గతంలో స్టార్ డైరెక్టర్లే. ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. కానీ, ప్రస్తుతం మారిన పరిస్థితులకు తగ్గట్టు సినిమాలు చేసి సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు. వాళ్ళే కోలీవుడ్ సీనియర్ స్టార్ దర్శకులు పి.వాసు, కె.ఎస్.రవికుమార్. అప్పట్లో వీళ్ళతో సినిమాలు చేయడానికి కోలీవుడ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే టాలీవుడ్ కు వచ్చి సినిమాలు తీశారు.
పి.వాసు టాలీవుడ్ లో నాగార్జునతో ‘కృష్ణార్జున’, వెంకటేష్ తో ‘నాగవల్లి’, బాలకృష్ణ తో ‘మహారథి’ వంటి చిత్రాలు తీశాడు. అవి పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో మళ్ళీ కోలీవుడ్ బాట పట్టారు. మరో దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ది కూడా అదే పరిస్థితి. రజినీకాంత్ కు ‘లింగ’ డిజాస్టర్ ఇవ్వడంతో, కోలీవుడ్ హీరోలు రవికుమార్ తో సినిమా అంటే ఆలోచనలో పడ్డారు. అందుకే టాలీవుడ్ కు వచ్చి బాలయ్య తో ‘జైసింహా’ ‘రూలర్’ లాంటి సినిమాలు చేశారు. ‘జై సింహా’ అంతంత మాత్రం ఆడింది. కానీ, ‘రూలర్’ పూర్తిగా నిరాశపరిచింది. దీంతో మళ్లీ కోలీవుడ్ కే వెళ్లాడు.
అవకాశాలు రాని సమయంలో ఈ ఇద్దరు దర్శకులకు రాఘవ లారెన్స్ అవకాశం ఇచ్చాడు. పి.వాసు తో ‘చంద్రముఖి 2’ చేస్తున్నాడు. మరోపక్క కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. లారెన్స్ కు డైరెక్షన్ లో ఎంతో పట్టు ఉంది. కాబట్టి, ఈ సినిమాలకు అన్నీ తానై చూసుకునే అవకాశం ఉంది. వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో ఉన్న ఈ దర్శకులకు రాఘవ లారెన్స్ హిట్ సినిమాలు ఇచ్చే అవకాశం ఉంది.