నేచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజీం జంటగా నటించిన తాజా చిత్రం అంటే సుందరానకీ. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తొలి రోజు నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న అంటే సుందరానికీ, కలెక్షన్లను రాబట్టడంలో మాత్రం విఫలమవుతుంది. వీకెండ్ తర్వాత ఓ సక్సెస్ మీట్ పెట్టి ‘మా చిత్రం ఆవకాయ లాంటిది. రుచి చూసేకొద్దీ ఊరుతుంది అంటూ వీక్ డేస్ లో స్లోగా పికప్ అవుతుంది’ అన్నట్టు చిత్ర బృందం ఆశలు పెట్టుకుంది. కానీ అలాంటి పాజిటివ్ సైన్ ఏమీ కనిపించగా పోగా, మొదటి సోమవారం ఈ చిత్రం డిజాస్టర్ పెర్ఫార్మన్స్ ను కనపరిచింది. 4వ రోజు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1 కోటి షేర్ ను కూడా రాబట్టలేకపోయింది.
మరోపక్క, వారం ముందుగా రిలీజ్ అయిన కమల్ హాసన్ ‘విక్రమ్’ మాత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. సోమవారం దాదాపు అన్ని సెంటర్లలో విక్రమ్ బాగానే ఆడింది. కొన్ని ఏరియాల్లో అయితే, అంటే సుందరానికీ, కంటే విక్రమ్ సినిమాయే ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది. అంతేకాదు పలు ఏరియాల్లో ఈవెనింగ్ షోలకు హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి. బయ్యర్స్ అనుకున్నదానికంటే భారీ లాభాలను విక్రమ్ తెచ్చిపెట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.