Parenting Tips : ఫోన్ చూపిస్తూ పిల్లలకు తిన్పిస్తున్నారా? ఎంత డేంజరో తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు

Parenting Tips : నేటి ఆధునిక యుగంలో ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లలకు ఆహారాన్ని తిన్పించడం అనేది పెద్ద తలనొప్పిగా మారింది. వాళ్ళ అల్లరిని భరించలేక, కొంతమంది తల్లులకు అయితే అసలు తినిపించడం చేతకాక పిల్లల చేతులకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఫోన్లో కార్టూన్లు లేదా వీడియోల వంటివి పెట్టేసి, వాళ్ళు అందులో మునిగిపోగానే ఇటు చకచకా ఆహారం తినిపించేస్తున్నారు. అయితే ఆ సమయానికి అదొక అద్భుతమైన చిట్కా అనిపిస్తుంది. కానీ దీర్ఘకాలంలో ఈ అలవాటు పిల్లలకు చాలా హానికరంగా మారుతుంది.

ముఖ్యంగా పిల్లల స్క్రీన్ టైం పెరగడం వల్ల అది వారి మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మొబైల్ ఫోన్లకు బానిస కావడం వల్ల పిల్లల మానసిక ఎదుగుదల తగ్గిపోతుంది. ఆరోగ్య నిపుణుల సలహా ప్రకారం పిల్లలు ఫోన్ లేదా టీవీని రోజుకు 60 నిమిషాల కంటే ఎక్కువగా చూడకూడదు. మరి ఈ నేపథ్యంలో అసలు పిల్లలు తినేటప్పుడు మొబైల్ ఫోన్లను చూడడం వల్ల వారి మెదడుతో పాటు శారీరకంగా, మానసికంగా జరిగే మార్పులు ఏంటి? ఇది వాళ్లపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అనే ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

1. అడిక్షన్

చిన్న వయసులోనే పిల్లలకు ఫోన్లు ఇవ్వడం వల్ల వాళ్లు అతి తక్కువ సమయంలోనే మొబైల్ ఫోన్ లకు బానిసలుగా మారతారు. ఆ తర్వాత ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా గడపలేరు. దీనివల్ల కళ్లపై తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుంది. అలాగే సోషల్ ఇంటరాక్షన్ వంటి అంశాలకు వీళ్ళు దూరమైపోతారు. ఫలితంగా పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఎవ్వరితో కలవలేరు.

- Advertisement -

2. ఎక్కువగా లేదా తక్కువగా తినడం

తినేటప్పుడు పిల్లల చేతిలో మొబైల్ ఫోన్లు ఉండడం వల్ల వాళ్లకు ఎంత తినాలి అనే విషయం తెలియకుండా పోతుంది. ఫోకస్ అంతా మొబైల్ ఫోన్ పైనే ఉండడం వల్ల ఎక్కువగా తినడం లేదా తక్కువగా తినడం వంటివి చేస్తారు. ఇది పిల్లల ఆరోగ్యానికి హానికరం.

3. ఆహారం రుచిని ఆస్వాదించలేరు

తినేటప్పుడు చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే పిల్లల దృష్టి మొత్తం దానిపైనే ఉంటుంది. దానివల్ల ఎంత తింటున్నాం ఏం తింటున్నాం అనేది మాత్రమే కాదు ఆహారం రుచి ఎలా ఉంటుందో కూడా వాళ్లకు తెలియకుండా పోతుంది. దానివల్ల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను డెవలప్ చేసుకోవడం అనేది వాళ్లకు కష్టతరంగా మారుతుంది. మారుతుంది అనడం కన్నా మనమే మార్చేస్తున్నాం అని చెప్పొచ్చు.

4. కుటుంబంతో కూడా సమస్యే

ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు భోజనం చేసే సమయంలో ఇంటిల్లిపాది కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుతూ, భోజనం రుచిని ఆస్వాదిస్తూ తినేవాళ్లు. దీనివల్ల బంధాలు మరింత బలోపేతం అయ్యేవి. కానీ ప్రస్తుత తరం ఇలా ఉమ్మడి కుటుంబాలకు దూరంగా అయిపోవడం వల్ల పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇక పిల్లల చేతికి మొబైల్ ఫోన్లను ఇవ్వడం వల్ల వాళ్లు కుటుంబంతో కలిసి మాట్లాడరు. దీనివల్ల వాళ్ళ ఎమోషనల్ డెవలప్మెంట్ పై తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుంది. మరి ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి పిల్లలను బయట పడేయాలంటే.. పిల్లలను మొబైల్ ఫోన్ కు దూరంగా ఉంచండి. ముఖ్యంగా భోజనం చేస్తున్నప్పుడు. కుటుంబం అంతా ఒకే దగ్గర కలిసి కూర్చుని మాట్లాడుతూ తినండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు