Tanikella Bharani : 22 ఏళ్ల తర్వాత మళ్లీ !

నటుడు తనికెళ్ళ భరణి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. విలన్ గా, సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన విలక్షణ నటనతో కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తనికెళ్ల భరణి విలక్షణ నటుడే కాదు. మంచి దర్శకుడు కూడా. భరణి దర్శకత్వంలో ‘మిథునం’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

అయితే కొంచెం గతంలోకి వెళ్లి చూస్తే 50 కి పైగా చిత్రాలకు రైటర్ గా కూడా పనిచేశాడు. ఈ విషయం బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. ‘శివ’ ఇండస్ట్రీ హిట్ చిత్రానికి తనికెళ్ళ భరణి డైలాగ్స్ రాశాడు. అలాగే దర్శకుడు శివ నాగేశ్వరరావు తెరకెక్కించిన ఎన్నో చిత్రాలకు రైటర్ గా పనిచేశాడు. చివరిగా 2000 సంవత్సరంలో శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాండ్సప్’ సినిమాకు మాటలు అందించాడు. మళ్లీ 22 ఏళ్ల తర్వాత డైలాగ్ రైటర్ గా మారనున్నాడు తనికెళ్ల భరణి.

మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘లైకా ప్రొడక్షన్స్’ ‘మద్రాస్ టాకీస్’ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. శుక్రవారం టీజర్ కూడా రిలీజ్ అయింది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి అగ్ర నటీ నటులు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్​ 30న విడుదల కానుంది. ఇదిలా ఉండగా, తెలుగు వెర్షన్ కు సంబంధించి డైలాగ్ రైటర్ గా తనికెళ్ల భరణి పనిచేస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు