టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు వరుసగా పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అందులో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కూడా ఒకటి. ఈ చిత్రం షూటింగ్ 40 శాతం పైనే పూర్తయ్యిందని వినికిడి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం దిల్ రాజు బ్యానర్లో రూపొందుతున్న 50 వ చిత్రం కావడంతో ఆయన దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు కంప్లీట్ అయిన షూటింగ్ పోర్షన్ కి సంబంధించిన కొన్ని రషెస్ చూసిన దిల్ రాజు, శంకర్ పై ప్రశంసలు కురిపించారట. అంతేకాకుండా శంకర్ తో మరో సినిమా నిర్మించేందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తుంది.
దిల్ రాజు తన బ్యానర్ ను అన్ని భాషల్లోనూ పాపులర్ చేయాలి అనుకుంటున్నారు. తమిళం లో ఫేమస్ అవ్వడానికి రామ్ చరణ్- శంకర్ ల సినిమాతో పాటు, విజయ్ తో కూడా ఓ బైలింగ్యువల్ మూవీ చేస్తున్నారు. బాలీవుడ్లో ఆల్రెడీ ‘జెర్సీ’ చేశారు. ‘హిట్’ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఆయన ఫోకస్ కన్నడ పై పడింది. ఈ మధ్య కాలంలో కర్ణాటక ఏరియా నుండి తెలుగు సినిమాలకు వచ్చే కలెక్షన్లు తగ్గిపోయాయి. అందుకేనేమో దిల్ రాజు కన్నడ హీరో యష్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
యష్ – శంకర్ కాంబోలో సినిమా చేయించాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో..!