Actor Bernard Passes Away : లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సీనియర్ నటుడు ఇక లేరు

Actor Bernard Passes Away : టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్ నటుడు బెర్నార్డ్ హిల్ ఇకలేరు. 79 ఏళ్ల బెర్నార్డ్ మృతితో హాలీవుడ్ లో విషాదం నెలకొంది. మే 5న తెల్లవారుజామున ఆయన అనారోగ్యంతో మరణించినట్లు బెర్నార్డ్ ఏజెంట్ లౌ కోల్సన్ తెలియజేశారు.

ప్రముఖుల నుంచి సంతాపం

లెజెండరీ నటుడు బెర్నార్డ్ మృతికి BBC డ్రామా డైరెక్టర్ లిండ్సే సాల్ట్ నివాళులర్పించారు. BBC Oneలో తన కొత్త టీవీ షో ప్రీమియర్‌కి కొన్ని గంటల ముందే బెర్నార్డ్ మరణించడం విషాదాకారం. అలాగే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ స్టార్ డొమినిక్ మోనాఘన్ కూడా సంతాపం తెలియజేశారు. చాలా మంది సెలబ్రిటీలు, బెర్నార్డ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు. టైటానిక్‌లో బెర్నార్డ్ తో కలిసి నటించిన బార్బరా డిక్సన్ కూడా ట్విట్టర్ లో ఆయనతో కలిసి నటించిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకాదరణను దక్కించుకున్న సినిమా టైటానిక్. 1997లో విడుదలైన ఈ చిత్రానికి జేమ్స్ కెమరూన్ దర్శకత్వం వహించారు. యదార్థ కథ ఆధారంగా ఎంతో గొప్పగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికీ చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో టైటానిక్ కెప్టెన్ పాత్రలో నటించిన బెర్నార్డ్ హిల్ అనారోగ్యంతో మృతి చెందడం మూవీ లవర్స్ ను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

- Advertisement -

బెర్నార్డ్ మూవీ ఎంట్రీ

మాంచెస్టర్‌లో జన్మించిన బెర్నార్డ్ హిల్ నటనపై ఉన్న మక్కువ కారణంగా చిన్నప్పటి నుంచే నటించడం నేర్చుకున్నాడు. ది బ్లాక్ స్టఫ్ అనే టెలివిజన్ షోతో బుల్లితెర అభిమానులకు పరిచయం అయిన ఆయన ఆ తరువాత అనేక టీవి కార్యక్రమాలు, నాటకాలలో కనిపించాడు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో సిల్వర్ స్క్రీన్ పై నటుడిగా దూసుకెళ్లాడు. అలాంటి సమయంలోనే టైటానిక్‌లో నటించే అవకాశం వచ్చింది.

కెప్టెన్ గా బెర్నార్డ్ హిల్

1912 సంవత్సరంలో మునిగిపోయిన టైటానిక్ నిజమైన కథ ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిన మూవీకి డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ప్రేమ అనే అంశాన్ని మిళితం చేసి అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఆస్కార్‌లో 14 విభాగాల్లో నామినేట్ అయ్యింది. 11 ఆస్కార్‌లను గెలుచుకుంది.

టైటానిక్ లో హీరోగా నటించిన డికాప్రియో, కీత్ విన్ స్లెట్ లతో పాటు టైటానిక్ కెప్టెన్ ఎడ్వర్డ్ జాన్ స్మిత్ పాత్రలో నటించిన బెర్నార్డ్ హిల్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమా ద్వారా బెర్నార్డ్ హిల్ మరింత ఫేమస్ అయ్యాడు.

బెర్నార్డ్ లాస్ట్ మూవీ

మెగా హిట్ టైటానిక్ తర్వాత బెర్నార్డ్ హిల్ బిజీ నటుడిగా మారాడు. ది స్కార్పియన్ కింగ్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, వింబుల్డన్, నార్త్ vs సౌత్ వంటి అనేక చిత్రాలలో తన అద్భుతమైన నటనను కనబరిచాడు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ త్రయంలో కింగ్ థియోడెన్ పాత్రలో బెర్నార్డ్ కనబరిచిన నటనకు ప్రశంసల వర్షం కురిసింది. ఆయన చివరి చిత్రం ఫరెవర్ యంగ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు