యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనడం కంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనడం కరెక్ట్. ఎందుకంటే, దర్శకధీరుడు జక్కన్నతో వచ్చిన “బాహుబలి” సిరీస్ తో ప్రభాస్ ఇమేజ్ ఒక్క సారిగా పెరిగింది. తెలుగు ఇండస్ట్రీ దిశ దశనే మారిపోయింది. సినీ ప్రపంచనికి టాలీవుడ్ సత్తా తెలిసింది. దీని వల్ల ప్రభాస్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల నుండి హిందీ బెల్ట్ రాష్ట్రాల వరకు పెరిగింది. ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ వచ్చి చేరింది.
ప్రస్తుతం ఈ క్రేజ్ ప్రమాదంలో పడింది. “బాహుబలి” సినిమా తర్వాత ప్రభాస్ నటించిన “సాహో” “రాధేశ్యామ్” సినిమాలు దారుణంగా నిరాశపర్చాయి. “సాహో” హిందీ ప్రేక్షకులను కొంత మేరకు అయినా ఆకట్టుకుంది. కానీ, “రాధేశ్యామ్” మాత్రం డిజాస్టార్ గా మిగిలింది. ఈ రెండు సినిమాలు ప్రభాస్ ఇమేజ్ కే కాదు, నిర్మాతలకూ పెద్ద నష్టాలు తెచ్చింది. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన “రాధేశ్యామ్”, థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి 200 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఇలాంటి అనుభవాల తర్వాత ప్రభాస్ మారాడా అంటే, అది లేదు. భారీ బడ్జెట్ సినిమాలనే లైనప్ చేస్తున్నాడు.
రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్”. బాలీవుడ్ డైరెక్టర్ ఓ రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు. అయితే, పౌరాణిక నేపథ్యంలో వచ్చే సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారా ? ఆదిరించినా, మరీ 500 కోట్లకు పైగా కలెక్షన్లు వస్తాయా ? అనే అనుమానాలు నిర్మాతలకు ఉన్నాయి. అలాగే సంక్రాంతికి రిలీజ్ రాబోయే ఈ సినిమా, ఇప్పటి వరకు ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయలేదు. ఇది పెద్ద మైనస్.
“కేజీఎఫ్ 2” తర్వాత ప్రశాంత్ నీల్ “సలార్” చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమాను 250 కోట్ల బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ బరువు పెద్ద సమస్యగా ఉందట. కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ లావుగా, మరి కొన్ని సన్నివేశాల్లో స్లిమ్ గా కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. వీటిని ప్రేక్షకులు అంగీకరిస్తారా అనే డౌట్ మేకర్స్ లో ఉందని తెలుస్తోంది. పైగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం కాబట్టి, కేజీఎఫ్ కంటే బెటర్ అవుట్ పుట్ ను ప్రేక్షకులు అంచన వేస్తున్నారు. ఈ అంచనాలతో సినిమా లేకున్నా, ఫ్యాన్స్ కు నిరాశే దక్కుతుంది.
వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “ప్రాజెక్ట్ కే” సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఇది కూడా పాన్ ఇండియా సినిమా కావడంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపకా పదుకుణె ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సినిమాను దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. అయితే, ప్రభాస్ ఇమేజ్ గురించి మేకర్స్ తెగ టెన్షన్ పడుతున్నారట. ఈ సినిమా కూడా సాహో, రాధేశ్యామ్ లాంటి రిజల్ట్ వస్తే తామ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నట్టు ఇన్సైడ్ టాక్.
భారీ బడ్జెట్ సినిమాలను లైనప్ చేసుకున్న ప్రభాస్ కూడా గత సినిమాల అనుభావాలు వెంటాడుతున్నాయి. డార్లింగ్ బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల, హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో కొంత మేరకు మార్కెట్ పెరిగింది. కానీ తెలుగులో మాత్రం దెబ్బతిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ మూడు సినిమాలు లాభాల బాటపడుతాయా ? లేదా, “సాహో” “రాధేశ్యామ్” లాగే నిరాశపరుస్తాయా ? అంటే ఈ మూడు సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.