HBD Trisha Krishnan : 41 ఏళ్ళ అందాల “నాయకి” నట ప్రస్థానం..

HBD Trisha Krishnan : త్రిష కృష్ణన్.. ఇప్పుడు సౌత్ లోనే బిజీ సీనియర్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. పదేళ్ల ముందువరకు కూడా టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ చెన్నై సుందరి సౌత్ ఇండస్ట్రీ లో గ్లామర్ హీరోయిన్లలో ఒకరు. ఒకప్పుడు కుర్రాళ్ళ క్రష్ లిస్టులో ఈమెనే ముందుండేది. ఇక నాలుగు పదుల వయసులోనూ చెక్కు చెదరని అందంతో అందరిని సర్‌ప్రైజ్‌ చేస్తుంది ఈ చెన్నై సోయగం. ఇప్పటి హీరోయిన్లు సైతం ఆమె గ్లామరస్‌ లుక్‌ చూసి కళ్లుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. అందంతో పాటు, అభినయంతో కూడిన నటనతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసే ఈ సుందరి మొన్న మొన్నటివరకు కూడా కెరీర్ లో పెద్దగా మూవీ ఆఫర్స్‌ లేక సినిమాలకు దూరంగా ఉంది. కానీ మణిరత్నం తీసిన పొన్నియిన్‌ సెల్వన్‌తో మళ్లీ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చింది. ఆ సినిమాలో కుందవాయి గా నటించిన త్రిష ఇప్పటికీ తనలో అందం చేరగలేదని, సత్తా తగ్గలేదని నిరూపించింది. ఇక ఆ సినిమా తర్వాత కోలీవుడ్, టాలీవుడ్ లలో మళ్ళీ బిజీ అయింది. ఇక నేడు(మే 4) త్రిష కృష్ణన్ బర్త్‌డే. ఈరోజుతో త్రిష 41వ వసంతంలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా ఓ సారి ఈ నటనా నాయకి సినీ ప్రస్థానం పై ఓ లుకేద్దాం..

త్రిష నట ప్రస్థానం..

త్రిష (HBD Trisha Krishnan) 1983 మే 4న జన్మించగా, చెన్నైలోని తన చిన్నతనం అంతా గడపగా, బీబీఏ వరకూ చదివింది. అయితే డిగ్రి తర్వాత త్రిష మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టింది. మోడల్‌గా పలు షోలో పాల్గొన్న త్రిష, 1999లో ‘మిస్ సేలమ్’ అందాల పోటీలో పాల్గోని కీరిటం గెలుచుకోగా, అదే ఏడాది ‘మిస్‌ చెన్నై’ గా కూడా అందాల కీరిటాన్ని గెలుచుకుంది. ఇక అప్పటినుండే త్రిష నటనపై ఆసక్తితో చదువాపేసింది. అదే సమయంలో ఫల్గుణి పాఠక్ ప్రైవేట్ మ్యూజిక్ వీడియో సాంగ్‌ లో ‘మేరీ చునార్ ఉద్ ఉద్ద్ జాయే’ లో నటించే ఆఫర్‌ వచ్చింది. ఇందులో అయోషా టాకియా స్నేహితురాలిగా కొన్ని సెకన్ల పాటు కనిపించింది. అలా పాటలో త్రిషను చూసిన డైరెర్ట్‌ ప్రవీణ్‌ గాంధీ తన తమిళ చిత్రం ‘జోడి’ లో హీరోయిన్ ఫ్రెండ్ గా చిన్న పాత్ర ఇచ్చారు. ఉన్న కొద్దిసేపు తన స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ఆకట్టుకున్న త్రిష, సూర్య నటించిన “మౌనం పెసియదే” సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాలు చేసి త్రిష మన తెలుగు డైరెక్టర్స్‌ని సైతం ఆకట్టుకుంది. దాంతో ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ తో వర్షం హిట్ తో ఇక వెనక్కి తిరిగిచూడలేదు. తెలుగులో వరుస ఆఫర్స్‌ అందుకుంటూ తక్కువ టైంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, కింగ్ వంటి బ్లాక్ బస్టర్లతో తెలుగులో చక్రం తిప్పింది. అదే టైం లో తమిళ్ లో గిల్లి, ఆరు వంటి బ్లాక్ బస్టర్లు కొట్టి అక్కడా స్టార్ హీరోయిన్ గా ఊపేసింది.

రీ ఎంట్రీ లో రెట్టించిన జోరు..

2010 వరకు వరుస సినిమాలతో రచ్చ చేసిన త్రిష ఆ తరువాత ప్లాపులు ఎదురవడంతో సినిమాలు తగ్గాయి. ఓ దశలో ఫేడవుట్ అయిందనిపించింది. తీన్ మార్, నాయకి, మోహిని ఇలా ఎలాంటి సినిమాలు చేసినా డిజాస్టర్లు అయ్యాయి. కానీ 96 బ్లాక్ బస్టర్ తో మెల్లిగా పికప్ అయింది. ఇక రెండేళ్ల కింద వచ్చిన పొన్నియిన్ సెల్వన్ బ్లాక్ బస్టర్ తో మరింత ఊపొచ్చింది. త్రిష రీఎంట్రీ అఫీషియల్ గా ‘పొన్నియిన్ సెల్వన్’ తోనే అని చెప్పొచ్చు. ఇందులో త్రిష కుందవైగా యువరాణి పాత్రలో నటించింది. చాలా గ్యాప్‌ తర్వాత ఈ సినిమాలో త్రిషను చూసి అంతా షాక్ అయ్యారు. అదే చెక్క చెదరని అందంతో అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది త్రిష. ఇక ఈ మూవీ ఆడియో, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో మెరిసిన ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ సందడి చేశాయి. సినిమా వచ్చిన కొత్తలో అంతా త్రిష అందం గురించే మాట్లాడుకున్నారు. ఇప్పుడదే గ్లామర్ తో మళ్ళీ వరుస ఛాన్సులు కొట్టేసింది. లాస్ట్ ఇయర్ “లియో” మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న త్రిష ఈ ఏడాది టాలీవుడ్ లో విశ్వంభర మూవీ తో ఎంట్రీ ఇస్తుంది. అలాగే తమిళ్ లో థగ్ లైఫ్, విదా మాయూర్చి వంటి బడా ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీ అయింది. ఈ విధంగా కెరీర్ లో కింద పడినా మళ్ళీ లేచి నిలబడి ఇప్పుడు సూపర్ ఫామ్ లోకి వచ్చింది. ఇక ఇప్పటి హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తూ వరుస క్రేజీ సినిమాలతో బిజీ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు