Ghantasala : సంగీతం నేర్చుకోడానికి భిక్షాటన చేసిన ఘంటసాల..

 

తెలుగు చిత్ర పరిశ్రమ తొలితరం మహా గాయకుడు సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ నలుమూలలా ఏ తెలుగువాడైనా ఈయన పాటో, మాటో ఇప్పటికి వింటూనే ఉంటారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ లోనే మహనీయులలో అగ్ర తాంబూలం స్వీకరించగలిగే మహనీయుడు “ఘంటసాల”. ఎక్కడో చోటపల్లి అనే మారుమూల కుగ్రామం నుంచి వచ్చిన ఈయన తెలుగు సంగీత సామ్రాజ్యానికి ఒక శిఖరంగా నిలిచారు. 1970 వరకూ కూడా ఈయన పాడని తెలుగు సినిమా ఉండేది కాదు. అలాంటి ఘంటసాల తన జీవితంలో సంగీతం నేర్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో వింటే ఏ తెలుగువాడు అయినా కన్నీళ్లు పెట్టుకుంటాడు.

అసలు ఘంటసాల చిన్నతనం నుండే సంగీతం నేర్చుకోవడానికి ఆసక్తి చూపినా, అవకాశాలు వచ్చేవి కాదు. తన తండ్రి సూర్య నారాయణ దేవాలయాల్లో మృదంగం వాయిస్తూ భజనలు చేసేవారు. అప్పుడు తన తండ్రితో పాటు దేవాలయాలకు వెళ్లి వాళ్ళు భజన చేస్తుంటే ఘంటసాల నాట్యం చేసేవాడు. అది చూసి భక్తులు ఘంటసాల ని ఎంతో మెచ్చుకునేవారు. అప్పుడే తండ్రి సూర్య నారాయణ కి తన కొడుకుని గొప్ప విధ్వంసుడిగా చూడాలనే కల ఏర్పడింది. అయితే అప్పటికే సూర్య నారాయణ ఆరోగ్యం క్షీణించడంతో ఘంటసాల కి సంగీతం గొప్పదనాన్ని చెప్తూ, ఎదో ఒకరోజు ఘంటసాల ని గొప్ప సంగీత విధ్వంసుడిని అవమాని కోరారు. అప్పుడే ఘంటసాల మనసులో ధృడ నిశ్చయం చేసుకున్నారు. అయితే తండ్రి చనిపోయాక వాళ్ళ కుటుంబ భారం సూర్య నారాయణ భార్య రత్నమ్మ తమ్ముడు పిచ్చయ్య చూసుకునే వాడు.

- Advertisement -

అయితే తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా, అక్కడి కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేశాడు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వులపాలయాడు. అప్పటినుండి ఆయనలో పట్టుదల పెరిగింది. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళల్లో పనిచేస్తూ సంగీతం నేర్చుకోవడానికి నిశ్చయించుకున్నాడు. ఆర్థిక పరిస్థితుల వల్ల రెండేళ్ళ పాటు ఒక ఇంట్లో బట్టలు ఉతకడం, మరొక ఇంట్లో వంట చేయాల్సి వచ్చింది. అప్పటికి సంగీతం సాధన పై సరైన దృష్టి పెట్టలేకపోయాడు. అయితే కొంచెం ఆలస్యమైనా తన తప్పు తెలుసుకొన్న ఘంటసాల తనదగ్గరున్న నలభై రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి అప్పటి ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొన్నాడు.

అయితే అప్పటికే వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉంది. ఆ కళాశాల ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళి విన్నవించగా, ఆయన కళాశాల ఆవరణలో బస చేయడానికి అనుమతి ఇచ్చాడు. అయితే ఘంటసాల కి ఉండడానికి చోటు దొరికినా భోజనానికి చాలా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ఒకసారి తోటివిద్యార్థులు చేసిన ఏదో తప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాలవారు తినడానికి తమ ఇళ్ళకు రావద్దన్నారు. గత్యంతరంలేక ఆ ఊళ్ళో ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నాడు.

అక్కడినుంచి ఘంటసాల కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.కానీ ఆ సమయం నుండే ఘంటసాల అసలైన సంగీత సాధన మొదలైంది. ఓ రోజు ఎల్లమ్మ గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి అనే వ్యక్తి ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. చాలా సార్లు ఘంటసాల తన జీవితంలో గురువంటే ఈయనే అనిచెప్పేవాడు.

అయితే సీతారామ శాస్త్రి చాలా పేదవాడు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కూడా కల్పించలేకపోయాడు. ఈ క్రమంలో ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మాధుకరం (ఒకరకమైన భిక్షాటన) చేయడం నేర్పించాడు. ఘంటసాల భుజాన జోలెకట్టుకొని వీధి వీధి తిరిగి రెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చుకొనేవాడు. ఒక్కోసారి మిగిలిన అన్నాన్ని ఒకగుడ్డలో పెడితే చీమలు పట్టేవి. గిన్నె కొనుక్కోవడానికి కూడా డబ్బులేక మేనమామ పిచ్చయ్య కు ఉత్తరం రాస్తే ఆయన పంపిన డబ్బుతో ఒక టిఫిన్ డబ్బా కొనుకున్నాడు.

వేసవి సెలవులు పూర్తైన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరాడు. అయితే శాస్త్రి ప్రత్యేక శిక్షణ వల్ల నాలుగు సంవత్సరాల కోర్సును, కేవలం రెండు సంవత్సరాలలో పూర్తిచేసాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచిపేరు తెచ్చుకొని తిరిగి చౌటపల్లెకు చేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవాడు. ఆ తర్వాత 1942లో స్వాతంత్య్ర సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని 2 సంవత్సరాలు అలీపూర్ జైల్లో కూడా ఉన్నాడు.

ఆ తర్వాత తన మేనకోడలు సావిత్రిని వివాహం చేసుకున్నాక, సినీ రచయిత సముద్రాల సహకారంతో చిత్ర పరిశ్రమకు వచ్చి చిత్తూరు నాగయ్య, బి.ఎన్. రెడ్డి చొరవతో సినిమాల్లో అవకాశం పొందారు. కొన్నాళ్ళు గాయకుడిగానే పాటలు పాడి, ఆ తరువాత సంగీత దర్శకుడిగా కూడా మారి నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలకు ఎనలేని సేవలు అందించారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు