Saripodhaa Sanivaaram Movie Review : వివేక్ ఆత్రేయ అంటే ఫీల్ గుడ్ సినిమాలకు కేరాఫ్ ఆడ్రస్. ఆయన నుంచి వచ్చిన మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి లాంటి సినిమాలు కమర్షియల్‌గా పెద్ద హిట్ కాకపోయినా, ఆడియన్స్ గుండెల్ని టచ్ చేశాయని ఎవరైన చెప్తారు. అలాంటి డైరెక్టర్ ఫస్ట్ టైం ఓ యాక్షన్ సినిమా చేశాడు. అది కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు చేసే న్యాచురల్ స్టార్ నానితో. ఈ కాంబోలో వచ్చిన రెండో మూవీ ఈ సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఓ రకమైన హైప్ క్రియేట్ అయిన ఈ సినిమా ఈ రోజు థియేటర్‌లోకి వచ్చింది. మరి ఈ సినిమా వివేక్ ఆత్రేయకు కమర్షియల్ హిట్ ఇచ్చిందా..? నానికి ఈ ఏడాదిలో రెండో హిట్ దొరికిందా..? లేదా అనేది ఈ రివ్యూలో చూద్ధాం…
కథ :
సూర్య (నాని) చిన్నప్పటి నుంచే విపరీతమైన కోపంతో ఉంటాడు. ప్రతీ రోజు కోపం కాకుండా వారంలో ఒక్క రోజు మాత్రమే కోపం చూపించాలని, ఆ రోజు తాను ఏమీ అనను అని సూర్యకి వాళ్ల అమ్మ చెప్పి చనిపోతుంది. అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం.. సూర్య తన కోపాన్ని ప్రతీ శనివారం చూపిస్తాడు. అలాంటి సూర్య తన కోపాన్ని ఇన్‌స్పెక్టర్ దయపైకి ఎందుకు చూపించాడు..? అందుకు గల కారణాలెంటి..? దయ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉన్న చారులత (ప్రియాంక మోహన్) కి సూర్యకు మధ్య ప్రేమ ఎలా పుట్టింది..? వాళ్ల పాస్ట్ ఏంటి..? సోకులపాలెం గ్రామస్థులపై ఇన్‌స్పెక్టర్ దయకు ఎందుకు కోపం ఉంటుంది..? అనేవి తెలుసుకోవాలంటే..ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
ఫ్యామిలీని కనెక్ట్ చేసేలా ఫీల్ గుడ్ సినిమాలు చేసే డైరెక్టర్స్‌లో సుకుమార్ (Sukumar), త్రివిక్రమ్ (Trivikram) పేర్లు చెప్పుకుంటాం. వీళ్లు తమ జానర్‌ను వదిలి యాక్షన్ జానర్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వివేక్ ఆత్రేయ కూడా తన జానర్‌ను వదిలి యాక్షన్ జానర్‌కి షిఫ్ట్ అయ్యాడు. మరి సుక్కు, గూరిజీలా వివేక్ సక్సెస్ అయ్యాడా..? అంటే ఒక్క మాటలో కాస్త తడబడుతూ సక్సెస్ అయినట్టే అని చెప్పొచ్చు.
సినిమా స్టోరీ కొత్తదేమీ కాదు… అమాయకులు ఉండే ఓ ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ఓ విలన్ ఇబ్బంది పెట్టడం, ఆ అమాయక ప్రజలను హీరో ధైర్యవంతులను చేసి, విలన్ పై తిరుగబడేలా చేస్తాడు. ఈ లైన్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఎవరి స్క్రిన్ ప్లే వారిది. ఇక్కడ వివేక్ ఆత్రేయ ఈ స్టోరీ లైన్‌కి కోపం, శనివారం, అమ్మ మాట, అక్క కోసం అంటూ కొన్ని యాడ్ చేసి తన స్టైల్‌లో స్క్రీన్ ప్లే రాసుకున్నాడు.
అయితే ఈ స్క్రిన్ ప్లే విషయానికి వస్తే, ఫస్టాఫ్ చాలా బాగా రాసుకున్నాడు. కానీ, సెకండాఫ్‌లో మొత్తం తేలిపోయాడు. స్టోరీలో కీలకంగా ఎమోషన్స్ ని సరిగ్గా పండించలేకపోయాడు. ఉదాహారణకు… 20 ఏళ్ల తర్వాత అత్తను హీరో కలిసే సీన్ ఉంటుంది. అక్కడ నార్మల్ సీన్ లానే అనిపిస్తుంది. అక్కడ కావాల్సినంత ఎమోషన్‌ని పండించొచ్చు. అలాగే, అక్క గర్భవతి అయి.. హస్పిటల్‌లో ఉన్న టైంలో హీరోకి విలన్ కాల్ చేస్తాడు. అక్కడ కూడా అక్క రియాక్షన్‌లో ఎమోషన్ మిస్ అయింది. సెకండాఫ్‌ని క్లైమాక్స్ వరకు తీసుకెళ్లాలి.. హీరో – విలన్ మధ్య ఫైట్ పెట్టేయ్యాలి అని కథను అటు ఇటు తీసుకెళ్లాడని అర్థమవుతుంది.
ఫస్టాఫ్ మొత్తం కాస్త కామెడీగా గ్రిప్పింగ్ స్క్రిన్ ప్లేతో కానిచ్చేశాడు. ఇంటర్వేల్ సీన్‌తో సెకండాఫ్ చూస్తే పోతారు.. మొత్తం పోతారు అనే హైప్ ఇస్తూ ఫస్టాఫ్ వరకు మంచి మార్కులు వేసుకున్నాడు. కానీ, సెకండాఫ్ వచ్చే సరికి సినిమా మొత్తం సైడ్ ట్రాక్ అయిపోయింది. ఫస్టాఫ్ లో ఎంటర్‌టైన్ అయిన ఆడియన్.. సెకండాఫ్ కి వచ్చే సరికి ఎక్కడో ఏది మిస్ అయింది.. ఏదో ఎక్కువ అయింది అనే ఫీల్ వస్తుంది.
ఇక సినిమాలో లాజికల్‌గా కొన్ని మైనస్‌లు ఉన్నాయి. కార్పొరేటర్‌కి నలుగురు గన్‌మెన్స్ ఉండటం ఏంటో అర్థం కాదు. ఆ కార్పొరేటర్‌కి ఓ ఎమ్మెల్యేకి ఉన్న అంత సెక్యూరిటీ ఎందుకు ? అలాగే ఆ కార్పొరేటర్ ని హత్య చేసిన టైంలో పెద్ద హడావుడి కనిపించదు. అలాగే కార్పొరేటర్ గా చేసిన మురళి శర్మ పాత్రను సరిగ్గా క్లోజ్ చెయ్యలేకపోయాడు. మొత్తంగా సెకండాఫ్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వచ్చేది.
ఇక ఫర్మామెన్స్ విషయానికి వస్తే.. సినిమాలో నాని (Nani) కంటే ఎక్కువ ఎస్ జే సూర్య (SJ Suryah) కనిపిస్తాడు. విలనిజం పండిస్తూనే థియేటర్స్ లో ఉన్న ఆడియన్స్ ను నవ్విస్తాడు. ఈ మధ్య కాలంలో ఎస్‌జే సూర్య చేసిన ప్రతీ పాత్ర తెలుగు ఆడియన్స్‌కి బాగా నచ్చుతుంది. ఆ లిస్ట్ లో సరిపోదా శనివారం కూడా చేరిపోతుంది. ఇక నాని ఫర్మామెన్స్ ఒక ఎక్స్‌ప్రేషన్‌కే స్ట్రక్ అయ్యాడా అనిపిస్తుంది. పైగా నానిని ఇలాంటి లుక్స్, ఇలాంటి ఫర్మామెన్స్ చాలా సినిమాల్లో చూశాం. కొత్త కాన్సెప్ట్ కాబట్టి, నాని నుంచి ఆడియన్స్ కొత్తగా ఎక్స్ పెక్ట్ చేయలేం. ప్రియాంక మోహన్ పర్లేదు. మురళి శర్మ తన స్థాయికి మేర నటించాడు. కొన్ని సీన్లలో ఆయన కూడా నవ్వించాడు.
ఇక జేక్స్ బిజోయ్ బ్యాగ్రౌండ్ స్కోరు గురించి కూడా చెప్పుకోవాలి. యాక్షన్ సీన్స్ టైంలో బిజోయ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లస్ అయింది. ఎడిటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సినిమాను 10 నుంచి 20 నిమిషాల వరకు ట్రిమ్ చేసే స్కోప్ ఉంది. నిర్మాణ విలువలు పర్లేదు.
ప్లస్ పాయింట్స్ :
నాని, ఎస్‌జే సూర్య
ఫస్టాఫ్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
స్టోరీ
మైనస్ పాయింట్స్ :
ల్యాగ్ సీన్స్
సెకండాఫ్ సైడ్ ట్రాక్ అవ్వడం
మొత్తంగా… నానికి ఈ వారం సరిపోలేదు.. ఎస్‌జే సూర్యకు సరిపోయింది.