శ్రీకాళహస్తికి చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని జనార్దన్ కొద్దిరోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యి కోమాలోకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. జనార్ధన్ చావు బతుకుల మధ్య ఉన్న సమయంలో ఎన్టీఆర్ ఫోన్ చేసి మాట్లడాడు. ఎన్టీఆర్ మాటలకు కోమాలో ఉన్న జనార్ధన్ చేతులు కదిపాడు.
‘జనార్దన్… జనార్దన్.. నేను ఎన్టీఆర్ ని మాట్లాడుతున్నాను. నువ్వు త్వరగా కోలుకొని వస్తే కలుద్దాం మనం. దేవుడి మీద భారం పెట్టు. దేవుడిని బలంగా నమ్ముకో. నువ్వు ఎంత త్వరగా కోలుకొని వస్తే అంత త్వరగా కలుద్దాం. నిన్ను చూడాలని నాకు కూడా ఉంది. నేనున్నాను’ అంటూ ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. దీంతో జనార్ధన్ చేతి వేళ్ళు కదిపి బ్రతకడానికి పోరాడటం మొదలుపెట్టాడు. కానీ చివరికి ఇందులో మృత్యువే పై చేయి సాధించింది.
జనార్దన్ పరిస్థితి మంగళవారం విషమించింది. వైద్యులు అత్యవసర చికి అందించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో జనార్దన్ ప్రాణాలను కాపాడలేక పోయినట్టు వారు తెలిపారు. కొడుకుని పోగొట్టుకున్న జనార్దన్ తల్లి షాక్ లోకి వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి ధైర్యం చెప్పడంతో తన కొడుకు ఎలాగైనా బ్రతికొస్తాడు అని వెయ్యి కళ్ళతో వేచి చూసిన ఆ తల్లికి చివరికి కడుపుకోత తప్పలేదు. ఎన్టీఆర్ అభిమానులను ఈ ఘటన విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది.