Mega-Rana-Nani : ఇలా ఎందుకు జరుగుతోంది ?

సాధారణ ప్రేక్షకులకు అందుబాటులో ఉండే ఏకైక వినోదం సినిమా. ఫ్యామిలీ తో సరదాగా వీకెండ్ గడపాలంటే ఒక మంచి సినిమాకి వెళ్లాల్సిందే. కానీ, ఇప్పుడు సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారా అంటే అది డౌటే, ఒక సినిమా రిలీజ్ అయ్యాక దానికి భీభత్సమైన టాక్ వస్తే తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావట్లేదు. బాహుబలి, రంగస్థలం, మహానటి , ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలకు ఆడియన్స్ తరలివచ్చారు అంటే దానికి కారణం వాటిలో సరైన కంటెంట్ ఉండటంతో పాటు, ఆ సినిమా జనాల్లోకి వెళ్లడం కూడా.
ఒక మంచి సినిమాను తెరకెక్కించడమే కాదు. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ఇంపార్టెంట్.

ఈ మధ్యకాలంలో రిలీజైన ఆచార్య, అంటే సుందరానికి , విరాటపర్వం లాంటి సినిమాలను పరిశీలిస్తే అవి ఎంతో కొంత ప్రేక్షకుడిని సంతృప్తి పరిచినవే. కానీ ఆ సినిమాల కలెక్షన్స్ మాత్రం ఊహించిన విధంగా లేవు.

దానికి అనేక కారణాలున్నాయి. ఒకప్పుడు సినిమాను వెతుక్కుంటూ ఆడియన్స్ థియేటర్ కి వెళ్ళేవాళ్లు. ఇప్పుడు రెండు వారాలు దాటితే సినిమానే ఓటిటి లో ఇంటికే వచ్చేస్తుంది. దానికి తోడు టికెట్ రేట్స్ కూడా అధికంగా ఉండటం కూడా కలెక్షన్స్ పై ప్రభావం చూపుతోంది.  కరోనా ప్రభావంతో సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టం కలిగింది. అలానే ఒక సాధారణ ప్రేక్షకుడికి కూడా ఎంతోకొంత నష్టం కలిగింది. ఇప్పుడిప్పుడే ఆ నష్టాలను పూడుస్తున్న టైంలో అంత రేట్ పెట్టి టికెట్ కొనుక్కుని ఆడియన్స్ థియేటర్ కి వస్తారా.?  ఫ్యామిలీతో మల్టిఫ్లెక్స్ కి వెళ్లాలంటే దాదాపు 2 వేలు ఖర్చు అవుతుంది. ఈ మధ్యనే ఈ విషయాన్ని గ్రహించిన నిర్మాతలు పదే పదే తమ సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తున్నాం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి టికెట్ల రేట్లు తగ్గడం పక్కన పెడితే, మరింత పెరుగుతున్నాయి.

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “ఆచార్య” సినిమాకి మినిమం బజ్ లేదు, యూట్యూబ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ వీడియోస్ వచ్చినంత వరకు కూడా ఆ ఈవెంట్ జరిగిందని చాలామందికి తెలియలేదు. మెగాస్టార్ కెరియర్ లో “ఆచార్య” ను మించిన డిజాస్టర్స్ ఉన్నా, ఆ సినిమాలను ఆడియన్స్ ఆదరించారు. కానీ ఆచార్య విషయంలో అలా జరగలేదు.

ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో మినిమం గ్యారంటీ ఉన్న హీరో అంటే నాని అని చెప్పొచ్చు. నాని సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన మంచి కలక్షన్స్ వస్తాయి. కానీ రీసెంట్ గా రిలీజైన “అంటే సుందరానికి” కి మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రావట్లేదు. ముందుగా పెంచిన టికెట్ రేట్లను తగ్గించకుండా ఉండటం కూడా దీనికి కారణం అనేది చాలామంది అభిప్రాయం.

దగ్గుపాటి రానా, సాయి పల్లవి హీరో, హీరోయిన్లగా వేణు ఉడుగుల దర్శకత్వంలో నటించిన సినిమా విరాటపర్వం. ఈ సినిమా రిలీజైనప్పటి నుండి విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. వెండితెరపై గీసిన అద్భుత ప్రేమ కావ్యం, యథార్థ సంఘటనను నిజాయితీగా చూపించారు అంటూ పొగడ్తలు వస్తున్నా, కలక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. భాషతో సంబంధం లేకుండా ఒక గొప్ప సినిమాను ఓటిటిలో చూసినప్పుడు మన అభిప్రాయాన్ని ఎలా వ్యక్తీకరిస్తామో అదే స్థాయిలో విరాటపర్వం సినిమా గురించి కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కానీ,  ఎంతైనా సోషల్ మీడియా పొగడ్తలు కలెక్షన్లుగా మారడం లేదు.

ఏది ఏమైనా సినిమా టికెట్ రేట్లను అందుబాటులో ఉంచడం, సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చడం, అలానే ప్రేక్షకుడు పెట్టే టికెట్ రేట్ కూడా సినిమా న్యాయం చెయ్యగలిగితే థియేటర్స్ మళ్ళీ కలకలడుతాయి. లేదంటే విలవిలలాడుతాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు