52Years For Sri Krishnanjaneya Yuddham : 52 వసంతాల “శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం”.. నాటిక ఆధారంగా తెరకెక్కిన అద్భుతమైన చిత్రం..

52Years For Sri Krishnanjaneya Yuddham : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పౌరాణిక చిత్రాలకు ఓ నాలుగు దశాబ్దాల కింద పెద్ద పీట వేసేవారు. అప్పటి నటీనటులు కూడా కొన్ని చిత్రాలను కమర్షియల్ గా కాకుండా ప్రేక్షకులని మెప్పించడానికి కూడా తీసేవారు. ఇక భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తంలోనూ పౌరాణిక చిత్రాలకు అప్పట్లో తెలుగు సినిమాలే కేరాఫ్ గా ఉండేవి. ఇక పురాణ, ఇతిహాసాలను అద్భుతంగా తెరకెక్కించడంలో ఇతర ఇండస్ట్రీ ల కన్నా తెలుగువారు మేటి అనిపించుకున్నారు. ఇక ఆ రోజుల్లో నటసార్వభౌమ ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలకు కేరాఫ్ గా ఉండగా, అందులోనూ రాముడు, కృష్ణుడు పాత్రలంటే యన్.టి.రామారావే అనేవారు. ఇక ఆయన నటించిన అనేక పౌరాణిక చిత్రాలు ఆ రోజుల్లో అద్భుత విజయం సాధించాయి. ఇక అలాంటి అద్భుత చిత్రాల్లో ‘శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం’ ఒకటి. ఈ క్లాసిక్ చిత్రం విడుదలై నేటికీ (1972 మే 18) 52 వసంతాలు (52Years For Sri Krishnanjaneya Yuddham) పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర విశేషాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

నాటిక ఆధారంగా తెరకెక్కిన చిత్రం..

నిజానికి ఈ కథ పురాణాల్లో కనిపించక పోయినా, శ్రీరాముడు వైకుంఠయానం చేసేటపుడు ఆంజనేయుడు ఎక్కడ ఉన్నాడు? ఉంటే తనతో పాటు తన భక్తుని తీసుకువెళ్ళేవాడు కదా అనే వాదన ఉన్నది. ఈ సందర్భాన్ని ఆధారంగా చేసుకుని రామాయణంలోని కొన్ని అంశాలను ఆంజనేయుని రాముడే దేశబహిష్కరణ విధించేలా ఓ కథను మలిచారు. ప్రముఖ రచయిత “తాండ్ర సుబ్రహ్మణ్యం” రాసిన ‘శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం’ నాటకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఆంజనేయుడు చిరంజీవి కావున, ద్వాపరయుగంలోనూ ఉంటాడు. భీమునితో తలపడతాడు అనే గాథ వినిపిస్తుంది. అలా పలు అంశాలు ఆధారంగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా అవతరించిన శ్రీమహావిష్ణువుతో రామభక్తుడైన హనుమంతుడు తలపడ్డాడని ఓ నాటకం రూపొందించారు. ఈ సినిమా 1972 మే 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో శ్రీకృష్ణునిగా యన్టీఆర్, ఆంజనేయునిగా రాజనాల నటించారు.

52Years For Sri Krishnanjaneya Yuddham Movie

- Advertisement -

కథ విషయానికి వస్తే..

‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’ చిత్రంలో కథ విషయానికి వస్తే.. శ్రీరామచంద్రునికి, లవకుశులను అప్పచెప్పి, భూమాత ఒడిలోకి ఒదిగిపోయిన సీతను మరువలేక శ్రీరాముడు వ్యధతో ఉంటాడు. అది చూసి వశిష్ఠునితో తన ప్రభువు బాధ తీర్చమంటాడు ఆంజనేయుడు. ఆయన బాధను మరొకరు పంచుకోగలిగితే అది సాధ్యమని సెలవిస్తాడు వశిష్ఠుడు. ఓ బ్రాహ్మణోత్తముని వేషంలో ఉన్న యమ ధర్మరాజు తాను ఈ సమస్యకి పరిష్కారం చెప్తానని, కానీ ఏకాంతంలోనే చెప్తానని అంటే, ద్వారం వద్ద ఆంజనేయుడిని ఉంచి, రాముడు పరిష్కారం అడగగా, శ్రీరామావతారం చాలించమని, వైకుంఠంలో లక్ష్మీదేవి తమ రాకకోసమై వేచి ఉందని చెబుతాడు. ఈ సంభాషణ జరుగుతూ ఉండగా దుర్వాసుడు రాముని చూడాలంటే, అందుకు హనుమ వీలు కాదని చెబుతాడు. దాంతో రఘువంశాన్నే శపిస్తాననగానే, భయపడి హనుమంతుడు రాముని వద్దకు వెళతాడు. నియమభంగం చేసిన హనుమకు దేశబహిష్కరణ చేస్తారు. ఆ పై రామావతారం చాలించిన శ్రీమహావిష్ణువు ద్వాపరలో శ్రీకృష్ణునిగా జన్మిస్తాడు. ఈ క్రమంలో ఓ సారి బలరాముడికి ఆంజనేయుని ద్వారా గర్వభంగమవుతుంది. శ్రీరాముడే ఈ యుగంలో శ్రీకృష్ణునిగా జన్మించాడని నారదుడు ఆంజనేయునికి చెబుతాడు. కానీ హనుమ విశ్వసించక, తన రాముడొక్కడే దేవుడని అంటాడు. అయితే ఆ శ్రీకృష్ణునే ఓ పట్టు పట్టమని నారదుడు చెబుతాడు. దాంతో ఆంజనేయుడు ద్వారక వెళ్లగా, శ్రీకృష్ణుడితో శ్రీరామచంద్రుడే గొప్ప అని వాగ్వాదిస్తాడు. శ్రీకృష్ణునిపైకే యుద్ధానికి దూకుతాడు. చివరకు రుక్మిణి వచ్చి, ‘హనుమా… మన ప్రభువు పైకే యుద్ధమునకు దిగితివా…’ అని ప్రశ్నిస్తుంది. దాంతో ఆంజనేయుడికి భ్రమలు తొలగి, శ్రీకృష్ణునిలోనే శ్రీరాముని చూసి తరించడంతో కథ ముగుస్తుంది.

పౌరాణికాల్లో క్లాసిక్ గా నిలిచిన అపూర్వ చిత్రం..

ఇక శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం చిత్రాన్ని పూర్ణిమ పిక్చర్స్ పతాకంపై డి.యన్.రాజు నిర్మించగా, సి.యస్.రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దేవిక, వాణిశ్రీ, ఎస్వీరంగారావు, కాంతారావు, రాజబాబు, చిత్తూరు వి.నాగయ్య, ధూళిపాల, మిక్కిలినేని, ముక్కామల, ఆర్జా జనార్దనరావు, త్యాగరాజు, శాంతకుమారి, హేమలత, రోజారమణి, సంధ్యారాణి, లీలారాణి, తదితరులు నటించారు. టి.వి.రాజు స్వరకల్పన చేసిన ఈ చిత్రానికి సి.నారాయణ రెడ్డి, సముద్రాల జూనియర్ పాటలు రాశారు. “రామా రఘురామా…”, “గోపాల కృష్ణ జయహో…”, “చిక్కని గోపాలకృష్ణుడు…”, “రామలీల…”, “హరే రామ హరే కృష్ణ…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఇక తాండ్ర సుబ్రహ్మణ్యం రాసిన కథకు, ఆయన పద్యాలనే సినిమాలోనూ ఉపయోగించుకున్నారు. ఇక శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల వేషంలో ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాత్రల్లో ఆయన అభినయం ఎప్పటిలాగే అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కంటే కూడా ఎక్కువగా మాట్లాడాల్సింది రాజనాల గురించే. నిజ జీవితంలోనూ ఆంజనేయ భక్తుడైన “రాజనాల” ఇందులో హనుమంతుని పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. అయితే ఆ రోజుల్లో ఈ చిత్రం మొదట్లో ప్రేక్షకాదరణ కు నోచుకోలేదు గాని, తర్వాత రిపీట్ రన్స్ లో ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’ ప్రేక్షకులను మురిపించి వంద రోజులకు పైగా ఆడింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు