సినిమా ఇండస్ట్రీలో హీరోలకు, డైరెక్టర్లకు సెంటిమెంట్స్ ఉండటం కామన్. ఆ సెంటిమెంట్ ను బేస్ చేసుకుని తమ సినిమాలను విడుదల చేయడం వెరీ కామన్. అలా రిలీజ్ చేసిన సినిమాలు హిట్ అవుతాయని వారి నమ్మకం. అగ్ర హీరోల నుండి, యంగ్ హీరోల వరకు ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ వస్తున్నారు. తాజాగా హీరో గోపీచంద్ కూడా దీన్నే ఫాలో అవుతున్నాడు.
ఈ మ్యాచో స్టార్ తాజాగా మారుతి దర్శకత్వంలో “పక్కా కమర్షియల్” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాశి ఖన్నా హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేష్, అనసూయ భరధ్వాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 1న థియేటర్ లల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే, మ్యాచో స్టార్ గోపీచంద్ సెంటిమెంట్ ప్రకారమే, ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేస్తున్నారని సమాచారం. నిజానికి గోపీచంద్ కు జూలై సెంటిమెంట్ కాస్త బలంగానే ఉంది. ఈ నెలలో విడుదల అయిన సినిమాలు దాదాపు అన్ని కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. పలు సినిమాల్లో విలన్ పాత్రల తర్వాత గోపీచంద్ 2004 జూలైలో “యజ్ఞం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా గోపీచంద్ కు విజయాన్ని అందించింది.
దీని తర్వాత 2007లో లౌక్యం, 2013లో సాహసం సినిమాలు ఈ నెలలోనే వచ్చి, గోపీచంద్ కు ఇండస్ట్రీ హిట్ ను ఇచ్చాయి. ఇలా మ్యాచో స్టార్ కు జూలై సెంటిమెంట్ బలంగా మారింది. అయితే, ఈ మధ్య కాలంలో ఈ సెంటిమెంట్ గోపీచంద్ కు పెద్దగా కలిసిరావడం లేదు. “గౌతమ్ నంద”, “పంతం” లాంటి సినిమాలు జూలైలోనే విడుదలైనా, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు జూలైలోనే విడుదల కాబోతున్న “పక్కా కమర్షియల్” ఎలాంటి రిజల్ట్ వస్తుందో అనే టెన్షన్ మాత్రం లేక పోలేదు.
అయితే, పక్కా కమర్షియల్ ట్రైలర్ ప్రకారం, సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ఆకట్టుకునేలా ఉంది. డైరెక్టర్ మారుతి మార్క్ కామెడీని ఈ సినిమాలో చేసే అవకాశాలు ఉన్నాయి. కామెడీకి తోడు గోపీచంద్ యాక్షన్ సన్నివేశాలు ప్లస్ గా మారితే, సినిమా మంచి విజయాన్ని నమోదు చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.