మార్వెల్ సినిమాలు..
హాలీవుడ్ నుండి వచ్చే ఈ సినిమాలకు మన దేశంలో అన్ని భాషల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఒక్క క్యారెక్టర్ ను బేస్ చేసుకుని సినిమాలు చేస్తునే ఉంటారు. ఈ తరహా సినిమాలు ఇప్పటి వరకు హాలీవుడ్ లోనే వచ్చాయి. మన దేశంలో ఇలాంటి సినిమాలు చేయడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. కానీ ఫస్ట్ టైమ్ భారత దేశంలో మార్వెల్ తరహాలో సిరీస్ నిర్మించడానికి సిద్ధం అవుతుంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా కేజీఎఫ్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. 2018 లో ఫస్ట్ పార్ట్, 2022 లో సిక్వెల్ మూవీని విడుదల చేశారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలు, భారత చలన చిత్ర పరిశ్రమలో ఓ ట్రెండ్ సెట్ చేశాయి. కేజీఎఫ్ చాప్టర్ – 2 మూవీ ఇప్పటి వరకు 1,180 కోట్లు వసూళ్లు చేసి రికార్డులను కొల్లగొడుతుంది.
అయితే కేజీఎఫ్ – 2 మూవీ చూసినవాళ్లకు, దీనికి సీక్వెల్ ఉంటుందా..? అనే ప్రశ్న వెలుగుతుంటుంది. కేజీఎఫ్ – 3 పై ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ క్లారిటీ ఇచ్చారు. తాజా గా కేజీఎఫ్ నిర్మాత, హోంబలే ఫిల్మ్స్ ఫౌండర్ విజయ్ కిరగందుర్ కూడా కేజీఎఫ్ – 3 ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు, 2024లో రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.
అంతే కాకుండా.. కేజీఎఫ్ లో కొత్త పాత్రలతో ఇండియన్ స్టైల్ మార్వెల్ ప్రపంచాన్ని సృష్టించాలని ఉందని తన మనసులో మాట చెప్పాడు. దీంతో దేశంలో మార్వెల్ స్టైల్ యూనివర్స్ వస్తే వేరే లేవెల్ ఉంటుందని కేజీఎఫ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.