Mental health: మీ పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? ఇలా తెలుసుకోండి

నేటి కాలంలో ఒత్తిడి అనేది చాలా సాధారణ సమస్య. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో ఒత్తిడికి గురవుతాము. ప్రస్తుత కాలంలో ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. ఇటీవల కాలంలో చిన్న పిల్లలు కూడా ఒత్తిడికి లోనవుతున్నారు. నేటితరం చిన్నపిల్లలు అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురి కావడం, తమకు సంబంధించిన విషయాలను ఎవరితోనైనా పంచుకోవడానికి భయపడడం సహజమే. కానీ పిల్లల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటే దానివల్ల వారి మానసిక, శారీరక అభివృద్ధిపై తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లల్లో ఒత్తిడి అనేది ప్రమాదకరం కూడా కావచ్చు. అందుకే పిల్లల్లో ఒత్తిడి లక్షణాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. అప్పుడే సకాలంలో వారి ఒత్తిడిని తగ్గించే జాగ్రత్తలు తీసుకోగలం. మరి పిల్లలలో ఒత్తిడి లక్షణాలను ఎలా గుర్తించాలి అంటే…

పిల్లల్లో చిరాకు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ వాళ్లు చిన్నపిల్లలు కావడంతో ఆ విషయాన్ని త్వరగా మర్చిపోయి మళ్ళీ మామూలు అయిపోతారు. అంతేగాని చాలా సేపు టెన్షన్ గా ఉండి చిన్న చిన్న విషయాలకే చిరాకు పడితే పిల్లలతో ఓపెన్ గా మాట్లాడడానికి ప్రయత్నించండి. వాళ్లు చిరాకు పడడానికి గల కారణం ఏంటో తెలుసుకోండి. అప్పుడు వాళ్లు ఏదైనా ఒత్తిడిలో ఉన్నారా అనే విషయం అర్థం అవుతుంది.

పిల్లల్లో దూకుడు స్వభావం మునపటి కంటే ఎక్కువగా కనిపిస్తే అది వాళ్లలో ఉన్న ఒత్తిడికి కారణం కావచ్చు. పిల్లలు ప్రతి సమస్యకు కోపగించుకున్నా, లేదో అనవసరంగా కోపంతో విరుచుకుపడినా వాళ్లతో బహిరంగంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. అలాగే తల్లిదండ్రులు వాళ్లతో కోపంగా ఉండకుండా వాళ్లు చెప్పేది ప్రశాంతంగా వినడానికి ట్రై చేయాలి.

- Advertisement -

మీ పిల్లల్లో ఏకాగ్రత తగ్గినట్టుగా అనిపిస్తోందా? వాళ్లు మునుపటి కంటే ఏదైనా వినడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టుగా అనిపిస్తోందా? ఇవి కూడా వాళ్లు ఒత్తిడికి గురవుతున్నారు అని తెలిపే లక్షణాలే.

మీ పిల్లలు అకస్మాత్తుగా సైలెంట్ అయిపోయి, టెన్షన్ గా, ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేస్తే, వాళ్లు ఏదో ఒక విషయంలో బాధపడుతున్నారని అర్థం చేసుకోండి. అలాంటి పరిస్థితిలో వెంటనే వాళ్లను ప్రేమతో దగ్గరకు తీసుకొని, మాట్లాడి వాళ్లు బాధపడడానికి గల కారణం ఏంటో తెలుసుకోండి.

మీ పిల్లలు సాధారణంగా కంటే ఎక్కువ లేదా తక్కువ నిద్రపోవడం లాంటివి చేస్తే అది కూడా పిల్లల్లో ఒత్తిడికి ఒక లక్షణం కావచ్చు.

ఇక పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు అని తెలిపే మరో లక్షణం ఆకలి. చాలామంది పిల్లలు ఒత్తిడి కారణంగా పూర్తిగా తినడం మానేస్తారు. కానీ కొంతమంది మాత్రం ఒత్తిడిలో ఎక్కువగా తినేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లు తినే విషయంలో ఏవైనా మార్పులు కనిపిస్తే జాగ్రత్తపడండి.

ఇవి మాత్రమే కాకుండా పిల్లల్లో మానసిక ఒత్తిడికి సంబంధించిన లక్షణాల్లో తలనొప్పి, కడుపునొప్పి వంటి శారీరక లక్షణాలు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే మీరు మానసిక వైద్యుడిని సంప్రదించవచ్చు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు