The India House : చెర్రీ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడా?

The India House : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తో కలిసి మెగా పవర్ స్టార్ రాంచరణ్ క్రేజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. “ది ఇండియా హౌస్” అనే టైటిల్ తో ఆ మూవీని తెరకెక్కించబోతున్నట్టుగా ప్రకటించి, ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇప్పటిదాకా ఈ మూవీకి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా బయటకు రాలేదు. మరి ఇంతకీ ఈ మూవీ ఉన్నట్టా? లేదా అటకెక్కినట్టా? ఆ జానర్లో వస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్న తరుణంలో చెర్రీ ఇంకా ఈ మూవీతో రిస్క్ చేయాలనుకుంటున్నారా? అంటే…

రిస్కీ జానర్…

తక్కువ బడ్జెట్ తో మూవీస్ ను చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడానికి అన్నట్టుగా ఇటీవల కాలంలో మూవీ మేకర్స్ ఒక గోల్డెన్ ఫార్ములాను కనిపెట్టారు. హిందూ ఫోకస్డ్ థీమ్ తో ఇండియన్స్ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ముస్లిమ్స్ ను వ్యతిరేకంగా చిత్రీకరించి, ప్రభుత్వం ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ జానర్ సినిమాలు వివాదాన్ని రేకెత్తించినప్పటికీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కాకుండా ఎవ్వరూ ఆపలేకపోయారు. ది కాశ్మీరీ ఫైల్స్, ది కేరళ స్టోరీ సినిమాలు సాధించిన విజయమే అందుకు నిదర్శనం. కానీ ఇటీవల కాలంలో ఈ జానర్ జనాలకు బోర్ కొట్టిందో ఏమో తెలియదు గానీ వరుసగా సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. ది వ్యాక్సిన్ వార్, హిందుత్వ, అజ్మీర్ 92, 72 హూర్, తేజస్ వంటి సినిమాలు ఇదే జానర్ లో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా పరాజయాన్ని చవిచూశాయి. ఆ సినిమాలు వచ్చిన కొన్ని రోజుల్లోనే బస్తర్, రజాకార్, స్వాతంత్ర వీర్ సావర్కర్ అనే సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఈ సినిమాలు పూర్తిగా నిరాదరణకు గురయ్యాయి. ఇక ఇదే జానర్లో “ది ఇండియా హౌస్” మూవీని నిర్మించే ప్రయత్నం చేశారు చెర్రీ. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఇది రిస్కీ అని అనిపిస్తోంది. మరి చెర్రీ రిస్క్ తీసుకుంటాడా? అంటే అంతకంటే ముందు అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేక అటకెక్కిందా అనేది తెలియాలి.

ఏడాది కావస్తున్నా వీడని సైలెన్స్…

2023లో నిఖిల్ హీరోగా “ది ఇండియా హౌస్” అనే మూవీని అనౌన్స్ చేశారు. అభిషేక్ అగర్వాల్, రామ్ చరణ్, విక్రమ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. రామ్ వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందాల్సిన ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వీడియోను 2023 మేలో రిలీజ్ చేశారు. ఆ ప్రీ విజువలైజేషన్ వీడియో అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఆ తర్వాత కొత్త నటినటులు కావాలంటూ ఒక ఆడిషన్ నోటీస్ రిలీజ్ చేసి 8000 పైగా అప్లికేషన్స్ రాగా, అందులో నుంచి 500 మందిని ఎంపిక చేశారనీ వార్తలు వచ్చాయి. సావర్కర్ 14వ జయంతి సందర్భంగా ఈ మూవీని గ్రాండ్ గా అనౌన్స్ చేశాడు చెర్రీ. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని కూడా అన్నారు. విప్లవం ఈజ్ బ్రుయింగ్ అనే ట్యాగ్ లైన్ తో మరిచిపోయిన భారతీయ చరిత్రను వెలికి తీసే 95 సెకండ్ల నిడిపి ఉన్న టీజర్ ను రిలీజ్ చేశారు. కానీ గత కొన్ని నెలలుగా ఈ సినిమా ప్రోగ్రెస్ గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు. మరోవైపు నిఖిల్ స్వయంభు వంటి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి సినిమాలన్నీ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా మిగులుతున్న నేపథ్యంలో అసలు ది ఇండియా హౌస్ మూవీ తెరకెక్కుతోందా? లేదా ఆగిపోయిందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. మరి ఇంతకీ ఈ మూవీ విషయంలో ఏం జరుగుతుంది అనేది మేకర్స్ స్పందిస్తేనే గాని క్లారిటీ రాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు