రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, దర్శకుడు మారుతితో మరో సినిమా తెరకెక్కనుంది. వీటన్నింటికి సంబంధించి ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అప్డేట్ వస్తున్నాయనే చెప్పవచ్చు. ఆదిపురుష్ నుంచి ఇప్పటికే దసరా పండుగ సందర్భంగా టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా సలార్, మారుతి-ప్రభాస్ కాంబోలో వచ్చే సినిమాలకు సంబంధించి కూడా ప్రభాస్ పుట్టిన రోజుకి అప్డేట్ ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు.
తాజాగా ప్రాజెక్ట్ కె కి సంబంధించి ఓ సర్ప్రైజ్ అప్డేట్ ఇచ్చారు నాగ్ అశ్విన్. రేపు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న ఊహించని చిన్న ట్రీట్ అయితే వస్తుందని చెప్పేశాడు. ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె నటిస్తున్నారు. మహానటి సినిమా తరువాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కనుంది. ఇటీవలే నిర్మాత అశ్వనిదత్ అక్టోబర్ 18, 2023న ప్రాజెక్ట్ కె చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ సంస్థ తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు అంతర్జాతీయంగా పలు భాషల్లో కూడా ప్రాజెక్ట్ కెని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్‌కి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఆ అప్డేట్ ఏమై ఉండవచ్చని ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ నటించే అన్ని సినిమాల అప్డేట్స్ బర్త్ డే సందర్భంగా రానుండడం విశేషం.