Johnny Master Case.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ (Johnny Master) మెగాస్టార్ చిరంజీవిని మొదలుకొని రామ్ చరణ్ వరకు చాలామంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన విషయం తెలిసిందే. ఎంతో మంది స్టార్ హీరోలతో మంచి సత్సంబంధాలు ఉన్న ఈయనపై తాజాగా కేసు నమోదవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక యువతి పై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ కేస్ ఫైల్ అవ్వడం ఒక్కసారిగా ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసిందని చెప్పవచ్చు.
జానీ మాస్టర్ పై కేస్ ఫైల్..
సదరు యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు కింద కేసు ఫైల్ చేయించగా.. ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఈ ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో నిన్న అనగా సెప్టెంబర్ 15 మధ్యాహ్నం సమయంలో ఈ కేసును రాయదుర్గం పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. అయితే ప్రస్తుతం ఈ విషయంపై సదరు యువతి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జానీ మాస్టర్ ను విచారణ చేపడతాం అంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ సిఐ హరికృష్ణ రెడ్డి వెల్లడించారు.
జానీ మాస్టర్ పై జనసేన అధిష్టానం కీలక నిర్ణయం..
ఇదిలా ఉండగా ఇంత తంతు జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ జానీ మాస్టర్ కు ఊహించని షాక్ ఇచ్చింది.అసలు విషయంలోకెళితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేయగా.. ఈ క్రమంలోనే జనసేన అధిష్టానం జానీ మాస్టర్ పై కీలక నిర్ణయం తీసుకుంది.
జానీ మాస్టర్ ను సస్పెండ్ చేసిన జనసేన..
జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఒక ప్రకటనలో ఆదేశించింది. లైంగిక వేధింపులకు సంబంధించి కేసు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనసేన పార్టీ స్పష్టం చేసింది. అంతే కాదు ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి అయితే సదరు యువతి ఇచ్చిన షాక్ నుంచి తేరుకోక ముందే జనసేన పార్టీ కూడా ఈయనను సస్పెండ్ చేసింది అంటే ఈయన తప్పు చేశారని పార్టీ కూడా నమ్ముతుందని చెప్పవచ్చు. ఇక సదరు యువతి ఇచ్చిన స్టేట్మెంట్ ను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు నిజా నిజాలు తేలితే జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని నార్సింగ్ పోలీస్ స్టేషన్ సిఐ హరికృష్ణ రెడ్డి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
మహిళా కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ అత్యాచారం..
మధ్యప్రదేశ్ కు చెందిన మహిళ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ విచక్షణ రహితంగా అత్యాచారానికి గురి చేశారట. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో తనపై జరిగిన అత్యాచారానికి సంబంధించిన పలు విషయాలను పోలీసులకు సదరు యువతి వెల్లడించింది. అంతేకాదు షూటింగ్ సమయాలలో తనకు సహకరించకపోతే తనను విచక్షణారహితంగా హింసించాడని తనపై దాడి కూడా చేశాడని చెప్పుకొచ్చింది ఆ యువతి. ప్రస్తుతం యువతి ఇచ్చిన కంప్లైంట్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు.