ఒక సినిమా చేయడానికి అద్భుతమైన కథాంశం ఉండి,
షూటింగ్ కూడా సజావుగానే జరిగిపోయి
సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఆటంకాలు ఎదురైతే ఆ చిత్ర యూనిట్ కి ఉండే ఒత్తిడి వర్ణాతీతం అనే చెప్పాలి.
ఒకప్పుడు ఇదే అనుభవాన్ని చూసింది విరాటపర్వం మూవీ టీం.
ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఎన్నో వాయిదాల పడుతూ వచ్చింది, నేరుగా ఓటిటిలో రిలీజ్ అవుతుంది అనే వార్తలు కూడా అప్పట్లో చక్కెర్లు కొట్టాయి. ఇటువంటి వార్తలు అన్నింటికి చెక్ పెడుతూ, ఎట్టకేలకు ఈ సినిమా జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
లక్డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఒకేసారి ఏకరువు పెట్టాయి, కొన్ని సినిమాలకు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. కొన్ని సినిమాలు మాత్రం ఊహించని డిజాస్టర్స్ అయ్యాయి. ఏది ఏమైనా ఇప్పుడు “విరాటపర్వం” మాత్రమే ఇంకా రిలీజ్ కి మిగిలుంది. ఆలస్యం అమృతం అని చెప్పినట్లు ఈ సినిమా లేట్ అవ్వడం కూడా కొంతమేరకు ఈ సినిమాకు కలిసొస్తుంది అని చెప్పొచ్చు. సత్యదేవ్ “గాడ్సే” మినహా ఈ సినిమాకు గట్టి పోటీ ఇచ్చే సినిమా లేదు. జులై 1 వరకు పెద్ద సినిమాలు కూడా లేవు.
ఈ సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా, మంచి కలక్షన్స్ వస్తాయి.
1990 ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోని నక్సల్ మూమెంట్ ఆధారంగా చేసుకుని, “నీదీ నాదీ ఒకే కథ” డైరెక్టర్ వేణు ఉడుగుల ఈ మూవీని తెరకెక్కించారు. రానా దగ్గుబాటి హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించారు. అలాగే కీలక పాత్రల్లో ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్, నివేదా పేతురాజ్ కనిపించబోతున్నారు.