HBD K.RaghavendraRao : శతాధిక చిత్రాల “దర్శకేంద్రుడు” ఈ “రాఘవేంద్రుడు”..!

HBD K.RaghavendraRao : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమర్షియాలిటికీ మెరుగులు దిద్దీ ట్రెండ్ సెట్ చేసిన దర్శకుల్లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ని ముందుగా ప్రస్తావిస్తారు. అప్పటివరకూ సాంఘీక, పౌరాణిక, జానపద, భక్తి రస చిత్రాలతో ఒకే రూటులో వెళ్తున్న తెలుగు చిత్ర పరిశ్రమని మాస్ కమర్షియల్ పేరుతో కొత్తగా సినిమాలు తీయడం మొదలుపెట్టారు. హీరోకి ఒక డిఫరెంట్ మ్యానరిజం ఇవ్వడం ఈయన సినిమాల నుండే మొదలయిందని అంటూ ఉంటారు. కమర్షియాలిటీకి ఒక కొత్త అర్ధాన్ని చెప్తూ ఆరోజుల్లోనే ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నారు దర్శకేంద్రుడు. మాస్ కమర్షియల్ సినిమాలు తీయడంలో తనకు తానే సాటి అనిపించుకున్న రాఘవేంద్రరావు, రొమాంటిక్ పాటలకు ఆయన పెట్టింది పేరుగా ప్రసిద్ధి పొందారు. అలాగే భక్తిరస సినిమాలు తీయడంలోనూ దిట్ట. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు రాఘవేంద్రరావు. శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్న దర్శకేంద్రుడు “కోవెలమూడి రాఘవేంద్రరావు” (HBD K.RaghavendraRao) (మే 23)పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయన గురించి కొన్ని విశేషాలని చర్చించుకుందాం..

HBD K.RaghavendraRao Birthday special Story

అడవిరాముడి నుండి వెంకటేశాయ వరకు..

1975 లో “బాబు” అనే చిత్రంతో మొదలైన రాఘవేంద్రరావు సినీ ప్రస్థానం ఇప్పటికి విజయవంతంగా కొనసాగుతుంది. 1977 లో వచ్చిన “అడవిరాముడు” సినిమాతో రాఘవేంద్రరావు కెరీర్ మారిందని చెప్పాలి. అప్పటివరకు ఓ మూసధోరణి లో వెళ్తున్న తెలుగు సినిమాకి కమర్షియల్ మెరుగులు దిద్ది ట్రెండ్ సెట్ చేసారు. ఆ తర్వాత వేటగాడు, త్రిశూలం, దేవత, అడవి దొంగ, అగ్ని పర్వతం, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో కమర్షియల్ గా ట్రెండ్ సెట్ చేసాడు. ఇవే కాక, అన్నమయ్య, శ్రీ రామదాసు, శ్రీ మంజునాథ, పాండు రంగడు వంటి చిత్రాలతో భక్తి రస చిత్రాలు కూడా తీసి తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఇక దర్శకుడిగా ఎన్నో రికార్డులతో పాటు, అవార్డులు కూడా వరించాయి. ప్రస్తుతం ఆయన సినిమాలు తగ్గించేశారు. నందమూరి తారకరామారావు నుంచి చిరంజీవి, అలాగే నేటి జనరేషన్ హీరోలలో కూడా ఎంతో మంది హీరోలతో సినిమాలు చేశారు రాఘవేంద్రరావు.

- Advertisement -

స్టార్స్ ని పరిచయం చేసిన రాఘవేంద్రుడు..

ఇక నేటి జనరేషన్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న విక్టరీ వెంకటేష్ సహా, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోలు రాఘవేంద్రరావు సినిమాలతోనే పరిచయం అయ్యారు. వీళ్ళే కాక అతిలోక సుందరి శ్రీదేవి, కుష్బూ, టబు, దీప్తి భట్నాగర్, శిల్ప శెట్టి, తాప్సి లాంటి ఎందరో హీరోయిన్స్ ని కూడా రాఘవేంద్రరావు తెలుగు సినిమాకి పరిచయం చేశారు. రాఘవేంద్రరావు తన సినీ కెరీర్ లో మొత్తం ఎనిమిది నంది పురస్కారాలు, ఐదు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు అందుకున్నారు. ఇక శ్రీదేవితో రాఘవేంద్రరావు 24 సినిమాలు చేశారు. అలాగే ఎన్టీ రామారావు తో 11 సినిమాలు చేయగా, మెగాస్టార్ చిరంజీవితో 13 సినిమాలు చేసారు. అలాగే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్, జగపతి బాబు, రాజ శేఖర్, సుమన్ ఇలా రెండో తరం హీరోలందరితో సినిమాలు తీసాడు రాఘవేంద్రరావు. తాజాగా నేడు (మే23) ఆయన పుట్టినరోజు సందర్బంగా మరోసారి బర్త్ డే విషెస్ తెలియచేస్తూ, 107 చిత్రాలకు దర్శకత్వం వహించిన శతాధిక చిత్ర దర్శకుడుగా మళ్ళీ ఆయన దర్శకత్వం వహించాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు