అనిల్ రావిపూడి.. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న దర్శకుడు. ‘పటాస్’ నుండి మొన్నొచ్చిన ‘ఎఫ్3’ వరకు ఇతను తెరకెక్కించిన సినిమాలు అన్ని సక్సెస్ సాధించినవే. ‘ఎఫ్3’ చిత్రం బ్రేక్ ఈవెన్ కాకపోయినా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆ మూవీ బాగా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం అనిల్.. నందమూరి కాంపౌండ్ లో అడుగు పెట్టబోతున్నట్లు స్పష్టమవుతుంది. ఆల్రెడీ బాలయ్య బాబుతో ఓ సినిమా సెట్ చేసుకున్న అనిల్… ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై ఆ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇది పూర్తయిన తర్వాత మహేష్ బాబు తో సినిమా చేద్దాం అనుకున్నాడు అనిల్. కానీ మహేష్ ఇప్పుడు త్రివిక్రమ్ తో.. అటు తర్వాత రాజమౌళి తో సినిమాలు ఓకే చేసుకుని బిజీ కానున్నాడు. కాబట్టి అతనితో సినిమా కష్టం.
అయితే తాజా సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి తనని దర్శకుడిగా పరిచయం చేసిన కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ‘పటాస్’ తర్వాత అనిల్ .. ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ అయిన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ లో ఓ సినిమా చేస్తానని… సందర్భం వచ్చిన ప్రతీసారి చెబుతూనే ఉన్నాడు. ఇన్నాళ్టికి కళ్యాణ్ రామ్ నుండి అనిల్ కు పిలుపు వచ్చినట్టు ఉంది. ఇప్పుడు టాప్ హీరోలు ఎవ్వరూ ఖాళీగా లేరు కాబట్టి.. తాను మాటిచ్చినట్టుగా ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ కోసం ఓ సినిమా చేయడానికి అనిల్ సిద్దపడుతున్నాడట. ‘బింబిసార’ రిలీజ్ తర్వాత ఈ విషయం పై ఓ క్లారిటీ వస్తుందని వినికిడి.