మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత, చేస్తున్న సినిమాలకు ఇతర హీరోల సాయం తీసుకుంటున్నారు. ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, నిర్మాత పెట్టె బడ్జెట్ ను రికవరీ చేయాలి అంటే చిరుకు సరిపోయే కాంబినేషన్ ను సెట్ చేయాలని భావిస్తున్నారు. కమ్ బ్యాక్ తర్వాత మెగాస్టార్ చేసిన సినిమాలను చూస్తే, ఇది అర్థమవుతుంది.
ఇప్పటికే విడుదల అయిన ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ సెకండ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఆ కథ మొత్తం చరణ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇక చిరు చేయబోతున్న తర్వాత సినిమాల విషయానికి వస్తే, బాబీ దర్శకత్వంలో వస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ లో రవితేజ, మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు.
వీటితో పాటు తాజా గా మరో వార్త ఫిల్మ్ నగర్ లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న ‘భోళా శంకర్’ చిత్రంలో ఓ యంగ్ హీరో నటించబోతున్నాడని, ఆ పాత్రలో యంగ్ హీరో, పవర్ స్టార్ అభిమాని నితిన్ ను చిరు ఎంపిక చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.
ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రకు భర్త గా నితిన్ నటిస్తున్నట్టు సమాచారం. అంతే కాకుండా, జూలై నెలలో నితిన్ సెట్స్ పైకి వెళ్తున్నాడని టాక్. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కాగ ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాలం’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.