Dasari Narayana Rao : దర్శకరత్న దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టిన క్లాసిక్ చిత్రాలు!

Dasari Narayana Rao : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దర్శకతర్న దాసరినారాయణరావు స్థానం ప్రత్యేకమైనది. తెలుగు సినిమా ట్రెండ్ ను మార్చిన దిగ్దర్శకులలో ఆయన ఒకరు. శతాధిక చిత్రాల దర్శకులలో ఒకరిగానే కాకుండా అత్యధిక చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడుగా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకెక్కిన ఘనుడాయన. ఆయన సినిమా అంటే ఆ రోజుల్లో ఒక సంచలనమే. కమర్షియల్ గానే కాకుండా, సమాజాన్ని ఉద్దేశించి, సందేశాత్మక చిత్రాలు, విప్లవాత్మక చిత్రాలు తీసి టాలీవుడ్ లో ట్రెండ్ క్రియేట్ చేసారు. స్టార్స్ నటులతోనే కాకుండా చిన్న హీరోలతో, కొత్త నటీనటులతోను సూపర్ హిట్ చిత్రాలు తీసి, సినిమాకి అసలైన హీరో కెప్టెన్ డైరక్టర్ అని చాటి చెప్పారు. విభిన్నమైన కథలతో ప్రేక్షకులని ఆకట్టుకునేలా తీసిన అద్భుతమైన చిత్రాలెన్నింటినో ప్రేక్షకులకు అందించారు. అలాంటి చిత్రాలలో బెస్ట్ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం.

తాత – మనవడు (1973) :

దర్శకరత్న దాసరినారాయణరావు దర్శకత్వం వహించిన తొలి చిత్రం “తాత – మనవడు”. తొలి చిత్రంతోనే ఎస్వీ రంగారావు లాంటి లెజెండరీ మహానటులతో పనిచేసే అదృష్టాన్ని దక్కించుకున్నారు దాసరి. మధ్యతరగతి జీవితాల్ని కథలుగా చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రంలో హాస్యనటుడు రాజబాబును హీరోగా చేసారు. ఆరోజుల్లోనే 175 రోజులాడి రికార్డు సృష్టించింది ఈ సినిమా. అంతే కాదు, ద్వితీయ ఉత్తమ చిత్రంగా తాత – మనవడు ‘నంది’ అవార్డు సొంతం చేసుకుంది.

బలిపీఠం (1975) :

ప్రముఖ నవలా రచయిత్రి రంగ నాయకమ్మ రాసిన ‘బలిపీఠం’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం జరిగింది. కులాంతర వివాహం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఆరోజుల్లో ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరో,హీరోయిన్లుగా నటించిన శోభన్ బాబు, శారద పోటీపడి ఉత్తమనటనను కనబరిచారు.

- Advertisement -

స్వర్గం – నరకం (1975) :

మంచు మోహన్‌బాబు – క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణలను వెండి తెరకు పరిచయం చేస్తూ తీసిన సినిమా స్వర్గం – నరకం. మనస్పర్థలు, అపోహలు భార్యాభర్తల జీవితాన్ని ఎలా అస్తవ్యస్తం చేస్తాయో చెప్పిన చిత్రం. ఈ చిత్రం తర్వాత నటుడిగా రాణించిన మోహన్ బాబు దాసరితో ఎన్నో చిత్రాల్లో నటించి, నిర్మించారు.

శివరంజని (1978) :

సినిమా రంగంపై దాసరి తీసిన సినిమా శివరంజని. అప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసిన జయసుధ ఈ సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయ్యారు. ఇక దాసరి తన సొంత సంస్థ తారక ప్రభు ఫిలింస్‌ పతాకం మీద నిర్మించిన ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా బెంగుళూరులో ఏకంగా 365 రోజులాడింది.

గోరింటాకు (1979) :

దాసరి నారాయణ రావు దర్శకత్వంలో శోభన్‌బాబు, సుజాత, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆ రోజుల్లో ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో ‘గోరింటా పూసింది కొమ్మా లేకుండా’ పాట, అలాగే ‘కొమ్మకొమ్మకో సన్నాయి.. పాటలు ఎవర్గ్రీన్ క్లాసిక్స్.

రంగూన్ రౌడీ(1979) :

రెబల్ స్టార్ కృషం రాజు హీరోగా నటించిన 100వ చిత్రమిది. దాసరినారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లో ఘన విజయం సాధించింది. ఇక ఆరోజుల్లో బర్మా లో షూటింగ్ జరుపుకున్న మొదటి భారతీయ చిత్రం ఇదే.

సర్దార్‌ పాపారాయుడు (1980) :

ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశానికి పునాది వేసిన చిత్రం ‘సర్దార్‌ పాపారాయుడు’. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ కమర్షియల్ సినిమాలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం ఆరోజుల్లో కేవలం 28 రోజుల్లో చిత్రీకరణ పూర్తవడం విశేషం.

ప్రేమాభిషేకం (1981) :

దాసరి రచించిన అద్భుత ప్రేమకావ్యం “ప్రేమాభిషేకం”. ఈ చిత్రంలో ఏఎన్నార్, శ్రీదేవి, జయసుధల నటన అమోఘం. ఆ రోజుల్లో మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో చక్రవర్తి ఇచ్చిన పాటలన్నీ సూపర్ హిట్. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం 365 రోజులాడింది.

మేఘసందేశం (1982) :

అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన 200వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కగా, అక్కినేని, జయసుధ, జయప్రద ప్రధాన తారాగణంగా తెరకెక్కినది. ఈ సినిమా కూడా మ్యూజికల్ గా బాగా హిట్ అయింది. ఇక ఆరోజుల్లోనే తొమ్మిది విభాగాల్లో నందుల్ని సొంతం చేసుకుంది.

బొబ్బిలిపులి (1982) :

ఎన్టీఆర్‌ దాసరి కాంబినేషన్‌లో సంచలన విజయం సాధించిన చిత్రమిది. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికుడు, తన దేశంలోపల జరిగే అక్రమాలను ఎదుర్కొని ఎలా నిలబడ్డాడన్న కథాంశంతో తెరకెక్కింది.

తాండ్ర పాపారాయుడు (1986) :

కృష్ణంరాజు హీరోగా దాసరి తెరకెక్కించిన తొలి చారిత్రక చిత్రమిది. 1775 సంవత్సరం ప్రాంతంలో రాయలసీమ లో జరిగిన కథ ఇది. అప్పట్లోనే దాదాపుగా 1.5 కోట్లతో తెరకెక్కించారు. కృష్ణంరాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.

ఒసేయ్‌ రాములమ్మ (1997) :

దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు తెరకెక్కించగా, అందులో అందరికి ప్రధానంగా గుర్తుండేది ‘ఒసేయ్‌ రాములమ్మా’ చిత్రం. ఉత్తరప్రదేశ్‌లో ఓ గిరిజన మహిళపై జరిగిన అన్యాయాన్ని కథగా మలిచి కమర్షియల్ హిట్ కొట్టారు. ఇక రాములమ్మగా విజయశాంతి తొలిసారి ఆమె పాత్రకు డబ్బింగ్‌ చెప్పుకొన్నారు. కృష్ణ, దాసరి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆ రోజుల్లో 200 రోజులాడింది.

ఇవే కాక దాసరి దర్శకత్వంలో మజ్ను, రాజీనామా, స్వయంవరం, కంటే కూతుర్ని కను, రంగూన్ రౌడీ, లంకేశ్వరుడు, బంగారు కుటుంబం వంటి చిత్రాలెన్నో ఘన విజయం సాధించాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు