నేచురల్ స్టార్ నాని, నజ్రియా హీరో, హీరోయిన్లుగా ‘బ్రోచేవారెవరురా’ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. కొంత గ్యాప్ తర్వాత నాని నుండీ వస్తున్న కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఈ సినిమా జూన్ 10న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. అయితే ఈ సినిమా బుకింగ్స్ అనుకున్నంత స్పీడ్ గా జరగడం లేదు. ఇప్పటివరకు చూసుకుంటే 23 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే చోటు చేసుకుందని తెలుస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే, సినిమాకు కొంత వరకు నష్టాలు వచ్చే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అసలు ‘అంటే సుందరానికీ’ బుకింగ్స్ ఇంత డల్ గా ఉండడానికి కారణం ఏంటి? అనే అంశం పై ఇప్పుడు చర్చలు జోరందుకున్నాయి. ఈ సినిమా టికెట్ ధరలు పెద్ద సినిమాల మాదిరిగానే ఉన్నాయి. వాటిని తగ్గించే ప్రయత్నం నిర్మాతలు చేయలేదు. దీనికి తోడు థియేటర్స్ లో ‘విక్రమ్’ ‘మేజర్’ల హవా ఇంకా తగ్గలేదు. ఈ మధ్య కాలంలో ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ నుండి వచ్చిన సినిమాలన్నీ 3 వారాలకే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. కాబట్టి ‘అంటే సుందరానికి’ కూడా 3 వారాలకే ఓటీటీకి వచ్చేస్తుంది అని అంతా అనుకుంటున్నారు. ఈ కారణాల వల్లే బుకింగ్స్ డల్ గా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.