Chandramukhi-2 : ‘చంద్రముఖి 2’ రీమేక్ సినిమానా ?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆ ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.  ఈ చిత్రం హార్రర్ టచ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొంది, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రలో కనిపించిన జ్యోతిక నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె పలికించిన హావభావాలకు నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పులేదు అనిపించింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ అంటూ 2010 లో ‘నాగవల్లి’ వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ చిత్రం ప్రమోషన్స్ లో సీక్వెల్ అని కాసేపు, కన్నడలో తీసిన ‘ఆప్త రక్షక’ కి రీమేక్ అని కాసేపు ప్రకటించారు. ఏది ఏమైనా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అంత రుచించలేదు. కానీ, ‘చంద్రముఖి’ కి ఉన్న క్రేజ్ వల్ల కొంత వరకు కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

ఇదిలా ఉండగా, చంద్రముఖి-2 ఉంటుందని దర్శకుడు పి.వాసు అండ్ టీం ప్రకటించిన విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. యం.యం.కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికవ్వడం మరో విశేషం. అలాగే ‘లైకా ప్రొడక్షన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. అయితే ఈ సినిమా తెలుగులో వచ్చిన నాగవల్లి సినిమాకు రీమేక్ అని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. తెలుగులో వెంకటేష్ కు శిష్యుడిగా చేసిన బ్రహ్మానందం స్థానంలో వడివేలు నటించబోతున్నట్టు వినికిడి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇది నిజమని తెలియాలంటే, మూవీ యూనిట్ నుండి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు