ఇండస్ట్రీ ఏదైనా, నటీ నటులకు ఉండే కామన్ ప్రాబ్లమ్ బరువు. డైట్ గతి తప్పితే ఇక అంతే. సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోల్స్, మీడియాలో చర్చ. చివరికి సినిమా అవకాశాలే గల్లంతు అవుతాయి. ఇలా తమ బరువును అదుపులో ఉంచుకోకుండా, ఇండస్ట్రీకి దూరమైన నటీ నటులు చాలే మంది ఉన్నారు. దీనికి టాలీవుడ్ నటులు కూడా అతీతమేమీ కాదు.
ఇప్పటికే సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క శెట్టి, ఇండస్ట్రీకి దూరమవుతూ వస్తుంది. ఈ భామకు అవకాశాలు తగ్గాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల నవీన్ పోలిశెట్టితో ఒ సినిమా కన్ఫామ్ అయినా, అనుష్క పాత్ర షూటింగ్ ప్రారంభం కాలేదని, దానికి అనుష్క బరువే కారణమని కొద్ది రోజుల నుండి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
అలాగే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ తెచ్చుకున్న ప్రభాస్ కూడా ఈ మధ్య కాలంలో బరువు కాస్త ఎక్కువగానే పెరిగాడు. సలార్ షూటింగ్ సమయంలో లీక్ అయిన ఫోటోల్లో డార్లింగ్, ఉండాల్సిన దాని కంటే కాస్త ఎక్కువ బరువుగానే ఉన్నాడు. ప్రభాస్ బరువు గురించి సోషల్ మీడియాలో బాగానే ట్రోల్స్ కూడా వచ్చాయి. ఫ్యాన్స్ కూడా డార్లింగ్ బరువు విషయంపై కాస్త అసంతృప్తి గానే ఉన్నారు.
అయితే, ప్రభాస్ లేటెస్ట్ లుక్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆదిపురుష్ డైరెక్టర్ ఓ రౌత్ ముంబైలోని తన నివాసంలో పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. డార్లింగ్ ఈ పార్టీకి అటెండ్ అయ్యాడు. బరువు తగ్గి, స్లిమ్ గా ఉన్న ప్రభాస్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత ప్రభాస్ స్లిమ్ గా కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు.
కాగ డార్లింగ్ ఉన్నట్టుండి బరువు తగ్గడానికి ప్రధాన కారణమే ఉందట. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పాత్ర కోసం డార్లింగ్ సన్నబడ్డాడని తెలుస్తుంది. కాగా, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది.