వెంకటేష్- వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘F3’ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో మరో గ్లామర్ బ్యూటీ సోనాల్ చౌహాన్ కీలక పాత్ర పోషించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. మే 27న విడుదలైన ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే రూ.35 కోట్ల షేర్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో ‘ఎఫ్3’ థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. ఈ క్రమంలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు ‘F3’ యూనిట్.
ఈ వేడుకలో నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…. “నా 45 ఏళ్ళ కెరీర్లో నాకు నచ్చిందే చెప్పాను. ‘F3’ చూశాక ఈ సినిమా హిట్ అవ్వకపోతే మొహం చూపించనని అన్నాను. అందుకే నేను మాస్క్ వేసుకుని మరీ ఇలా వచ్చాను. ఇప్పుడు నిజమైన సక్సెస్ ప్రేక్షకులు ఇచ్చారు. ఈ సినిమాను ట్రిపుల్ బ్లాక్ బస్టర్ చేశారు. ఈరోజు గుంటూరులో చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఈ సినిమాని రెండు విషయాలను నమ్ముకుని తీశాం. ఒకటి నవ్వు. రెండు ప్రేక్షకులు..! 45 ఏళ్ళుగా నేను నవ్వునే నమ్ముకుని సినిమాలు చేస్తున్నాను. అలా ఎఫ్2,ఎఫ్3 చేశాను. ప్రపంచంలోని నలుమూలలనుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. మళ్ళీ మీ రోజులు గుర్తుకువచ్చాయి అని. నాకు మాత్రం `మాయలోడు` సినిమా గుర్తుకు వచ్చింది. మనకు పండుగ రోజుల్లో పాత సినిమాలు టీవీల్లో వేస్తుంటారు. గుండమ్మకథ, అప్పుచేసి పప్పుకూడు.. వంటి చిత్రాలు నవ్వులు పూయిస్తుంటాయి. అలా F3 నవ్వులు పూయించింది” అంటూ చెప్పుకొచ్చారు.