బాహుబలి తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు నిజమే. బాహుబలి తర్వాత అతని మార్కెట్ పది రెట్లు పెరిగింది అదీ నిజమే. ప్రభాస్ సినిమాలకు ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా, 200 కోట్ల షేర్ ఈజీగా కలెక్ట్ చేస్తుంది ఇది అంతకంటే పెద్ద నిజం. ఇలాంటి సందర్భంలో నిర్మాతలు ఆ రేంజ్ లోనే బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. 200 కోట్ల వరకు బడ్జెట్ లోనే ప్లాన్ చేసుకుంటే, సినిమాకు ఒక వేళ నెగిటెవ్ టాక్ వచ్చినా, సులవుగా లాభాలు పొందొచ్చు. కానీ, ప్రభాస్ కు ఇమేజ్ కు మించి బడ్జెట్ పెట్టేస్తున్నారు నిర్మాతలు. సాహో చిత్రానికి 350 కోట్లు, రాధే శ్యామ్ కు రూ.330 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఈ రెండు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా రాణించలేదు.
ప్రస్తుతం ఆదిపురుష్ కు ఏకంగా రూ.400 కోట్ల బడ్జెట్ ను ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో సినిమాను తెరకెక్కిస్తే, కనీసం రెండు నెలల నుండి అయినా, ప్రమోషన్స్ ఉండాలి. కానీ ఇప్పటి వరకు మూవీ యూనిట్ నుండి ఉలుకు పలుకు లేదు. దీంతో ఈ సినిమాకు కావాల్సిన బిజినెస్ ఇంకా కాలేదు. ఇది ప్రభాస్ హిందీలో చేస్తున్న మూవీ. అయినా, ప్రభాస్ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుండే ఎక్కువ రేటు పెడతారు. కానీ, ఈ సినిమాకి ఆ పరిస్థితి కనిపించడం లేదు.
దర్శకుడు ఓం రౌత్ ఇక్కడి జనాలకి పరిచయం లేని పేరు. బాలీవుడ్ లో కూడా ఒకటి అర సినిమాలు తీసిన దర్శకుడే. పైగా తెలుగు రాష్ట్రాల్లో సాహో, రాధే శ్యామ్ మిగిల్చిన నష్టాలు రూ.60 కోట్ల వరకు ఉన్నాయి. పోని, ప్రభాస్ ఇమేజ్ కు ఆదిపురుష్ సరిపోయే మూవీనా అంటే అదీ కాదు. రామాయణంలోని ఇతి వృత్తాన్ని తీసుకుని అల్లిన కథ. ప్రమోషనల్ కంటెంట్ బయటకి వేస్తే తప్ప ఈ మూవీ బిజినెస్ మొదలయ్యేలా లేదు.