బుల్లితెర పై నంబర్ వన్ యాంకర్ గా రాణిస్తూ బిజీగా ఉంటూ వస్తోంది సుమ. గతంలో వెండితెర పై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ యాంకర్. ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ ‘వర్షం’ ‘బాద్ షా’ లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. కానీ ఆ సినిమాలు ఈమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టినవి కావు. ఈ క్రమంలో ఆమె బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకోగా, సూపర్ సక్సెస్ అందుకుంది. అయితే కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరకు ‘జయమ్మ పంచాయతీ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. విజయ్ కుమార్ కలివరపు ఈ చిత్రానికి దర్శకుడు. మే 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమ నటించింది కాబట్టి మొదటి నుండి ఈ సినిమాకు ఓటీటీ నుండి ఆఫర్లు బాగానే వచ్చాయి. కానీ, సుమ, దర్శకుడు పట్టుబట్టి ఈ సినిమాను థియేటర్ లోకి తీసుకువచ్చారు. రిలీజ్ కు ముందు భారీగా ప్రమోషన్లు చేయించారు. పవన్ కళ్యాణ్, రానా, నాగార్జున, నాని లాంటి స్టార్ హీరోలతో ప్రమోషన్స్ చేయించారు.
సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఓటీటీలో విడుదలైనా వీక్షణలు కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదని తెలుస్తుంది. దీంతో సుమ ఇక సినిమాల జోలికి పోకూడదు అని నిర్ణయించుకున్నట్టు సమాచారం. నిజానికి సుమ సినిమాల్లో కొనసాగాలని అనుకుంది. అందుకే జయమ్మ పంచాయితీకి భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, తమ పనులు తాము చేసుకుంటున్నారు కాబట్టి ఈ టైంలో మళ్ళీ సినిమాలు చేయాలి అనేది ఆమె ఉద్దేశం. కానీ ఫలితం ఆశాజనకంగా రాలేదు కాబట్టి.. ఆమె సినిమాలకి గుడ్ బై చెప్పినట్టే అనేది ఇన్సైడ్ టాక్.