Dasari Narayanarao : “దర్శకరత్న” దాసరి నారాయణరావు చేత పరిచయం కాబడిన నటీనటులు.. దిగ్గజాలు..

Dasari Narayanarao : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దర్శకరత్న గా అందరి చేత మన్ననలు అందుకుని నాలుగు దశాబ్దాల పాటు సినీ కళామతల్లికి దర్శకుడిగా, నిర్మాత గా, నటుడిగానూ సేవలందించిన లెజెండరీ దర్శకులు దాసరి నారాయణరావు. దాసరి సినిమా వస్తుందంటే ఏదో ఒక సందేశం తన సినిమాలతో ఇస్తారని అంటుంటారు తెలుగు ప్రేక్షకులు. 90ల్లో ఆయన దర్శకత్వంలో సినిమా వచ్చిందంటే చాలు జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. హీరోలకే కాకుండా దర్శకులకు కూడా అభిమాన సంఘాలు ఉండడం దాసరి నుండే ప్రారంభమయింది అంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలితరం హీరోల నుండి ఇప్పటి మూడో తరం హీరోల దాకా కూడా ప్రతిష్టాత్మక చిత్రాలు తెరకెక్కించిన దాసరి నారాయణరావు, తన సినిమాలతో ఎంతో మంది నటీనటులకు జీవితాన్ని ఇచ్చారు. ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్లు గా రాణించబడుతున్న వారిని స్వయంగా దాసరియే పరిచయం చేయడం జరిగింది. అలా దాసరి నారాయణరావు (Dasari Narayanarao) చేత పరిచయం కాబడ్డ చిత్ర నటీనటుల్ని కొంతమందిని గమనిస్తే…

Actors and Directors introduced by Dasari Narayana Rao

దాసరి నారాయణరావు పరిచయం చేసిన నటీనటులు

మహేష్ బాబు – నీడ (1978)

దాసరి నారాయణరావు దర్శకుడిగా నీడ అనే చిత్రంలో మహేష్ బాబు, అలాగే తన అన్న రమేష్ బాబులను ప్రధాన పాత్రల్లో తీసిన చిత్రమిది. ఈ సినిమాతోనే మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నాలుగున్నరేళ్ల వయసులో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

- Advertisement -

ఆర్. నారాయణమూర్తి – నీడ

టాలీవుడ్ లో విప్లవాత్మక చిత్రాల దర్శకుడు అయిన ఆర్. నారాయణ మూర్తి దాసరి దర్శకత్వం వహించిన నీడ చిత్రంతోనే నటుడుగా పరిచయం కాగా, ఆ తర్వాత విశ్వరూపం లో కూడా దాసరి ఛాన్స్ ఇచ్చి ఆదుకోగా, ఒరేయ్ రిక్షా అనే చిత్రంతో నారాయణమూర్తి హీరోగా సినిమా కూడా తెరకెక్కించారు దాసరి.

మోహన్ బాబు – స్వర్గం నరకం (1976)

ఇక దాసరి మోహన్ బాబులని గురు శిష్యులుగా భావిస్తారు ఇండస్ట్రీలో అందరు. ఎప్పుడూ గురువు గారూ అని పిలిచే మోహన్ బాబు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన స్వర్గం నరకం చిత్రాలతోనే హీరోగా పరిచయం అయ్యాడు.

అన్నపూర్ణ – స్వర్గం నరకం

టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో అమ్మ పాత్రలలో నటించి మెప్పించి, ఇప్పుడు నానమ్మ పాత్రలు చేస్తున్న నటి అన్నపూర్ణ కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ వేషాలు కూడా వేయగా, దాసరి నారాయణరావు స్వర్గం నరకం చిత్రంతోనే ఆమె కూడా హీరోయిన్ గా పరిచయం అయింది.

ఫటాఫట్ జయలక్ష్మి – స్వర్గం నరకం

టాలీవుడ్ లో ఫటా ఫట్ జయలక్ష్మి గా పాపులర్ అయి చిన్న వయసులోనే అర్ధాంతరంగా చనిపోయిన నటి జయలక్ష్మి దాసరి తెరెకెక్కించినస్వర్గం నరకంతో పరిచయం అయింది.

బ్రహ్మ నాయుడు – శ్రీహరి (1987)

టాలీవుడ్ లో రియల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరి ని పరిచయం చేసింది దాసరినారాయణ రావు. కృష్ణంరాజు హీరోగా దాసరి దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మ నాయుడు చిత్రానికి ఫైట్ మాస్టర్ గా చేస్తూనే నటుడిగా పరిచయం అయ్యారు శ్రీహరి.

నరసింహ రాజు – తూర్పు పడమర

టాలీవుడ్ లో కాంతారావు తర్వాత కట్టి వీరుడిగా జానపద చిత్రాలకు కేరాఫ్ అయిన ప్రముఖ నటుడు నరసింహరాజుని దాసరి నారాయణరావు తన దర్శకత్వంలో తూర్పు పడమర చిత్రంతో హీరోగా పరిచయం చేసాడు.

మాధవి – తూర్పు పడమర

టాలీవుడ్ లో 80 లలో స్టార్ హీరోయిన్ గా చెరగని ముద్ర వేసిన హీరోయిన్ మాధవి దాసరి తెరకెక్కించిన తూర్పు పడమర చిత్రంతోనే నటిగా పరిచయం అయింది.

దాసరి అరుణ్ కుమార్ – గ్రీకు వీరుడు (1998)

దాసరి కుమారుడు అయిన దాసరి అరుణ్ కుమార్ ఆయన దర్శకత్వం వహించిన గ్రీకు వీరుడు సినిమాతోనే హీరోగా పరిచయం అవగా, హీరోగా సక్సెస్ కాలేకపోయాడు.

వక్కంతం వంశి – కళ్యాణ ప్రాప్తిరస్తు (1996)

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వక్కంతం వంశి దర్శకుడు, రచయిత కాకన్నా ముందే దాసరి దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు.

సుమ – కళ్యాణ ప్రాప్తిరస్తు

టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా నటిగానూ సుపరిచితురాలైన సుమ దాసరి దర్శకత్వం వహించిన కళ్యాణ ప్రాప్తిరస్తు చిత్రంతోనే హీరోయిన్ గా పరిచయం అయింది.

స్వప్న – స్వప్న మూవీ (1981)

ప్రముఖ మలయాళం, తమిళ్ హీరోయిన్ స్వప్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన స్వప్న చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది.

దాసరి చేత పరిచయం కాబడిన దిగ్దర్శకులు..

ఇక దాసరి నారాయణరావు (Dasari Narayanarao) శిష్యులు కూడా ఇండస్ట్రీ లో దర్శకులుగా రాణించారు. 90లలో స్టార్ డైరెక్టర్లుగా రాణించిన కోడి రామకృష్ణ, రవి రాజా పినిశెట్టి, ముత్యాల సుబ్బయ్య, రేలంగి నరసింహారావు వంటి లెజెండరి దర్శకులు దాసరి శిష్యులే అని చాలా మందికి తెలీదు. ఇక దర్శకుడు కోడి రామకృష్ణ ఏకంగా శతాధిక (100+) చిత్రాలకు దర్శకత్వం వహించి గురువుకు తగ్గ శిష్యుడు అనిపంచుకున్నాడు. ఇక దాసరి నారాయణరావు నటీనటులను పరిచయం చేయడం మాత్రమే కాకుండా ఫామ్ కోల్పోయిన మహానటి సావిత్రి నుంచి ఆంధ్రా దిలీప్‌ చలం వరకూ ఎందరికో కెరీర్ చివరి రోజుల్లో మంచి పాత్రలిచ్చి ఆదుకున్నారు. ఆర్థికంగా వెనకబడ్డ మహానటులకి తనకి తన వంతు సహాయం చేసారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు