Nabha Natesh : ఎట్టకేలకు ఇస్మార్ట్ బ్యూటీపై మేకర్స్ కళ్ళు పడ్డాయి… నభాకు వరుస ఆఫర్లు

ఇస్మార్ట్ శంకర్ మూవీతో మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ నభా నటేష్. ఈ కన్నడ భామకు టాలీవుడ్ లో పలు అవకాశాలు వచ్చినప్పటికీ స్టార్ హీరోల సరసన కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు. ముఖ్యంగా శ్రీలీల, మీనాక్షి చౌదరి వంటి హీరోయిన్లు చేస్తున్న హడావిడి ముందు టాలీవుడ్ మూవీ లవర్స్ కు మిగతా హీరోయిన్లు పెద్దగా గుర్తు రావడం లేదు. అలాగే చాలామంది హీరోయిన్లు ఇటీవల కాలంలో అవకాశాలు రాక తెర మరగైపోయారు. ఇక గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ నభాను దాదాపుగా తెలుగు ఆడియన్స్ అందరూ మర్చిపోయారు. ఆమెను హీరోయిన్ అనడం కన్నా సోషల్ మీడియా మోడల్ అంటే బాగుంటుందేమో. ఎందుకంటే చాలాకాలంగా నభా కేవలం ఫోటోలకు ఫోజులిస్తూ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ గడిపేస్తోంది. హాట్ హాట్ ఫోటోలతో మొత్తానికి తాను కూడా ఇండస్ట్రీలో ఉన్నాను అని యూత్ కు గుర్తుచేసే ప్రయత్నం చేసింది. మరి ఆ ప్రయత్నం ఫలించిందో ఏమోగానీ తాజాగా వరుస అవకాశాలు ఆమె ఇంటి తలుపు తడుతున్నాయి. ఇంతకీ ప్రస్తుతం నభా చేతిలో ఉన్న ఛాన్సులు ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

మరో ఇస్మార్ట్ ఛాన్స్ కోసం వెయిటింగ్…
“నన్ను దోచుకుందువటే” అనే మూవీతో 2018లో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది నభా. అయితే అంతకంటే ముందే కన్నడలో ఈ అమ్మడు రెండు సినిమాల్లో హీరోయిన్ గా, మరో పాటలో మెరిసింది. ఇక ఆ తర్వాత అదిగో వంటి సినిమాలో అవకాశం కొట్టేసినా, అది ప్లాఫ్ అవడంతో ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. 2019లో ఇస్మార్ట్ శంకర్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో నభా దశ తిరిగిపోవడం ఖాయం అనుకున్నారంతా. ఆ వెంటనే మాస్ మహారాజ రవితేజ సరసన డిస్కో రాజా, సాయి ధరం తేజ్ కు జోడిగా సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ ఈ రెండూ కూడా యావరేజ్ గా నిలవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది నభా పరిస్థితి. ఇక ఆ తర్వాత అల్లుడు అదుర్స్, మాస్ట్రో అనే సినిమాల్లో నటించినప్పటికీ వర్కౌట్ కాలేదు. దీంతో రీ ఎంట్రీతో ఇస్మార్ట్ శంకర్ స్థాయిలో సక్సెస్ కావాలని నభా గట్టిగానే ట్రై చేస్తోంది.

నభా అప్ కమింగ్ మూవీస్…
నభా నటేష్ తెలుగు సినిమా షూటింగ్ సెట్స్ లో అడుగుపెట్టి దాదాపు మూడేళ్లు గడిచిపోతుంది. 2021 తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది లేదు. ఇక రీసెంట్ గా ఆమెకు యాక్సిడెంట్ కావడం కూడా ఇన్నాళ్లు నభా సినిమాలకు దూరంగా ఉండడానికి ఒక కారణం అంటున్నారు. ఆ గాయం నుంచి కోలుకున్నాక మళ్ళీ సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ప్రస్తుతం నిఖిల్, ప్రియదర్శి వంటి యంగ్ హీరోలతో ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది. నిఖిల్ సిద్ధార్థ కెరీర్లో రూపొందుతున్న ఫస్ట్ పీరియాడికల్ మూవీ “స్వయంభు”లో నటించే అవకాశాన్ని నభా కొట్టేసిందని టాక్ నడుస్తోంది. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా సంయుక్త మీనన్ కనిపించనుంది.

- Advertisement -

ఇక హనుమాన్ మూవీ తో రీసెంట్ గా పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన నిర్మాత నిరంజన్ రెడ్డి నెక్స్ట్ మూవీలో నభా నటేష్ హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ మూవీలో ప్రియదర్శి హీరో పాత్రను పోషించనున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి అవి కూడా ఓకే అయితే మళ్లీ బిజీ అయిపోతుంది అన్నమాట ఈ చిన్నది. కానీ మొత్తానికి నభా చేసిన ప్రయత్నాలు ఫలించి ఇప్పటికైనా మేకర్స్ కళ్ళు ఆమెపై పడ్డాయి. మరి ఈ కం బ్యాక్ లోనైనా నభా స్టార్ హీరోయిన్ రేంజ్ కి దూసుకెళ్తుందా అనేది చూడాలి

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు