినిమాకి పని చేసిన ప్రతి టెక్నిషియన్ ని నేషనల్ వైడ్ గా పాపులర్ చేసాయి. ఈ సినిమా వచ్చి ఏడేళ్లవుతున్నా ఇంకా దీనిపై వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు బాహుబలి యానిమేటెడ్ సిరీస్ రూపంలో వచ్చేందుకు రెడీ అయింది. ఆయన రూపొందించిన ‘బాహుబలి 1: ది బిగినింగ్’, ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ క్లాసిక్ చిత్రాల ఆధారంగా ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్ ఇప్పుడు వస్తోంది. మే 17వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం స్టార్ డైరెక్టర్ రాజమౌళి (మే 7) మీడియా సమావేశంలో పాల్గొనగా, పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

యానిమేషన్ మూవీ చేస్తా..!

ఇక యానిమేషన్ కి సంబంధించిన ప్రెస్ మీట్ లో యానిమేషన్ సినిమా చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా అని ఈ సమావేశంలో రాజమౌళికి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. యానిమేషన్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో తనకు ఆలోచన ఉందని, అది ఎప్పుడో ఒకసారి జరుగుతుందని అన్నారు. ఇక తాను సినిమాలు చేసే కొద్దీ నేర్చుకుంటూనే ఉంటానని.. వాటి ద్వారా రానున్న చిత్రాల్లో కొత్త కొత్త విషయాలు చేసేందుకు తాను ప్రయత్నిస్తానని అన్నారు. అలాగే తన చిత్రాలతో పాటు తాను మాట్లాడే అందరి నుంచి నేర్చుకుంటానని, ఆ ఆలోచన ఉంది కాబట్టే తాను ఈగ చేశానని, అందులో కొంత భాగం యానిమేషన్ ఉందని అన్నారు. ఇక ఇప్పుడు శరత్, హాట్‍స్టార్‌తో భాగస్వామ్యమవుతున్నా, ఎలా ఉంటుందో నేర్చుకునేందుకు నాకు ఉపయోగపడ్డాయని, ఇది నేను సినిమా (యానిమేషన్) చేసేందుకు స్కిల్స్ పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని రాజమౌళి అన్నారు.

RRR పై మళ్ళీ అదే ప్రశ్న ..

ఇక అసలు విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో రామ్‍చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా చేసిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR)పై ఓ ప్రశ్న ఎదురైంది. ఆ చిత్రంలో ఒక హీరోను ఎక్కువగా, మరో హీరోను తక్కువగా చూపించారనే చర్చ సోషల్ మీడియాలో ఇంకా సాగుతోందని, ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని రాజమౌళిని ఓ రిపోర్టర్ అడిగారు. ఈ వివాదాస్పద ప్రశ్నకు రాజమౌళి కాస్త అసహనం చెందారు. “ఆ ప్రశ్నకు ఇది వేదిక కాదు. సందర్భం కాదు. ఏదీ కాదు” అని ఈ ప్రశ్నపై కామెంట్ చేసేందుకు నిరాకరించారు. అయితే ఈ ప్రశ్న ఇంతకు ముందు రాజమౌళి కి చాలా సార్లు ఎదురైంది. అందరికి తెలిసిందే అయినా, మళ్ళి గుర్తుంచుకోవాలి. ఆ సినిమాలో ఎవర్ని తక్కువ చేయలేదు. ఆయా సందర్భాలను బట్టి ఆయా హీరోలు హైలెట్ అవుతారు. ఇరు హీరోల అభిమానులు ఎప్పటికప్పుడు ఈ వాదన చేస్తూనే ఉంటారు. కానీ మీడియా వారు అన్నీ తెలిసి కూడా ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ వేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ట్రేడ్ విశ్లేషకులు కూడా చల్లారిన చిచ్చుని మళ్ళీ పొగబెట్టడం ఏంటి అని అంటున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు